3 గంటల వ్యవధిలో.. ఏసీబీ వలలో 4 అవినీతిచేపలు!

ABN , First Publish Date - 2022-08-19T08:38:29+05:30 IST

చేయి తడపందే మ్యూటేషన్‌ చేయని ప్రబుద్ధుడు ఒకడు! నోటీసులు సర్వ్‌ చేయడానికి ఆమ్యామ్యా అడిగిన వాడు మరొకడు!! బిల్లు రూపొందించి పై అధికారులకు పంపించడానికి ఇంకొకడు..

3 గంటల వ్యవధిలో.. ఏసీబీ వలలో 4 అవినీతిచేపలు!

ఈ ఏడాది 8 నెలల్లో 61 అవినీతి కేసులు.. ఏసీబీ కేసుల్లో టాప్‌-1లో ట్రాన్స్‌కో


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చేయి తడపందే మ్యూటేషన్‌ చేయని ప్రబుద్ధుడు ఒకడు! నోటీసులు సర్వ్‌ చేయడానికి ఆమ్యామ్యా అడిగిన వాడు మరొకడు!! బిల్లు రూపొందించి పై అధికారులకు పంపించడానికి ఇంకొకడు.. సొంత శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి పదోన్నతికి సంబంధించి పత్రాలు ఇవ్వడానికి సిగ్గు లేకుండా డబ్బులడిగిన మరో లంచావతారుడు!! ఇలా.. గురువారం ఒక్కరోజే మూడు గంటల వ్యవధిలో నలుగురు అవినీతిపరులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ నాలుగు కేసుల వివరాలు పరిశీలిస్తే.. ఓ కేసులో నోటీసులు ఇచ్చేందుకుగాను వేములవాడ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ గురువారం ఉదయం 11.56 గంటల సమయంలో రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అలాగే.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మెదక్‌ జిల్లా చేగుంట మండలం డిప్యూటీ తహసిల్దార్‌ చంద్రశేఖర్‌ తన అనుచరుడి ద్వారా రూ. 2.50 లక్షలు లంచం తీసుకుని ఏసీబీకి చిక్కాడు. కొసమెరుపు ఏంటంటే... చంద్రశేఖర్‌ అనుచరుడైన అనిల్‌ కుమార్‌ కూడా రూ.20 వేలు తీసుకుని దొరికిపోయాడు. మ్యూటేషన్‌ కోసం వారు తీసుకున్న లంచమిది. ఈ కేసులో బాధితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం మరో విశేషం. అలాగే.. మధ్యాహ్నం 1.55 నిమిషాల సమయంలో హైదరాబాద్‌ మింట్‌ కంపౌండ్‌లోని ప్రభుత్వ పుస్తక ముద్రణాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న టి. నరేష్‌ కుమార్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.


అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి పదోన్నతికి సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు అతడు ఈ మొత్తం డిమాండ్‌ చేసి తీసుకోవడం గమనార్హం. మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌ ఏఈ బి.గోవింద రాజు కోదాడ హుజూర్‌నగర్‌ రోడ్డులోని రిలయన్స్‌ స్మార్ట్‌ పాయింట్‌ ఎదురుగా రూ.29 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. చేసిన పనులకు బిల్లు రూపొందించి పై అధికారులకు పంపించేందుకు కాంట్రాక్టర్‌ నుంచి అతడు ఈ లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నాడు. ఇలా ప్రభుత్వోద్యోగుల్లో కొందరు ప్రతి పనికీధర కట్టి దర్జాగా వసూలు చేస్తుండడంపై ఆందోళన  వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌కో, రెవెన్యూ, పోలీస్‌, మునిసిపల్‌.. ఇలా శాఖ ఏదైనా లంచం మాత్రం సర్వసాధారణంగా మారింది. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ విభాగాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న ఉద్యోగుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ మొత్తం 61 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి కేసులు నమోదు చేశారు. 2021లో ఏసీబీ నమోదు చేసిన మొత్తం కేసులు 90 కాగా.. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే కేసుల సంఖ్య 60 దాటడం విశేషం. ఇప్పటి వరకూ ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో అత్యధికం ట్రాన్స్‌కో విభాగానికి చెందినవే. ఆ తర్వాతి స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. కాగా.. ఇండియా కరప్షన్‌ సర్వే గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం అవినీతిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది.

Updated Date - 2022-08-19T08:38:29+05:30 IST