అక్కడ భార్యలను అద్దెకిస్తారు.. రూ.10కే..!

ABN , First Publish Date - 2021-01-24T17:59:02+05:30 IST

మన దేశం పేరుకు పవిత్ర భారతం. ఇక్కడ మహిళలను శక్తి స్వరూపాలుగా భావించాలనేది మన సనాతన ధర్మం. కానీ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. మహిళలను పూజించడం, గౌరవించడం దేవుడెరుగు...

అక్కడ భార్యలను అద్దెకిస్తారు.. రూ.10కే..!

గ్వాలియర్: మన దేశం పేరుకు పవిత్ర భారతం. ఇక్కడ మహిళలను శక్తి స్వరూపాలుగా భావించాలనేది మన సనాతన ధర్మం. కానీ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. మహిళలను పూజించడం, గౌరవించడం దేవుడెరుగు.. అత్యంత హేయంగా వారిపై దాడులు చేసి, అత్యాచారాలు చేసి దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఈ పాశవకత్వానికి పరాకాష్ఠగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ ఓ దురాచారం కొనసాగుతోంది. అదేంటంటే అక్కడి మహిళలను అంగడి సరుకుల్లా విక్రయిస్తుంటారు. ఇంకా హేయం ఏంటంటే సొంత భర్తలే తమ భార్యలను పరాయి పురుషులకు డబ్బుకోసం అద్దెకిస్తుంటారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా, శివపురి గ్రామంలో ఇలాంటి దురాచారమే తరతరలుగా కొనసాగుతోంది. శివపురి ప్రాంతంలో గ్వాలియర్ రాజపుత్రులు నివశిస్తుంటారు. వీరిలో అనేకమంది డబ్బున్నవారు ఉన్నారు. వీరికోసం ఈ ప్రాంతంలో ఓ అనాచారమైన సౌకర్యం అందుబాటులో ఉంది. అదేంటంటే ఆ ప్రాంతంలో ఉండే పేద మహిళల్లో తమకు నచ్చిన వారిని, నచ్చిన సమయంలో అద్దెకె తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఆ పేద మహిళల కుటుంబాల్లో భర్తలు కూడా నిర్మొహమాటంగా అంగీకరిస్తారు. దీనికోసం వారికి కొంత మొత్తంలో నగదు కూడా లభిస్తుంది. ప్రతి ఏడాది సీజనల్‌గా నిర్వహించే ఈ దురాచారానికి ‘అడీచప్రద’ అని వారు పేరు పెట్టుకున్నారు. కూడా వారు పెట్టుకున్నారు.


ఈ దురాచారంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత. 16 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వారి భర్తలు. అయితే దీనిపై మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ ఎలాంటి విలువ ఉండదు. ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా కచ్చితంగా ఆమె సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లిపోవలసిందే. అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి 10 రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల వరకు సదరు మహిళలకు ధర నిర్ణయిస్తుంటారు భర్తలు. దీనికోసం చట్టపరంగా స్టాంపు పేపర్లపై కూడా ఇరు పార్టీలు సంతకాలు చేసుకుని ఒప్పందం చేసుకుంటారు. ఈ విషయం మొత్తం అధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోరు. ఇలాంటి ఒప్పందాలను ఒకే మహిళతో ఎంతమంది మగవారైనా, ఎన్ని సార్లయినా చేసుకోవచ్చు. ఈ దురాచారానికి ఇక్కడి మహిళలు కూడా అలవాటు పడిపోయారు.


ప్రస్తుతం ఈ కుటుంబాల్లో పుట్టిన కొందరు యువతులు వేరే ప్రాంతాల్లో చదువుకోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ కుటుంబాలను ఈ దురాచారం నుంచి బయటపడేసేందుకు ఆందోళనలు సైతం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంత జరుగుతున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోరు. ఇది మాత్రమే కాదు.. ఇలాంటి దురాచారాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. వాటన్నింటిపైనా పోరాడి రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది.

Updated Date - 2021-01-24T17:59:02+05:30 IST