తెలంగాణ వేదన, సాధనల సాక్షి

ABN , First Publish Date - 2021-10-09T06:24:22+05:30 IST

హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దాకా రాజకీయ సాహచర్యం గల అరుదైన తెలంగాణ బిడ్డల్లో ఒకరు ముచ్చర్ల సత్యనారాయణ....

తెలంగాణ వేదన, సాధనల సాక్షి

హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దాకా రాజకీయ సాహచర్యం గల అరుదైన తెలంగాణ బిడ్డల్లో ఒకరు ముచ్చర్ల సత్యనారాయణ. ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ అంటూ నినదించి బూర్గులతో మంత్రివర్గ ఉపసంఘం వేయించిన విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత తలపండిన తెలంగాణ ఉద్యమనేతగా కెసిఆర్‌తో కరీంనగర్‌ సింహగర్జన సభలో వేదిక పంచుకున్న ఘన, సుదీర్ఘ పోరు జీవితం ఆయనది. 1949 నుంచి ఆంధ్రుల వలసను, వారి ఆధిపత్యధోరణిని కళ్లారా చూసి కుమిలి రగిలిన వేదన తెలుసు. 2014 జూన్‌ 2న తెలంగాణ స్వీయపాలన స్వేచ్ఛాజీవనం తెలుసు. ఆంధ్ర గ్రహణం పట్టిన తెలంగాణ అరవై అయిదేండ్ల కాలానికి నిలువెత్తు సాక్ష్యం ముచ్చర్ల. తన 83వ ఏట 2016 అక్టోబర్‌ 10న అస్వస్థతతో ఆయన మరణించారు.


