చరిత్ర ఏ రాజ్యంతో ప్రారంభమైంది? గ్రూప్-1 అభ్యర్థులకు..!

ABN , First Publish Date - 2022-08-09T20:52:16+05:30 IST

ప్రధానంగా భారతదేశ చరిత్ర(History of India) మగధ(నేటి బిహార్‌లోని పట్నా ఆనాటి మగధ రాజధాని) రాజ్యంతో ప్రారంభమవుతుంది. క్రీ.పూ.6వ శతాబ్దంలో ‘మగధ’ మొట్టమొదటి రాజ్యంగా

చరిత్ర ఏ రాజ్యంతో ప్రారంభమైంది? గ్రూప్-1 అభ్యర్థులకు..!

ఇండియన్‌ హిస్టరీ


ప్రధానంగా భారతదేశ చరిత్ర(History of India) మగధ(నేటి బిహార్‌లోని పట్నా ఆనాటి మగధ రాజధాని) రాజ్యంతో ప్రారంభమవుతుంది. క్రీ.పూ.6వ శతాబ్దంలో ‘మగధ’ మొట్టమొదటి రాజ్యంగా అవతరించింది(బౌద్ధ సాహిత్యంలోని ‘అంగుత్తసికాయ’లో 16 మహాజనపదాల గురించి, ప్రత్యేకంగా మగధ గురించి ప్రస్తావించారు). రాజ్య ఆవిర్భావానికి కావాల్సిన 7 అంశాలు(సప్తాంగ సిద్ధాంతం అనుసరించి) మొదటగా మగధరాజ్యం(Kingdom of Magadha)లోనే ఆవిర్భవించాయి. 


కౌటిల్యుని అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతం పూర్తి వివరాలు ఉన్నాయి. అవి..


1.రాజు,

2.ఆమాత్య(ప్రధాని), 

3.జన(రాజ్యం),

4.దుర్గం(కోటలు), 

5.కోశ(ఖజాన),

6. సేన(సైన్యం), 

7.మిత్ర(స్నేహితులు).


క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ రాజ్యం బిహార్‌, గంగానదికి దక్షిణాన గల ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. దీని రాజధాని రాజగృహ(నేటి రాజగిరి). తరవాత పాటలీపుత్రం(నేటి పట్నా). మగధ రాజ్యం, అచ్చవీ, అంగ(బెంగాల్‌) రాజ్యాలను జయించి, విశాలమైన భూభాగాన్ని ఆక్రమించుకుంది. మొదటిసారిగా మగధ రాజ్యం గురించి ‘అధర్వణ వేదం’లో ఉంది. మగధను(కికాట) రాజ్యంగా ఉపయోగించారు. ఆధునిక చరిత్రకారులు బిహార్‌లోని ‘వీబరు’, ‘జిమ్మెర’ తెగలకు చెందిన ప్రజలుగా గుర్తిస్తున్నారు. ఓల్టెనుబర్గ్‌, హిలా్ట్రండ్‌, ఐరోపా చరిత్రకారులు మాత్రం ‘కికాట’ ప్రాంతం గయ దగ్గర ఉందని సూచించారు. మరికొంత మంది ఎ.ఎన్‌.చంద్ర వంటివారు ‘కికాటో’ని సింధు లోయలోని ఒక ప్రాంతంగా చెప్పారు. భగవత పురాణంలో కికాటలలో బుద్ధుని జన్మ గురించి ప్రస్తావించారు. అధర్వణ వేదం ప్రకారం గాంధారి(ఆఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌) ప్రజలు, అంగ(బెంగాల్‌) ప్రజలు ముజావతులతో చేరి మగధ రాజ్యంలో స్థిర పడ్డారు. గిరివ్రజను రాజగిరిగా పిలిచారు.


మగధ రాజ్యం గురించి, బౌద్ధ, జైన, హిందూ మత గ్రంథాలలో వివరాలున్నాయి. బౌద్ధస్థాపకుడు గౌతమ బుద్దుడు తన జీవితంలో ఎక్కువ భాగం మగధ రాజ్యంలోనే గడిపాడు. ఆర్నాల్డ్‌ తన ‘లైట్‌ ఆఫ్‌ ఏషియా’ గ్రంథంలో ఈ విషయం పేర్కొన్నాడు.  మొదటి బౌద్ధ మహా సమావేశం క్రీ.పూ.483లో ‘రాజగ్రహ’లోనే జరిగింది. రాజకీయంగా మగధలో వంశ పారంపర్య రాజరికం అనుకూలంగా మారింది. సమకాలీన మహాజనపదాల్లో రాజులు ఎన్నికయ్యారు. రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు కాగా, మగధ రాజ్యానికి ముందు నుంచి రాజరికం వంశపారంపర్యం అయ్యింది. దీంతో  మగధకు రాజరికం సుస్థిరతకు గొప్పగా అనుకూలించింది. ఇతిహాసాల్లో బృహద్రుడిని మగధ మొదటి పాలకుడుగా పేర్కొంది. హర్యాంక వంశంలో బింబిసారుడు అంగరాజ్యాన్ని జయించాడు. అతని కుమారుడు అజాతశత్రు తన తండ్రి బింబిసారుని చంపడమేకాకుండా, పొరుగున ఉన్న ‘కోసల’ రాజు ప్రసేనజిత్తుకి తన తండ్రి ఇచ్చిన కాశీ రాజ్యాన్ని తిరిగి పొందాడు. అచ్చలీ రాజ్యాన్ని దెబ్బతీశాడు. శతృవులను ఓడించడానికి రెండు నూతన ఆయుధాలు కనిపెట్టాడు. (ఈ వంశాల్లో జరాసంధుడు గొప్పవాడు. ఇతను శ్రీకృష్ణునికి సమకాలీన రాజు).


