ముందు చూపు లేకనే!

ABN , First Publish Date - 2021-05-06T09:41:05+05:30 IST

లీగ్‌ను అర్ధంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడగలదని ఈసారి ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే ఊహించినవారు లేకపోలేదు.. ఇప్పుడు ఆ ఊహాగానాలే నిజమయ్యాయి.. అందువల్ల కరోనాతో

ముందు చూపు లేకనే!

లీగ్‌ను అర్ధంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడగలదని ఈసారి ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే ఊహించినవారు లేకపోలేదు.. ఇప్పుడు ఆ ఊహాగానాలే నిజమయ్యాయి.. అందువల్ల కరోనాతో టోర్నమెంట్‌ను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించలేదు.. మొత్తంగా ఈ దఫా లీగ్‌ బీసీసీఐతోపాటు ఇతర క్రికెట్‌ బోర్డులకు గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి..


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈసారీ ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహిస్తున్నట్టు కొద్దినెలల కిందట బీసీసీఐ ప్రకటించినప్పుడు దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. అప్పటికి కొవిడ్‌ తొలి దశ విపత్కర పరిస్థితులు సద్దుమణిగాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరింది. దాంతో 14వ సీజన్‌ స్టేడియాల్లో ప్రేక్షకుల నడుమ సందడిగా జరగగలదన్న ఆశలు సైతం చిగురించాయి. కానీ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొవిడ్‌ విజృంభణ క్రమంగా పుంజుకుంది. కఠినమైన బయోబబుల్‌ నిబంధనలు అమలు చేస్తే తప్ప ఐపీఎల్‌ సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, నిబంధనల విషయంలో బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరించింది. దాని ఫలితమే టోర్నీ వాయిదా పడడం.


ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ?

కరోనా రెండో దశ  తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఊహించని పరిణామాలు సంభవిస్తే ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏవీ బీసీసీఐ వద్ద ఉన్నట్టు కనిపించలేదు. మార్చి తొలి వారంలో ప్రారంభమైన కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ ఐపీఎల్‌ సమయానికి ఉచ్ఛదశకు చేరుతుందని అంచనా వేశారు. దాంతో యూఏఈని ప్రత్యామ్నాయా వేదికగా ఎంపిక చేసి ఉంటే టోర్నమెంట్‌ను అక్కడికి తరలించి నిర్వహించేందుకు అవకాశం ఉండేది. 

 

వైరస్‌ అక్కడినుంచేనా ?

గత ఐపీఎల్‌ను యూఏఈలో కేవలం మూడు వేదికల్లోనే నిర్వహించారు. ఆ స్టేడియాలు కూడా బస్సులలో ప్రయాణించే దూరంలో ఉండడంతో లీగ్‌ సురక్షితంగా జరిగింది. కానీ ఈసారి లీగ్‌ను ఆరు వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫలితంగా ఆ వేదికలకు జట్లన్నీ విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. విమాన ప్రయాణాల్లో వైరస్‌ రిస్క్‌ ఎక్కువ. ముంబైలోని ప్రైవేట్‌ ఎయిర్‌ టెర్మినల్‌ ద్వారా క్రికెటర్లు రాకపోకలు సాగించారు. ఆ సమయంలోనే వైరస్‌ బారిన పడి ఉంటారని ఓ ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. అందుకే.. టోర్నీని ఒకే నగరంలో నిర్వహించివుంటే విమాన ప్రయాణాలు తప్పేవని, తద్వారా వైరస్‌ సోకే అవకాశాలను నివారించి ఉండేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఈసారి ఐపీఎల్‌ మొత్తాన్ని ముంబైలోనే నిర్వహించాలన్న ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు. ఆ ఫలితాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


అప్పుడు తప్పినా..

