మూడో దశ లేకుంటే ముప్పే!

ABN , First Publish Date - 2020-08-13T07:33:39+05:30 IST

కరోనాకు తొలి వ్యాక్సిన్‌ సిద్ధమైందంటూ రష్యా చేసిన ప్రకటనతో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే

మూడో దశ లేకుంటే ముప్పే!

  • ఫేజ్‌-3 ట్రయల్స్‌ విఫలమైన సందర్భాలూ గతంలో చాలా ఉన్నాయి
  • 2016 నాటి అధ్యయనంలో వెల్లడి

కరోనాకు తొలి వ్యాక్సిన్‌ సిద్ధమైందంటూ రష్యా చేసిన ప్రకటనతో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే మానవులపై చేసే మూడో దశ పరీక్షలు పూర్తికాకుండానే ఈ వ్యాక్సిన్‌ను హడావుడిగా విడుదల చేయడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ నాణ్యత, కచ్చితత్వంలో ఏవైనా తేడాలు వస్తే ప్రజలకు వ్యాక్సిన్ల పట్ల ఉన్న నమ్మకం పోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారీలో వాహకంగా ఉపయోగించిన వైరస్‌ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని ర ష్యా శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నా.. కొందరు శాస్త్రవేత్తలు ఆ వాదనను అంగీకరించట్లేదు. సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వ్యాప్తి చెందినప్పుడు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను వాడిన వారిలో ఆస్తమా తరహా సమస్యలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మూడో దశ పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్‌ సిద్ధమని ప్రకటించడంపైనే వారందరి అభ్యంతరం. ఎందుకంటే.. మొదటి రెండు దశల ట్రయల్స్‌ కొన్ని వందల మంది మీద, అది  కూడా పూర్తి ఆరోగ్యవంతులపై మాత్రమే చేస్తారు. ఆ దశల్లో వ్యాక్సిన్‌ ప్రభావం, భద్రతను నిర్ధారించుకున్నాక.. మూడో దశలో కొన్ని వేల మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. ఈ దశలో వివిధ తెగలవారిని, వివిధ వయసులవారిని ఎంచుకుని టీకాలు వేస్తారు. మొదటి రెండు దశల్లో కనిపించని దుష్ప్రభావాలేవైనా ఉంటే వేల మందిపై చేసే ఈ మూడో దశ ట్రయల్స్‌లో బయటపడతాయి. అందుకే శాస్త్రజ్ఞులు ఆ అంశంపై అంతగా పట్టుబడుతున్నారు. ఉదాహరణకు.. 2016లో చేసిన ఒక అధ్యయనంలో భాగంగా.. వివిధ వ్యాక్సిన్లు, ఔషధాలకు సంబంధించి అమెరికాలో చేసిన 640 ఫేజ్‌-3 ట్రయల్స్‌ ఫలితాలను పరిశీలించగా అందులో 344 విఫలమైనట్టు వెల్లడైంది. అంటే 50 శాతానికి పైగానే!! ఈ అధ్యయన ఫలితాలు జమా ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే, మూడో దశ పరీక్షలు చేయకుండా వ్యాక్సిన్‌ను విడుదల చేయడం అవివేకమైన చర్య అని.. అనైతికమని యూకే శాస్త్రవేత్త డాక్టర్‌ ఫ్రాంకోయిస్‌ బలోక్స్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఏదైనా పొరపాటు జరిగి ఈ వ్యాక్సిన్‌ వల్ల దుష్ఫలితాలు ఏర్పడితే ఆ ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తుంది. ప్రజలు వ్యాక్సిన్లను నమ్మడం మానేస్తారు’’ అని ఆయన హెచ్చరించారు. ఇక.. మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించని వ్యాక్సిన్‌ను తానైతే కచ్చితంగా తీసుకోనని అమెరికన్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఫ్లోరియన్‌ క్రామర్‌ అన్నారు. రష్యన్లు ఈ వ్యాక్సిన్‌ను వైద్య సిబ్బందికి ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

-స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-08-13T07:33:39+05:30 IST