హర్యంక వంశాన్ని శిశునాగ రాజవంశం ఆక్రమించింది. శిశునాగుడు, కాల అశోకుడు(Ashoka), మహానంది ఈ వంశంలో గొప్ప రాజులు. కాల అశోకుని కాలంలో రెండో బౌద్ధ సమావేశం  క్రీ.పూ.383 సంవత్సరంలో జరిగింది. క్రీ.పూ.345లో  మహాపద్మనందుడు మహానందిని హత్య చేశాడు. నంద వంశాన్ని స్థాపించాడు. ఇతనిని రెండో పరుశరాముడిగా కొన్ని గ్రంథాలు కీర్తించాయి. ధననందుడు ఈ వంశంలో చివరి రాజు. క్రీ.పూ.326లో అలెగ్జాండర్‌ మగధ పశ్చిమ సరిహద్దులపై దండెత్తాడు. కానీ,  సరిహద్దుల్లోని రాజైన  ‘పోర్‌స’(పురుషోత్తముడు) చేతిలో ఓడిపోయాడు.  క్రీ.పూ. 321లో  ధననందుని పతనం తరవాత చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు  ‘మౌర్య’ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


మగధ సామ్రాజ్య అభివృద్ధికి నూతన మత సిద్ధాంతాలు  కూడా దోహదపడ్డాయి. జైనమతం, బౌద్ధమతం తమ సిద్ధాంతాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చాయి. పునర్‌జన్మ, కర్మ సిద్ధాంతాలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది.





మగధ సామ్రాజ్య అభివృద్ధికి నూతన మత సిద్ధాంతాలు  కూడా దోహదపడ్డాయి. జైనమతం, బౌద్ధమతం తమ సిద్ధాంతాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చాయి. పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. నూతన మత ఉద్యమకారులు భారతీయ తత్త్వశాస్త్రం, ఆస్థిక, నాస్థిక సంప్రదాయాలను ప్రభావితం చేశారు. ఆత్మ, అణువాదం, భౌతికవాదం, అజేయవాదం, అహింసావాదం, శాకాహారతత్త్వం మొదలైన ఉద్యమాలకు దారి తీశాయి. ఈ ఉద్యమాలన్నిటికీ ‘మగధ’ కేంద్రంగా నిల్చింది.


ఈ శ్రమణ మతాలు వేద దేవతలను ఆరాధించలేదు. ఒక రకమైన సన్యాసం, ద్యానం విధానాలను, అభ్యసించాయి. మగధ  సామాజిక వ్యవస్థ కూడా సామ్రాజ్య ప్రాబల్యానికి చక్కగా సహకరించింది. మగధ ప్రారంభం నుంచి బ్రాహ్మణ మతాన్ని ఆదరించకపోవడం, శూద్ర కులస్థుల ఆధిపత్యంలో కొనసాగడం వలన సామాజిక శ్రేయస్సుకు అవసరమైన ఐక్యతా భావాలను పెంపొందించుకుంది.


బ్రాహ్మణ వాదం, వర్ణవివక్షతను మగధ పాటించలేదు. అందువల్ల  మిగిలిన జనపదాల కంటే గొప్ప సామాజిక అభివృద్ధిని మగధ సాధించగలిగింది. జైన, బౌద్ధ బోధనలు ముందుగా మగధలోనే ప్రారంభమయ్యాయి. దీంతో నూతన చైతన్యం మగధలో చోటు చేసుకుంది. మొదటి నుంచి మగధ అనుసరించిన దౌత్య, విదేశీ విధానాలు ఈ సామ్రాజ్య ప్రతిష్టతకు, విస్తరణకు దోహదపడ్డాయి. 16వ మహాజన పదాలలో ఎక్కడా కన్పించని నిర్ధిష్ఠమైన రాజనీతి, గొప్ప ప్రధానులు పాలించడం, దౌత్య విధానాలు వంటివి మగధ ప్రారంభం నుంచి చివరి దశ వరకు అభివృద్ధికి, విస్తరణకు ఉపయోగపడ్డాయి. దౌత్యానికి మూల స్థంభాలుగా నిలిచిన రాక్షసుడు(ధననందుని ప్రధాని), కౌటిల్యుడు(చంద్రగుప్త మౌర్య ప్రధాని) మగధ రాజ్యానికి సేవలు అందించారు.


