నేడు తొలేళ్లు

ABN , First Publish Date - 2021-10-18T03:54:04+05:30 IST

విజయనగరానికి పండుగ శోభ వచ్చేసింది. ఉత్సవ కళను సంతరించుకుంది. రాత్రి సమయంలో విద్యుత దీపాల వెలుగుల్లో నగర వీధులు, కోట, గంటస్తంభం, ప్రధాన మార్గాలు తేజోవంతంగా కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. దసరాకు వచ్చిన నగర వాసులంతా పైడితల్లి దర్శనానికి బారులుతీరుతున్నారు. అనేక మంది భక్తులు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

నేడు తొలేళ్లు

ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు 

పైడిమాంబకు నదీజలాలు, పంచామృతాలతో అభిషేకం

కరోనా నిబంధనల నడుమ ఏర్పాట్లు

విజయనగరానికి పండుగ శోభ వచ్చేసింది. ఉత్సవ కళను సంతరించుకుంది. 

రాత్రి సమయంలో విద్యుత దీపాల వెలుగుల్లో నగర వీధులు, కోట, గంటస్తంభం, ప్రధాన మార్గాలు తేజోవంతంగా కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. దసరాకు వచ్చిన నగర వాసులంతా పైడితల్లి దర్శనానికి బారులుతీరుతున్నారు. అనేక మంది భక్తులు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పులివేషాలు, ప్రత్యేక వేషధారులు సందడి చేస్తున్నారు. సోమవారం జరిగే తొలేళ్లకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిమాను సంబరానికి భక్తులంతా కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. గత ఏడాది మాదిరి భక్తులంతా టీవీల్లోనూ, ఎల్‌ఈడీ స్ర్కీన్లపై మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది. ఆ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

(విజయనగరం రూరల్‌) 

పైడితల్లమ్మ పండుగకు సర్వం సిద్ధమైంది. సిరిమానోత్సవ సమయం సమీపిస్తోంది. ముందురోజు జరిగే తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవదాయశాఖ సమయాత్తమైంది. తొలేళ్ల ఉత్సవాన్ని తిలకించేందుకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చేవారు. కరోనా నిబంధనల నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొద్దిమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. తొలేళ్ల ఉత్సవానికి మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. పులివేషాలు, డప్పు చప్పుళ్లు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. తొలేళ్లకు పైడిమాంబను సిద్ధం చేసే క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు వివిధ నదీజలాలు, పంచామృతాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఈ తంతును ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు. అనంతరం ఆదివారం రాత్రి 12 గంటల తరువాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. దేవస్థానం, జిల్లా అధికార యంత్రాంగం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. రూ.200 దర్శన టిక్కెట్లను జారీ చేస్తోంది. వీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేశారు.  కరోనా నిబంధనలను అటు దేవదాయశాఖ, పోలీసుశాఖ పక్కాగా అమలు చేస్తున్నాయి. భౌతిక దూరం కన్పించకపోయినా, మాస్క్‌లు ధరిస్తేనే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. 

కోటశక్తికి ఘాటాభిషేకం 

తొలేళ్ల ఉత్సవంలో ప్రధానమైనది కోటశక్తికి ఘాటాభిషేకం. హుకుంపేట వాసులు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఘాటాలను ఆలయానికి తీసుకువస్తారు. ఘటాలు హుకుంపేట, ఉల్లివీధి, గంటస్తంభం మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి. అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వాటిని మేళతాళాలతో ఆలయం ముందు ఉంచుతారు. భక్తులు అమ్మవారి ఆలయం ముందున్న ఘాటాలకు పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం మరో కీలక ప్రక్రియ. సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరమణ చదురుగుడి వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంతాల రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తారు. వీటిని అందుకునేందుకు రైతులు సోమవారం అర్ధరాత్రి వరకూ వేచి ఉంటారు. 

పెరిగిన భక్తుల తాకిడి 

సోమవారం తొలేళ్లు.. మంగళవారం సిరిమానోత్సవం రోజుల్లో పైడిమాంబను దర్శించుకోవాలంటే కష్టం అనుకునే భక్తులంతా ఆదివారం ఆలయానికి బారులుతీరారు. ఉదయం 4 గంటల నుంచి చదురుగుడి భక్తులతో కిటకిటలాడింది. 8 గంటల తరువాత రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో భక్తుల తోపులాటలు జరగలేదు. కానీ గంటల కొద్దీ నిరీక్షించి పైడిమాంబను దర్శించుకున్నారు. కో-ఆపరేటివ్‌ అర్బన బ్యాంకు వరకూ భక్తుల క్యూ కన్పించింది. 


Updated Date - 2021-10-18T03:54:04+05:30 IST