నూనూగు మీసాల వయసు నుంచే తెలంగాణ చెర విముక్తికి రంగంలోకి దిగారు. నిజాం పాలన అనంతరం 1952 నాటికి ఉధృతమైన ఆంధ్రుల వలస, వారి ఆధిపత్యధోరణికి తల్లడిల్లి మా నేల మాకు, మా పాలను మాకు కావాలని జీవనపర్యంతం ఉద్యమబాటలోనే గడిపారు. సంగీత, సాహిత్య, నటనా రంగాల్లో ఆసక్తి, ప్రతిభ గల ముచ్చర్ల తన పాటలతో చురకత్తుల్లాంటి పదాలతో తెలంగాణ గోడును, ప్రజల కర్తవ్యాన్ని నూరిపోశారు. ఆంధ్ర నుంచి వచ్చిన లెక్కల సారుకు, స్థానిక అధ్యాపకుడికి అయిన గొడవలో న్యాయం కోసం స్కూలు బంద్‌కు పిలుపునిచ్చారు. కలెక్టర్‌ కూడా ఆంధ్రవారే అయినందున స్థానికుడినే సస్పెండ్‌ చేశారు. ఇదెక్కడి న్యాయమని గొంతెత్తి సస్పెండ్‌ను తొలగింపజేసినా స్థానికుడి సుదూరప్రాంత బదిలీని ఏమి చేయలేకపోయారు. ఇదంతా నాన్‌ ముల్కీ ఉద్యమానికి ముందటి సంగతి. ఓసారి వరంగల్‌ స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంధ్రప్రాంతం నుంచి 180 మంది టీచర్లను రప్పించి స్థానికులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇలాంటి సంఘటనల్ని ముచ్చర్ల, ఇతర తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోయారు. 1952 జూలై 26న తొలిసారిగా నాన్‌ ముల్కీ గో బ్యాక్‌ అని నినదించారు. ‘ఛోడో జీ తెలంగాణ–చలే జావో రాయలసీమ’ అని పాటకట్టారు ముచ్చర్ల. సెప్టెంబర్‌ 7న ముఖ్యమంత్రి ద్వారా సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుదాకా ఇది సాగింది. చదువు పూర్తయ్యాక, 1957లో తెలంగాణలో ఏర్పడ్డ పంచాయతీరాజ్‌ వ్యవస్థ వల్ల సత్యనారాయణ ముచ్చర్ల గ్రామానికి తొలి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాలలు, దవాఖానాలు, తాగునీరు, పారిశుధ్య వసతుల కల్పన చేశారు. మాదిగలు, ఎరుకల వారి పిల్లలను అందరితో కలిసి కూర్చోబెట్టారు. కూలాలవారిగా బావినీళ్లు, బతుకమ్మ ఆటలు ఉంటే, కలిసి చేసుకునేలా, వాడుకునేలా మార్పులు తెచ్చారు. 1961లో వాణీనికేతన్‌ అనే నాటక సంస్థను స్థాపించారు. ఆసక్తిగల యువతకు నటనలో శిక్షణ ఇచ్చి సంస్థ తరఫున పోటీల్లో పాల్గొనేవారు. ప్రభుత్వ పనుల మంజూరుకు గ్రామపంచాయతీ మ్యాచింగ్‌ గ్రాంటు డబ్బుల కోసం టికెట్లు అమ్మి నాటకాలు వేసి సొమ్మును కూడబెట్టేవారు. మూడుసార్లు గ్రామ సర్పంచ్‌గా, ఆ తర్వాత రెండుసార్లు సమితి ప్రెసిడెంట్‌గా చేశారు. రాజకీయంగా జిల్లా నాయకుడిగా ఎదిగిన ముచ్చర్లకు ఆనాటి కాంగ్రెస్‌ నేత టి. హయగ్రీవాచారి సన్నిహితులు. అగ్రకులాల వారి వద్ద భూములు, ఆస్తులు ఉండడం వల్ల పార్టీ టికెట్లు వారికే లభించడం చూసి యాదవుడైన ముచ్చర్లలో బహుజనవాదం పురుడు పోసుకుంది. తాను సమితి ప్రెసిడెంటుకు పోటీచేసినప్పుడు కూడా హయగ్రీవాచారి ‘ధోతి ఇడిస్తే ధోతి లేనోడు సమితి ప్రెసిడెంటా!’ అని ఎద్దేవా చేసిన సందర్భముంది. అప్పుడు చారి అగ్రకుల వ్యక్తికి మద్దతుగా నిలిచినా ముచ్చర్ల సమితి ప్రెసిడెంట్‌గా నెగ్గారు. హయగ్రీవాచారితో ముచ్చర్ల బంధం పట్టువిడుపులతో కొనసాగింది. 1969 ఉద్యమం చివరి దశలో పోరాట స్ఫూర్తిని రగిలించేందుకు ముచ్చర్ల సంపాదకత్వంలో ‘జై తెలంగాణ’ పత్రిక స్థాపన జరిగింది. దేవులపల్లి ప్రభాకర్‌రావు దీని నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. ముచ్చర్ల సత్తెన్న 1983లో ఎన్టీఆర్‌ ఆహ్వానంపై తెలుగుదేశంలో చేరి, హన్మకొండ నుంచి టిడిపి అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్‌ అభ్యర్థి హయగ్రీవాచారిపై పదివేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్టీఆర్‌ తొలి క్యాబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కుల, ప్రాంత రాజకీయాలతో సరిపడక, బానిసలా ఉండలేక టిడిపికి దూరమయ్యారు. ఎన్టీఆర్‌ పిలిచినా తిరిగి అటువైపు వెళ్లలేదు. 1995లో హైదరాబాద్‌ నవరంగ్‌ టాకీసులో ఒకరోజు జరిగిన తెలంగాణ సభకు హాజరయ్యారు. జయశంకర్‌ సార్‌ ముచ్చర్ల సహాధ్యాయి. ఆ అనుబంధం, పూర్వ ఉద్యమ జీవితం వల్ల ఆయనకు కెసిఆర్‌ వద్ద గౌరవస్థానం దక్కింది. తెలంగాణే ఊపిరిగా బతికి, తానెక్కిన ప్రతి వేదికపై సందర్భోచిత పాటలతో జనాలను ఊర్రూతలూగించిన ముచ్చర్ల పదవుల ద్వారా పైసా కూడబెట్టని నిష్కళంక నేత, బహుజనుల ప్రయోజనం కోసం ధిక్కార గొంతుక వినిపించిన బడుగుల బంధం.

బి. నర్సన్‌ 

(అక్టోబర్‌ 10–ముచ్చర్ల వర్ధంతి)

Updated Date - 2021-10-09T06:24:22+05:30 IST