మహాపద్మనందుని కాలంలో మగధ ఒక మహా సామ్రాజ్యంగా మారి, చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశ సరిహద్దును దాటింది. అశోకుడు చేసిన కళింగ(ఒడిసాలోని ధౌలి  ప్రాంతం) యుద్ధం మగధ సామ్రాజ్యవాదానికి పరాకాష్టగా నిలిచింది.  ప్రకృతిసిద్ధమైన అనుకూల పరిస్థితులు మగధకు సహజమైన రక్షణను కలిగించాయి. గిరివ్రజం, రాజగృహం, పాటలీపుత్రం నగరాలను చుట్టూ ఏర్పడిన పర్వతశ్రేణుల మధ్య ‘సోనేరి నది’ తీరాన నిర్మించారు. మగధకు ఇవి ప్రకృతిసిద్ధమైన రక్షణ కవచంగా ఉపకరించాయి.  అపారమైన అటవీ సంపదతోపాటు మగధకు గజబలం తోడైంది. మగధ ప్రాంతాల్లో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండటంతో మగధ సైనిక వ్యవస్థలో, రక్షణ వ్యవస్థలో ఇవి అమోఘమైన పాత్రను పోషించాయి.


చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకాస్‌ నికేటర్‌ను ఓడించి అతని కుమార్తె  హెల్లిన్‌సను వివాహం చేసుకున్న సందర్భంలో తన మామకు 500 ఏనుగులను బహూకరించినట్లు గ్రీకు గ్రంథాల్లో వివరించారు. ‘జస్టిన్‌’ అనే చరిత్రకారుడు తన ‘ఎసిటస్‌’ అనే గ్రంథంలో ఈ బలంతోనే మౌర్యులు గ్రీకులను ఓడించినట్లు రాశాడు.


మగధ రాజులు వైవాహిక సంబంధాలతో తమ రాజ్యాన్ని విస్తరించి, పటిష్ఠ పరిచారు. బింబిసారుడు కోసల, అచ్చవి, ముద్ర, విదేహా రాజకన్యలను వివాహం చేసుకున్నాడు. ఆజాత శతృ తూర్పు ప్రాంత గణ రాజ్యాలతో పోరాడి జయించాడు. యుద్ధంలో ‘కంటకం’, ‘రథముసలము’ ఆయుధాలు ఉపయోగించాడు. మేనమామ వైశాలి రాజ్యాన్ని నాశనం చేశాడు. అజాతశతృ సింధూ, సోవరీ, అవంతి, వత్స రాజ్య కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కోసల రాజ్య ప్రసేన జిత్తు కుమార్తె ‘నజీరా’ను పెళ్లి చేసుకున్నాడు.


మగధ ప్రారంభం నుంచి బ్రాహ్మణ మతాన్ని ఆదరించకపోవడం, శూద్ర కులస్థుల ఆధిపత్యంలో కొనసాగడం వలన సామాజిక శ్రేయస్సుకు అవసరమైన ఐక్యతా భావాలను పెంపొందించుకుంది. బ్రాహ్మణ వాదం, వర్ణవివక్షతను మగధ పాటించలేదు. 


శిశునాగుడు అవంతి, వత్స రాజ్యాలను మగధలో కలిపాడు. గ్రీకులు భారతదేశంపై చేసిన దండయాత్రల్లో అలెగ్జాండర్‌ క్రీ.పూ.326వ సంవత్సరంలో  జీలం-చినాబ్‌ నదుల మధ్య ప్రాంతాన్ని పాలించే పురుషోత్తం(పోరస్‌) చేతిలో ఓడినట్లు ‘అనాబెసిస్‌ ఆఫ్‌ అలెగ్జాండర్‌’, బనిసిక్రిటన్‌, సియర్సన్‌ మొదలైన చరిత్రకారుల రచనల్లో ఉంది. కొన్ని గ్రీకు గ్రంథాలు మాత్రం ‘అలెగ్జాండర్‌ విశ్వవిజేత’ అని అభివర్ణించాయి.

అనాది నుంచి మగధ రాజ్య దౌత్యనీతి కానీ, భారత దౌత్య నీతి కానీ ఒక్కటే. సామ, దాన, భేద, దండోపాయం...ఇదే విశ్వమానవాళికి శ్రేయస్కరంగా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వివరించాడు. సామ్రాజ్యవాదం కంటే మానవతావాదం ఎంతో గొప్పదని, శక్తిమంతమైనదని అశోకుడు ధమ్మ విధానంలో వివరించాడు. 


ఏది ఏమైనా.. క్రీ.పూ. ప్రాచీన 6వ శతాబ్దంలో మగ రాజ్యం దేశంలోనే గొప్ప శక్తివంతమైన మహాజనపదంగా ఆవిర్భవించిందని చెప్పవచ్చు.


-డాక్టర్‌ పి.మురళి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-08-09T20:52:16+05:30 IST