పొత్తుల్లేకుండానే ఎన్నికల బరిలోకి!

ABN , First Publish Date - 2022-06-03T08:53:56+05:30 IST

హైదరాబాద్‌, మేడ్చల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని, బీజేపీ భావజాలం, టీఆర్‌ఎస్‌

పొత్తుల్లేకుండానే ఎన్నికల బరిలోకి!

6 నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన

మూడు నెలల ముందే పార్టీ మేనిఫెస్టో 

పార్టీని వీడిన ప్రజాప్రతినిధులకు ఇక నో ఎంట్రీ

కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఇదే మా నినాదం 

ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు

టీపీసీసీ నవ సంకల్ప్‌ శిబిర్‌లో తీర్మానాలు

హైదరాబాద్‌, మేడ్చల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని, బీజేపీ భావజాలం, టీఆర్‌ఎస్‌ సెంటిమెంటు రాజకీయాలకు విరుగుడుగా కాంగ్రెస్‌ మూల సిద్ధాంతం, భావజాలాలకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని మేడ్చల్‌ జి ల్లా కీసరలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నవసంకల్ప మేథోమధన శిబిరం తీర్మానించింది. ‘అవినీతి టీఆర్‌ఎస్‌, మతతత్వ బీజేపీలను ఓడించండి.. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని, గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. వారిని ఇకపై పార్టీలో చేర్చుకోరాదన్న తీర్మానాలనూ శిబిరం ఆమోదించింది. ఉదయర్‌పూర్‌లో జరిగిన ఏఐసీసీ చింతన్‌ శిబిర్‌ నిర్ణయాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో 2023 ఎన్నికలకు రూట్‌ మ్యాప్‌ రూపొందించుకునేందుకు బుధవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన నవ సంకల్ప్‌ శిబిర్‌ గురువారం ముగిసింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, యువజన, వ్యవసాయక అంశాలపైన ఏర్పాటైన గ్రూపులు బుధవారం ఆయా అంశాలపై లోతైన చర్చ జరిపి శుక్రవారం నవ సంకల్ప్‌ శిబిర్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్కకు ప్రతిపాదనలు ఇచ్చాయి. అధిష్ఠానంతో సంప్రదింపులు, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి పలు తీర్మానాలను శిబిరం ఆమోదించింది. ఈ తీర్మానాల్లో బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, వర్గాల వారీగా ప్రజల్ని దగ్గరికి చేర్చుకోవడం వంటి అంశాలపై వ్యూహాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ, సామాజిక పరంగా కీలక తీర్మానాలను నవసంకల్ప్‌ శిబిరం ఆమోదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీకి ఉన్న అనుకూలత, రాజకీయ వాతావరణంను బట్టి పొత్తులు అవసరం లేదన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో 2023 ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే బరిలోకి దిగాలన్న తీర్మానానికి ఆమోదం లభించింది. ఇక జనాభా దామాషాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పెంచక పోవడం పట్ల ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు పెంచుతామంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని తీర్మానించింది. సంస్థాగతంగా చూసుకుంటే.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య తీవ్ర విభేధాలు నెలకొని ఉన్నాయని, వాటిని పరిష్కరించే బాధ్యత ఎవరూ తీసుకోవట్లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇవి ఇలాగే కొనసాగితే ఎన్నికల ముందు తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళనా వ్యక్తమైంది. ఆయా నేతలను ఏఐసీసీ ఇన్‌చార్జీలు పిలిపించి మాట్లాడాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. 

మహిళలనూ ఆకట్టుకునే కార్యక్రమం

రైతు డిక్లరేషన్‌కు రైతాంగంలో ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మహిళల సాధికారతపై కార్యక్రమం నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. మహిళలు.. ముఖ్యంగా స్వయం సహాయక బృందాల మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. రైతు సంఘర్షణ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీని పిలిచినట్లుగానే.. మహిళల సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనేందుకు భావజాలం, సిద్ధాంతపరంగా మండల, జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచీ పార్టీ కార్యకలాపాలను విస్తృతపర్చేందుకు ప్రతి వంద మందికీ ఒక ఇన్‌చార్జిని నియమించాలనుకున్నారు. వ్యవసాయ రంగానికి రైతు డిక్లరేషన్‌ ప్రకటించినట్లుగానే వివిధ వర్గాలకు డిక్లరేషన్‌లు ప్రకటించి ఆయా వర్గాలను దగ్గర చేసుకునే పలు తీర్మానాలను శిబిర్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, మూడు నెలల ముందే మేనిఫెస్టోను విడదుల చేయడం వంటి కీలక తీర్మానాలను ఆమోదించినట్లు ఆయన విలేకరులకు చెప్పారు. 

Updated Date - 2022-06-03T08:53:56+05:30 IST