కాల్వలు లేకుండా .. కల్వర్టులెందుకు ?

ABN , First Publish Date - 2021-04-14T05:18:15+05:30 IST

మండలంలోని కనుపర్తి నుంచి ఎస్టీ రామాపురానికి వెళ్లే దారిలో కొత్తగా వేస్తున్న రోడ్డులో అదనంగా కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నా వాటికి కాల్వలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాల్వలు లేకుండా .. కల్వర్టులెందుకు ?
కాల్వలు లేకుండా ఏర్పాటు చేసిన పైపు కల్వర్టు

పంటల కాలంలో వెయ్యి ఎకరాలు మునకే

ఆందోళనలో  రైతులు


ఇక్కడ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు సాగించేందుకు నూతనంగా రోడ్డు వేస్తున్నారు... ఈ దారి వెంబడి అక్కడక్కడ పైపు కల్వర్టులూ ఏర్పాటు చేస్తున్నారు... కానీ ఈ కల్వర్టుల గుండా నీరు వెళ్లేందుకు కాలువలు తీయడం మరిచారు. ఎక్కడైనా మొదటగా రైతుల అభిప్రాయాల మేరకు కాలువలు తీసి తర్వాత కల్వర్టులు వేస్తారు. కానీ ఇక్కడ కల్వర్టులు వేసి వదిలేయడంతో కాల్వలు తీయకుండా ఇవి మాకెందుకని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా... 


చెన్నూరు, ఏప్రిల్‌ 13: మండలంలోని కనుపర్తి నుంచి ఎస్టీ రామాపురానికి వెళ్లే దారిలో కొత్తగా వేస్తున్న రోడ్డులో అదనంగా కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నా వాటికి కాల్వలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలే లేకుంటే ఆ రోడ్డుకు పైభాగంలో ఉన్న రైతులతో పాటు కింది భాగంలో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిందేనని వాపోతున్నారు. ఈ రోడ్డుకిరువైపులా కొండపేట, కనుపర్తి, బలసింగాయపల్లె రైతులు ప్రతి యేటా వందల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. పైగా ఇదే దారికి పై ప్రాంతంలో కొండపేటలో 500 ఎకరాల ఆయకట్టుకు అవసరమైన చెరువు ఉంది. ఆ చెరువు నీరు ఎక్కువైనా వర్షాకాలంలో వర్షం నీరు నిలిచినా ఆ నీరంతా ఇదే దారిలో ఉన్న ఓ పైపు కల్వర్టుల ద్వారా కింద ప్రాంతానికి అలాగే అలుగు కాల్వలకు వెళుతుంది. ఇప్పటి వరకు ఈ నీరంతా వెళ్లేందుకు కేవలం ఒకే ఒక పైపు కల్వర్టు ఉంది. ఈ కల్వర్టు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ పైపుల్లో ఏదైనా అడ్డు పడిందంటే ఆ నీళ్లన్నీ పంటల్లోకి చేరుతాయి. అందుకే రైతులు శ్లాబు కల్వర్టులు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, రోడ్డుకు తూర్పు వైపున కల్వర్టుల నుంచి రోడ్డు పొడవునా కాల్వ ఏర్పాటు చేస్తే రాబోవు రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కేవలం కల్వర్టులను మాత్రమే చేసి కాల్వలు చేయకుండా వదిలేస్తే నష్టపోయేది రైతులే. ఇప్పటికైనా కాంట్రాక్టరు కానీ, సంబంధిత అధికారులు కానీ రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కల్వర్టులతో పాటు కాల్వలు కూడా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


కాల్వలు లేకుండా పనులెందుకు ? 

కల్వర్టు కట్టేటప్పుడు ముందు ఆ ప్రాంతంలో కాల్వను ఎలా ఏర్పాటు చేయాలి, వాటి వల్ల లాభనష్టాలను అంచనా వేసి పనులు చేస్తారు. కానీ కనుపర్తి ప్రాంతం గుండా రోడ్డు వేయించే అధికారులు ఇలాంటి పనులకు తిలోదకాలిచ్చి కేవలం కల్వర్టులు మాత్రమే వేస్తున్నారు. ఇలా చేస్తే కాంట్రాక్టరుకు లాభమేమో కానీ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిందే.

- రఘురామిరెడ్డి, రైతు, కనుపర్తి


అన్ని శ్లాబు కల్వర్టులే కావాలి

ప్రస్తుతం నీరు వెళ్లేందుకు పైపు కల్వర్టు ఒకటి ఉంది. దీని వల్ల ప్రయోజనం లేదు. ఏ చిన్న పాటి చెత్త, కట్టె పుల్లలు, ప్లాస్టిక్‌ కవర్లు అడ్డుపడినా నీరు సరిగా వెళ్లక ఆ నీరంతా పంట పొలాల మీదకు వస్తుంది. దీని వల్ల నష్టం రైతుకే. అందుకే ఏ కల్వర్టు నిర్మించినా శ్లాబు కల్వర్టు నిర్మిస్తే అందరికీ ప్రయోజనం. 

- నాగిరెడ్డి, రైతు, కొండపేట


Updated Date - 2021-04-14T05:18:15+05:30 IST