బయోబబుల్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయకున్నా.. 29 మ్యాచ్‌ల తర్వాత కానీ లీగ్‌లో కరోనా కలకలం సృష్టించలేదంటే అదృష్టమనే చెప్పాలి. అవును.. లీగ్‌ ప్రారంభంలో స్టోక్స్‌, మయాంక్‌ అగర్వాల్‌ బబుల్‌ నుంచి బయటకు వెళ్లి లోపలకి వచ్చాక  వారం రోజులు ఐసోలేషన్‌ లేకుండానే వారిద్దరు జట్టులో చేరారు. అదే రీతిలో కోల్‌కతా క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా స్కానింగ్‌ కోసం వెళ్లి వచ్చాడు. కానీ వరుణ్‌ ఉదంతం తర్వాతే లీగ్‌ను కరోనా చట్టుముట్టింది. అదే ఆరంభంలోనే జరిగి ఉంటే టోర్నీని అప్పుడే ఆపేయాల్సి వచ్చేదేమో? ఇంకా.. పేరుకు ఫ్యాన్స్‌ లేకుండా టోర్నీని నిర్వహించినా వీఐపీలు, వీవీఐపీలు, అతిథులు పెద్ద సంఖ్యలోనే మ్యాచ్‌లకు హాజరయ్యారు. వారిలో చాలామంది మాస్క్‌లు ధరించకపోవడాన్ని చూశాం. అలాగే ఆటగాళ్ల భద్రతను ఫ్రాంచైజీలే చూడాల్సి రావడం మరో సమస్య అయింది. మొత్తంగా ఇంతింతై వటుడింతై అన్న చందంగా చిన్నగా మొదలైన నిర్వహణపరమైన లోపాలు లీగ్‌ కొనసాగుతున్న కొద్దీ పెను సమస్యలుగా మారి టోర్నీకే ఎసరుపెట్టాయి. 


రోషనార క్లబ్‌లో..

ఢిల్లీలోని రోషనార క్లబ్‌లో బబుల్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. ముంబై, రాజస్థాన్‌, చెన్నై, సన్‌రైజర్స్‌ టీమ్‌లు రోషనార క్లబ్‌లో ప్రాక్టీస్‌ సెషన్లలో కూడా పాల్గొన్నాయి. క్రికెటర్ల సాధనను వీక్షించడానికి క్లబ్‌ సిబ్బంది, అధికారుల తరఫు బంధువులను అనుమతించారట. వారిలో కొం దరు.. ఆటగాళ్లు వాష్‌ రూమ్‌లకు వెళ్లేటప్పుడు సెల్ఫీల కోసం ఎగబడ్డారట. ఇక, బయట నుంచి కూడా ఆహార పదార్థాలను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 


ఐపీఎల్‌ రద్దు కాలేదు..

ఐపీఎల్‌ రద్దు కాలేదని.. వాయిదా మాత్రమే పడిందని ఆ లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అన్నాడు. ‘వేదికను తరలించి.. రీషెడ్యూల్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. అయితే, ఎక్కువ మంది ఆటగాళ్లు కొవిడ్‌ బారినపడ్డారు. ఇలాంటి సమయంలో షెడ్యూల్‌ను మార్చి నిర్వహించలేం. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఆటగాళ్లు అంతగా సౌకర్యంగా లేరు’ అని చెప్పాడు.  


3 వాయిదాల్లో ఆటగాళ్ల జీతాలు..

ఐపీఎల్‌ వాయిదా పడడంతో ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు జీతాలు ఎలా చెల్లిస్తారనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఎప్పటిలానే టోర్నీ ఆరంభానికి ముందే తొలి వాయిదాను చెల్లించగా మిగిలిన రెండు వాయిదాలు లీగ్‌ ముగిశాక ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం లీగ్‌ వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో కలసి చర్చించి ఆమోద్యయోగ్యమైన పరిష్కారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


బీసీసీఐకి ఎంతనష్టమంటే?

ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడడంతో బీసీసీఐ ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. ఈ ఏడాది పూర్తి సీజన్‌ జరిగుంటే బోర్డుకు సుమారు రూ.4 వేల కోట్లు వస్తుందని అంచనా. కానీ, అర్ధంతరంగా వాయిదా వేయడంతో ఇటు ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు అందరూ నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌ నుంచి బీసీసీఐ తొలుత అంచనా వేసిన ఆదాయంలో 50 శాతమే దక్కనుంది. ఫ్రాంచైజీలతో బోర్డు 50:50 రెవెన్యూ షేరింగ్‌ మోడల్‌పై చర్చించే అవకాశముంది. ఇక, ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయ నష్టాన్ని ఎవరు భరాయిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Updated Date - 2021-05-06T09:41:05+05:30 IST