ఆరు స్థానాల్లో ఫలించని ‘విత్‌డ్రా’ మంత్రం

ABN , First Publish Date - 2021-11-27T08:59:21+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణలు ముగిశాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును ఏకగ్రీవం చేసేందుకుగాను ఆ పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆరు చోట్ల ఫలించాయి.

ఆరు స్థానాల్లో  ఫలించని ‘విత్‌డ్రా’ మంత్రం

  • అధికార పార్టీ నేతలకు లొంగని స్వతంత్ర అభ్యర్థులు
  • ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు పోటీగా ఏకైక అభ్యర్థి
  • తప్పించేందుకు ప్రయత్నాలు.. అడ్డుకున్న బీజేపీ
  • నల్లగొండ బరిలో ఏడుగురు, కరీంనగర్‌లో 10 మంది
  • డిసెంబరు 10న ఎన్నికలు.. ఆరు జిల్లాల్లోనే ‘కోడ్‌’
  • కల్వకుంట్ల కవిత సహా ఆరుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణలు ముగిశాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును ఏకగ్రీవం చేసేందుకుగాను ఆ పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆరు చోట్ల ఫలించాయి. మరో ఆరు స్థానాల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా, మరి కొందరు అభ్యర్థులు పట్టుదలగా బరిలో నిలిచారు. దీంతో ఈ ఆరు స్థానాల్లో డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల పరిఽధి ఉన్న ఐదు జిల్లాల్లోనే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు. ఇప్పటికే నిజామాబాద్‌ జిల్లాలో కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, మహబూబ్‌నగర్‌లో కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరికి ఆయా రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఇక ఖమ్మం, మెదక్‌ స్థానాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలోకి దిగగా, ఆదిలాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌ స్థానాల్లో స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో 24 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా.. 22 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌కు పోటీగా స్వతంత్ర అభ్యర్థి పెందూర్‌ పుష్పరాణి బరిలో నిలిచారు. పుష్పరాణి నామినేషన్‌ను ఉపసంహరింపజేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయితే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ యువకుడు.. పుష్పరాణి తరపున నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చారు. అతణ్ని పుష్పరాణితోపాటు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. 


నల్లగొండ బరిలో ఏడుగురు..

నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని ఏకగ్రీవం చేసేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ స్థానం నుంచి మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేయగా చివరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థితోపాటు మరో ఆరుగురు స్వతంత్రులు బరిలో నిలిచారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు కుడుదుల నగేష్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో స్వతంత్ర అభ్యర్థి, నల్లగొండ జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇక ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ తరఫున రాయల నాగేశ్వర్‌రావు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌రావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌తోపాటు మరో ఏడుగురు ఉన్నారు. రవీందర్‌సింగ్‌ పేరును బీజేపీ, టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు.

Updated Date - 2021-11-27T08:59:21+05:30 IST