నగరంలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలకు అనుమతులు

ABN , First Publish Date - 2021-10-14T06:30:44+05:30 IST

నగరంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి ఆనలైన లో దరఖాస్తు చేసిన ఫైల్‌ను ఓ బిల్డింగ్‌ ఇనస్పెక్టర్‌ తన లాగినలోకి తెచ్చుకుని అప్రూవల్‌ ఇచ్చేశారు.

నగరంలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలకు అనుమతులు

అనుమతి లేకుండా..!

నగరంలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలకు అనుమతులు

ఏడాదిలో 130 భవనాల్లో అదనపు అంతస్తులు

నగరపాలక సంస్థ టౌనప్లానింగ్‌లో వసూళ్ల పర్వం

ప్రతి బిల్డింగూ డీవియేషనే... ఆ ముసుగులో చేతివాటం

కీలకంగా ప్లానింగ్‌ సెక్రటరీలు, బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు

డబ్బులిస్తే అప్రూవల్‌... ముడుపులందకపోతే షార్ట్‌ఫాల్స్‌ 

రాజకీయ సిఫార్సులు, డబ్బులందని ఫైళ్లు పైఅధికారులకు.. 

పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా ఆమ్యామ్యాలు 

అనంతపురం కార్పొరేషన, అక్టోబరు13: నగరంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి ఆనలైన లో దరఖాస్తు చేసిన ఫైల్‌ను ఓ బిల్డింగ్‌ ఇనస్పెక్టర్‌ తన లాగినలోకి తెచ్చుకుని అప్రూవల్‌ ఇచ్చేశారు.  ఇలాంటి వాటి వల్ల అక్రమ భవన నిర్మాణాలకు అవకాశమిచ్చినట్లవుతోంది. ఇక ప్లానింగ్‌ సెక్రటరీలు తమ సచివాలయ పరిధిలోనిది కాకపోయినా తమకు అనుకూలంగా ఉన్న ఎల్‌టీపీలుంటే చాలు తమ లాగినలోకి ఆ ఫైల్స్‌ తీసుకుని అప్రూవల్‌ ఇచ్చేస్తున్నారు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో కింది స్థాయిలోనే అవినీతి వ్యవహారాలకు అవకాశమిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

భవన నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ టౌనప్లానింగ్‌ విభాగం అవినీతికి అలవాలమైంది. బిల్డింగ్‌ అప్రూవల్‌కు సంబంధించి ఆ విభాగంలో కొందరు వసూళ్లపర్వానికి తెరలేపారు. బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు, సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే నగరంలో వందల సంఖ్యలో అక్రమ భవనాలు వెలిశాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అనుమతులిచ్చేస్తుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇదివరకు టౌనప్లానింగ్‌ ఆఫీసర్‌(టీపీఓ) స్థాయి అధికారి నుంచే అనుమతులిస్తుండేవారు. 100 చదరపు అడుగుల్లోపు ఉంటే టీపీఓ, 200 చదరపు అడుగుల్లోపు భవనాలకు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌(ఏసీపీ), ఆ పై భవన నిర్మాణాలకు కమిషనర్‌ అప్రూవల్‌ ఇచ్చేవారు. కానీ గత ఏడాది ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. సచివాలయాల్లో విధులు నిర్వర్తించే ప్లానింగ్‌ కార్యదర్శులకు కూడా అప్రూవల్‌ అధికారం ఇచ్చింది. వారితో పాటు బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు సైతం అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇదివరకు టౌనప్లానింగ్‌లో పనిచేసిన ఇద్దరు అధికారులు.. ప్లానింగ్‌ సెక్రటరీలను సైతం ఆమ్యామ్యాలు పుచ్చుకోవడంలో సిద్ధహస్తులను చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 


