Abn logo
Mar 2 2021 @ 22:54PM

ఉపసంహ‘రణం’!


తొలిరోజు 300 మంది నామినేషన్ల ఉపసంహరణ

పార్వతీపురంలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా

 (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

పుర పోరులో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. తొలిరోజు వివిధ పార్టీల అభ్యర్థులు, డమ్మీలు 300 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లాలో విజయనగరం కార్పొరేషన్‌తో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మునిసిపాల్టీలకు, నెల్లిమర్ల నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో కరోనాతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. నిలిచిపోయిన చోట నుంచే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. వివిధ కారణాలతో వార్డు, డివిజన్‌ అభ్యర్థులు చనిపోయిన చోట కొత్తగా నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించారు. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. మంగళవారం విజయనగరం నగరపాలక సంస్థలో 89 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పార్వతీపురం మునిసిపాల్టీలో 30 మంది, బొబ్బిలిలో 27 మంది. సాలూరులో 34 మంది, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఐదుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బుధవారం చివరి రోజు ఎక్కువమంది నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది.  ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తుది పోరులో ఎంతమంది నిలుస్తారో తేలనుంది. 


ప్రతిష్టాత్మకంగా..

మునిసిపల్‌ ఎన్నికలను అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకున్న వైసీపీ... అదేస్థాయిలో మునిసిపాల్టీల్లో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో బలం పుంజుకున్న టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మునిసిపాల్టీలో ఆ పార్టీ పరిస్థితి పర్వాలేకున్నా పార్వతీపురం, సాలూరు మునిసిపాల్టీల్లో మాత్రం నాయకుల ప్రోత్సాహం కరువవుతోంది. ముఖ్యంగా పార్వతీపురంలో కొన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అధికార పక్షానికి ఏకగ్రీవమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆది నుంచీ ఇక్కడ అభ్యర్థుల ఎంపికలోనే లోపాలు జరిగినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక్కడ కీలక నాయకులు పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం, అధికార పార్టీ ఒత్తిళ్లతో టీడీపీ అభ్యర్థులు జారిపోతుండడంతో శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. మరో ఏడు వార్డుల్లో కూడా అభ్యర్థులతో అధికార పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం మునిసిపాల్టీ విషయంలో పార్టీ జిల్లా నాయకత్వం కూడా దృష్టి సారించకపోవడంపై శ్రేణులు మండిపడుతున్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పీఠం ఎస్పీ మహిళకు రిజర్వ్‌ చేయడంతో చాలామంది కీలక నాయకులు పోటీకి ఆసక్తిచూపలేదు. టీడీపీ విషయానికొస్తే ద్వితీయ శ్రేణి నాయకులను బరిలో దింపారు. సాలూరు మునిసిపాల్టీలో మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ఎన్నికల బాధ్యత తీసుకున్నారు. ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి దూరంగా ఉన్నా...ఆమె అనుచరులు పోటీ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇక్కడ అభ్యర్థుల పోటీపై స్పష్టత రానుంది. విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మునిసిపాల్టీల్లో అక్కడి పార్టీ ఇన్‌చార్జిలు బలమైన అభ్యర్థులను బరిలో ఉంచారు. అన్నివిధాలా అండగా నిలుస్తుండడంతో శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. అదే స్ఫూర్తి మిగతాచోట్ల ప్రదర్శించాలని కార్యకర్తలు కోరుతున్నారు. 


విశాఖలో విజయనగరం పంచాయితీ

విజయనగరం కార్పొరేషన్‌లో అధికార వైసీపీ అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి వర్గంతో పాటు అవనాపు విక్రం వర్గం వారు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 50 డివిజన్లకుగాను 21 డివిజన్లలో విక్రమ్‌ వర్గానికి గట్టి పట్టు ఉంది. ఎవరికి వారు తామే పార్టీ అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది. సోమవారం రాత్రి ఇదే విషయంపై విశాఖలో పంచాయితీ నడిచింది. విజయసాయిరెడ్డి సమక్షంలో చర్చలు నడిచాయి. విక్రమ్‌కు నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో విక్రమ్‌ వర్గం వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే కోలగట్ల ఇచ్చిన జాబితాలో ఉన్న వారికే బీ ఫారాలు అందించనున్నట్టు సమాచారం.  

 

సమన్వయంతో పనిచేయండి

 సమన్వయంతో పనిచేసి విజయనగరం కార్పొరేషన్‌లో విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం కార్పొరేషన్‌లోని టీడీపీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వైసీపీ ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని..దానిని తిప్పికొట్టాలన్నారు. ఎప్పటికప్పుడు అధికార పక్షం తప్పిదాలను వాట్సాప్‌తో పాటు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం ఆస్తి, కుళాయి పన్నులు పెంచనున్న దృష్ట్యా ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నారు. ప్రచారంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలన్నారు. కొద్దిరోజుల పాటు కష్టించి పనిచేస్తే విజయం తప్పకుండా చేకూరుతుందన్నారు. బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలని అభ్యర్థులకు సూచించారు.  కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement