పురపోరు షురూ

ABN , First Publish Date - 2021-03-02T05:16:40+05:30 IST

జిల్లాలో నగర, పురపాలక ఎన్నికలు పట్టణాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కోర్టు స్టే కారణంగా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగడం లేదు. కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీలు,

పురపోరు షురూ

అభ్యర్థి ఉంటేనే నామినేషన ఉపసంహరణ

వీడియో చిత్రీకరణ తప్పనిసరి

పక్కా ఆదేశాలు జారీ చేసిన ఎస్‌ఈసీ

రాయచోటిలో నామినేషన్ల దాఖలుకు ఇద్దరికి అవకాశం 

ఆధారాలు లేకపోవడంతో 12 ఫిర్యాదుల తిరస్కరణ

నేడు, రేపు నామినేషన్ల వితడ్రాలు


పుర పోరు షురూ అయ్యింది. నేటి నుంచి నామినేషన్ల ఉప సంహరణ.. రేపటితో వితడ్రా గడువు ముగుస్తుంది. బుజ్జగింపులు, బేరాలు, బెదరింపులతో మెజార్టీ వార్డులు ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు.. ధీటుగా ఎదుర్కొంనేందుకు ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు సాగుతున్నాయి. మరో పక్క పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వీడియో చిత్రీకరణలో అభ్యర్థి ఉంటేనే నామినేషన వితడ్రాకు అనుమతి ఇస్తారు. రాయచోటిలో దౌర్జన్యం, బెదిరింపుల వల్ల గతేడాది నామినేషన్లు వేయని ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు, ఎర్రగుంట్లలో ముగ్గురికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. నేటి నుంచి మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుండడంతో పట్టణాల్లో రాజకీయ వేడి రాజుకుంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో నగర, పురపాలక ఎన్నికలు పట్టణాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కోర్టు స్టే కారణంగా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగడం లేదు. కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల ఎన్నికలకు ఫిబ్రవరి 15న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. గతేడాది మార్చి 11 నుంచి 13వరకు నామినేషన్లు స్వీకరించారు. ఆయా మున్సిపాలిటీల్లో 257 వార్డులకు 1,543 నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైసీపీ అభ్యర్థులు 624, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు 249, బీజేపీ/జనసేన అభ్యర్థులు 100, ఇతరులు 479 నామినేషన్లు వేశారు. గతేడాది మార్చి 15న కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచే జరిపేందుకు ఏడాది తరువాత ఎస్‌ఈసీ షెడ్యూలు ఇచ్చింది. అందులో భాగంగానే నేటి నుంచి రెండు రోజులు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పక్కాగా.. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సి.హరికిరణ్‌ నేతృత్వంతో ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.


అభ్యర్థి ఉంటేనే వితడ్రా

నామినేషన ఉపసంహరించుకోవాంటే అభ్యర్థే నేరుగా ఆర్‌ఓ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు. అభ్యర్థి, ఆ అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి, అభ్యర్థి ఎన్నికల ఏజెంట్‌ వీరిలో ఎవరు వచ్చినా నామినేషన వితడ్రా చేసేవారు. తాజాగా పురుపాలక ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిబంధనకు చెక్‌ పెట్టింది. అభ్యర్థి ఉంటేనే వితడ్రాకు అకాశం ఇవ్వాలని పక్కా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఏ అభ్యర్థి అయినా నామినేషన ఉప సంహరించుకుంటే ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. ఆ దిశగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వుల మేరకు అభ్యర్థి ఉంటేనే నామినేషన ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. లేదంటే ఆయన పోటీలో ఉన్నట్లు ధ్రువీకరించి అభ్యర్థుల జాబితాలో పేరు చేరుస్తారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ బి-ఫారం ఇస్తే ఆ పార్టీ గుర్తు కేటాయిస్తారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి ఎన్నికల గుర్తును ఆర్‌ఓ కేటాయిస్తారు.


ఐదుగురికి అవకాశం

గత ఏడాది మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు, వితడ్రా సమయంలో దౌర్జన్యం, బెదిరింపుల కారణంగా బలవంతంగా వితడ్రా చేసుకున్నవాళ్లు, ప్రత్యర్థి దౌర్జన్యం వల్ల నామినేషన వేయలేని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. అయితే.. ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు ఫిర్యాదు చేయమని సూచించింది. జిల్లాలో కడప కార్పొరేషన, రాయచోటి మున్సిపాలిటీ, ఎర్రగుంట్ల నగరపంచాయతీ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హరికిరణ్‌కు 17 ఫిర్యాదులు అందాయి. అందులో భయాందోళన కలిగించడంతో నామినేషన్లు వేయలేదని రాయచోటి నుంచి 6, కడప నుంచి 4 ఫిర్యాదులు వచ్చాయి. దౌర్జన్యంగా, బలవంతంగా నామినేషన్లు వితడ్రా చేయించారని ఎర్రగుంట్ల నుంచి 6, కడప నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చాయి. ఎస్‌ఈసీ ఆదేశాలలో పేర్కొన్న మేరకు ఎలాంటి ఆధారాలు చూపలేదని కలెక్టరు ఫిర్యాదులను తిరస్కరించారు. ఆ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. కలెక్టరు పంపిన నివేదికను పరిశీలించిన ఎస్‌ఈసీ రాయచోటి మున్సిపాలిటీలో 20వ వార్డు టీడీపీ అభ్యర్థి కె.వెంకటచలపతి, 31వ వార్డు టీడీపీ అభ్యర్థి రహిమానలకు మళ్లీ నామినేషన వేసేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఎర్రగుంట్లలో 6వ వార్డుకు మద్దూరు హరిప్రసాద్‌రెడ్డి (వైసీపీ), 11వ వార్డు షేక్‌ రహంతుల్లా (జనసేన), 15వ వార్డుకు మంజుల దివ్యధరణి (బీజేపీ) ఎన్నికల కమిషన అవకాశం కల్పించింది. వీరు ఐదుగురూ నేడు నామినేషన వేయాల్సి ఉంటుంది. ఎస్‌ఈసీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటారో.. పోటీకి దూరంగా ఉంటారో వేచి చూడాల్సిందే.


వైసీపీ అభ్యర్థుల్లో గుబులు

నామినేషన ఉపసంహరణకు అభ్యర్థి ఉండాల్సిందే..! ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. గత ఏడాది నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే భయపెట్టో, బేరమాడో, బుజ్జగించో పలువురు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పందాలు చేసుకున్నారు. వారి నుంచి వితడ్రా ఫారాలపై సంతకాలు కూడా తీసుకున్నారనే సమాచారం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా ఎస్‌ఈసీ నిబంధనతో అభ్యర్థే ఆర్‌ఓ వద్దకు వచ్చి నామినేషన వితడ్రా చేసుకోవాలి. నాడు ఒప్పందం చేసుకున్న వ్యక్తి నేడు ఆర్‌ఓ వద్దకు వస్తారా..? వైసీపీ అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన ఇది.


వివిధ మున్సిపాలిటీల్లో దాఖలైన నామినేషన్లు

---------------------------------------------------------

మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు

--------------------------------------------------------

కడప   50 389

ప్రొద్దుటూరు    41 276

మైదుకూరు    24 144

జమ్మలమడుగు 20 125

ఎర్రగుంట్ల      20 124

బద్వేల్‌ 35 177

రాయచోటి 34 173

పులివెందుల 33 45

-------------------------------------------------------------

మొత్తం 257 1,453 

---------------------------------------------------------------

Updated Date - 2021-03-02T05:16:40+05:30 IST