పైసలిస్తేనే అప్రూవల్‌

భవన నిర్మాణాలకు ఆనలైనలోనే దరఖాస్తు చేస్తారు. లైసెన్సడ్‌ టెక్నికల్‌ పర్సన(ఎల్‌టీపీ)ల పేర్లతో వాటిని పంపుతారు. తొలుత సచివాలయ ఉద్యోగులైన ప్లానింగ్‌ సెక్రటరీలే వాటిని చూస్తారు. ఈ సందర్భంలోనే ఎల్‌టీపీలతో కుమ్మక్కై వాటికి అనుమతులిచ్చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అవసరమైతే తమకు సంబంధం లేని సచివాలయాల పరిధిలోని ఫైళ్లను కూడా తమ లాగినలోకి తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో భవనానికి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 64 మంది ప్లానింగ్‌ సెక్రటరీలుండగా అందులో 65 శాతం మంది సెక్రటరీలు ఇదే వ్యవహారం నడుతున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నర కాలంలో 160 ఫైళ్ల వరకు ప్లానింగ్‌ సెక్రటరీలే అనుమతులిచ్చేసినట్లు తెలిసింది. ఇక రాజకీయ సిఫార్సులుంటే వాటిని పట్టించుకోనట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వని ఫైళ్లదీ అదే దారి. వాటిని వీరు పట్టించుకోకపోతే 48 గంటల్లోపు పైఅధికారుల లాగినకు వెళ్తాయి. ఇక బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లదీ అదే తీరు. ఒక్కో బిల్డింగ్‌ ఇనస్పెక్టర్‌ 50 వరకు భవనాలకు అనుమతులిచ్చినట్లు సమాచారం. వీరైతే భవన యజమానుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒకరు పాతూరులో, మరొకరు కొత్తూరులో భవన నిర్మాణాల విషయంలో వేలుపెడుతున్నట్లు తెలిసింది. ముడుపులు అందని ఫైళ్లకు షార్ట్‌ఫాల్స్‌ పెడుతున్నట్లు సమాచారం. డ్రాయింగ్‌ సరిగా లేదని, డాక్యుమెంట్స్‌ లేవని, సర్వే రిపోర్ట్‌ ఉండాలని, సంతకాలు లేవని ఇలా కారణాలు చూపుతూ షార్ట్‌ఫాల్స్‌ ఇస్తున్నట్లు తెలిసింది. 


ఏడాదిలో 130 భవనాల్లో అదనపు అంతస్తులు

నగరంలో అనుమతి ఒకలా, నిర్మాణం మరోలా జరు గుతోంది. రెండతస్తులకు అనుమతి తీసుకుని మూడంత స్తుల భవనం కట్టేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుం చి ఈ వ్యవహారం నడుస్తున్నా అధికారులు చర్యలు తీసు కోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డింగ్‌ పీన లైజేషన సిస్టమ్‌(బీపీఎస్‌) కింద క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించడం కూడా అక్రమ భవన నిర్మాణాలకు ఊతమిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నగర పరిధిలో 130 భవనాల్లో అదనపు అంతస్తులు నిర్మించినట్లు టౌన ప్లానింగ్‌ అధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలో అనుమతులిచ్చేసిన అధికారులు అదనపు అంతస్తులకు అదనంగా వసూళ్లు చేసినట్లు సమాచారం. 


డీవియేషనలోనూ చేతివాటం....

అనంతపురం నగర పరిధిలో 95శాతం భవనాలు చుట్టూ సెట్‌బ్యాక్స్‌(గాలి,వెలుతురు అందేలా)లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ వాటిపై చర్యలు తీసు కున్న పాపాన పోలేదు. ఓ భవనం నిర్మించాలంటే కనీసం 40అడుగుల రోడ్డు ఉండాలి. కానీ 30అడుగుల రోడ్డు పక్కనే భారీ భవంతులు వెలుస్తుండటం వెనుక ఆమ్యా మ్యాల బాగోతమేననే ఆరోపణలున్నాయి. మూడంతస్తుల భవనానికి చుట్టూ ఒక మీటర్‌ గ్యాప్‌ వదలాలి. కానీ అరమీటర్‌ కూడా వదలడం లేదు. ఇక అపార్ట్‌మెంట్లకు చుట్టూ రెండు మీటర్లు వదలాలి. ఆ నిబంధనలను గాలి కొదిలేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు(డీవియేషన) ఉన్న వాటి విషయంలోనూ బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు, ప్లానింగ్‌ సెక్ర టరీలు చేతివాటం చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌనప్లానింగ్‌లో ఇద్దరు ఏసీపీలు, టీపీఓ లేకపోవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. 


నోటీసులిచ్చాం : మహబూబ్‌జాన, ఇనచార్జ్‌ ఏసీపీ

అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలకు, డీవి యేషన ఉన్న వాటికి నోటీసులిచ్చాం. కమిషనర్‌ ఆదేశాల మేరకు మార్ట్‌గేజ్‌ను బ్లాక్‌ చేయిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా డీవియేషనగా కడితే శాశ్వత కాలం అదనపు పన్ను చెల్లించాల్సిందే. ఇప్పుడు బ్యాంకు రుణం కూడా లింకప్‌ చేశాం. నోటీసులిచ్చిన వాటికి పన్ను చెల్లింపునకు సంబంధించి రెవెన్యూ విభాగానికి ఫార్వర్డ్‌ చేశాం. 

Updated Date - 2021-10-14T06:30:44+05:30 IST