వ్యర్థ వస్త్రాలతో.. పర్యావరణ హితం

ABN , First Publish Date - 2022-10-03T08:15:54+05:30 IST

నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే! మా పూర్వీకులు 45 ఏళ్ల క్రితమే పంజాబ్‌ నుంచి హైదరాబాద్‌ వలస వచ్చేశారు.

వ్యర్థ వస్త్రాలతో.. పర్యావరణ హితం

పర్యావరణ హితం కోసం ఎవరైనా రీసైక్లింగ్‌ను ఎంచుకుంటారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఇషితా సింగ్‌ రీసైక్లింగ్‌తో పాటు అరుదైన ‘అప్‌సైక్లింగ్‌’ ప్రక్రియను కూడా ఎంచుకుంది. ‘అన్‌హద్‌’ బ్రాండ్‌ పేరుతో వినూత్న ప్రయత్నానికి పూనుకున్న సెలబిట్రీ డిజైనర్‌ ఇషితతో ‘నవ్య’ మాటా మంతీ... 


నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే! మా పూర్వీకులు 45 ఏళ్ల క్రితమే పంజాబ్‌ నుంచి హైదరాబాద్‌ వలస వచ్చేశారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మీద ఆసక్తితో 2005లో నిఫ్ట్‌ నుంచి డిప్లొమా పూర్తి చేశాను. తర్వాత తెలుగు సినిమాలకు పని చేయడం మొదలుపెట్టాను. సినీ తారల కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌తో ఊపిరి సలుపుకోలేనంత బిజీగా మారిపోయాను. అలా కొవిడ్‌ పాండమిక్‌ వరకూ కెరీర్‌ సజావుగా సాగిపోయింది. కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన సమయంలో, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, మరీ ముఖ్యంగా మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. వాళ్ల కోసం ఏదైనా ఉపయోగపడే పని చేయాలని అనిపించింది. స్వతహాగా ఫ్యాషన్‌ డిజైనర్‌ను కాబట్టి, ఆ దిశగానే నా ఆలోచన సాగింది. సాధారణంగా వస్త్రాల తయారీ క్రమంలో ఎంతో డెనిమ్‌, ఇతరత్రా మెటీరియల్‌ వృథా అయిపోతూ ఉంటుంది. వాటిని అప్‌సైక్లింగ్‌ చేసి కొత్త ఉత్పత్తులను తయారుచేయాలనే ఆలోచన స్ఫురించింది. అలాంటి వేర్వేరు వస్త్రాలను సేకరించి వాటితో రకరకాల ఉత్పత్తులను తయారుచేసి విక్రయించాలని అనుకున్నాను. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు సాటి పేద మహిళలకు భృతి కల్పించినట్టు అవుతుంది అనిపించింది.


10 మంది మహిళలతో

అలా 2022 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ దగ్గర్లోని సుల్తాన్‌పూర్‌లో వంద శాతం రీసైకిల్‌ యూనిట్‌ నెలకొల్పి హ్యాండ్‌ బ్యాగులు, యాక్సెసరీలను తయారుచేయడం మొదలుపెట్టాను. ఈ యూనిట్‌లో ఉన్న 10 మంది ఉద్యోగులందరూ మహిళలే! ఈ యూనిట్‌ చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చి, వారికి జీవనభృతిని కల్పించాను. అలా ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, గత ఆగష్టు 15న ఒక ప్రత్యేకమైన పనికి పూనుకున్నాం. 18 కిలోల వ్యర్థాలతో భారీ నెమలి బొమ్మను రూపొందించాం. ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా, పూర్తిగా మహిళలే ఈ బొమ్మను రూపొందించడం విశేషం.  


రెండు బ్రాండ్లతో...

అన్‌హద్‌, కరోయీ అనే రెండు విభాగాల ద్వారా వేర్వేరు ఉత్పత్తులను రూపొందిస్తున్నాను. రీసైకిల్‌ ఉత్పత్తులైన డోర్‌ మ్యాట్లు, కుషన్‌ కవర్లు, టేబుల్‌ క్లాత్స్‌, హ్యాండ్లూమ్‌ మాస్క్‌ లాంటి హోమ్‌ ప్రొడక్ట్స్‌ కరోయీ కోవకు చెందుతాయి. మిగతా మెన్స్‌ వేర్‌, విమెన్స్‌ వేర్‌, కిడ్స్‌ వేర్‌ మొదలైన డిజైనర్‌ వేర్‌, యాక్సెసరీలను అన్‌హద్‌ పేరుతో విక్రయిస్తున్నాను. ఈ ఉత్పత్తుల ముడిసరుకును గుజరాత్‌లోని అరవింద్‌ మిల్స్‌ డెనిమ్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ నుంచి తెప్పిస్తున్నాను. అలాగే అప్‌సైక్లింగ్‌ మెటీరియల్స్‌తో హ్యాండ్‌ బ్యాగులతో పాటు, నెక్‌ పీసెస్‌, పోట్లీ బ్యాగ్స్‌ తయారువుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉత్పత్తులన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే విక్రయిస్తున్నాను. 


జెనీలియాకు పర్సనల్‌ డిజైనర్‌గా...

బొమ్మరిల్లు సినిమా మొదలు నేటి వరకూ జెనీలియా ధరించే దుస్తులను నేనే డిజైన్‌ చేస్తున్నాను. వినాయక చవితి నాడు జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌, వారి పిల్లలు ధరించిన దుస్తులన్నీ నేను డిజైన్‌ చేసినవే! శశిరేఖా పరిణయం, రెడీ సినిమాలకు కూడా జెనీలియాకు దుస్తులను డిజైన్‌ చేశాను. 


సినీ ప్రముఖుల పోత్సాహంతో...

అప్‌సైక్లింగ్‌, రీసైక్లింగ్‌.. ఈ రెండు ప్రక్రియలూ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసేవే! నేను పూనుకున్న ఈ ప్రయత్నానికి ఎంతో మంది సినీ ప్రముఖులు మద్దతు పలికారు. నితిన్‌ రెడ్డి, ఛార్మి, పవన్‌కళ్యాణ్‌ మొదలైన సినీ ప్రముఖులు  నన్ను ప్రోత్సహించారు. టక్కరి సినిమా కోసం నితిన్‌కూ, ఛార్మీ, కాజల్‌ అగర్వాల్‌కు కూడా నేను దుస్తులను డిజైన్‌ చేశాను. 

గోగుమళ్ల కవిత


అప్‌సైక్లింగ్‌ అంటే?

వ్యర్థాన్ని విచ్ఛిన్నం చేసి, దాన్నుంచి ఉపయోగకరమైన కొత్త ఉత్పత్తిని తయారుచేయడం రీసైక్లింగ్‌. ఇది మనందరికీ తెలిసిందే! అయితే వ్యర్థాన్ని విచ్ఛిన్నం చేయకుండా, అదే రూపంలో ఉపయోగించి, కొత్త ఉత్పత్తిని రూపొందించడమే అప్‌సైక్లింగ్‌. ఈ రెండు విధానాలూ వ్యర్థాల కలుషితాల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించేవే!


పవన్‌ కళ్యాణ్‌కు సైతం

మొదటిసారి కాటమరాయుడు సినిమాకు పవన్‌ కళ్యాణ్‌ కోసం డ్రెస్‌లు డిజైన్‌ చేశాను. ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో భాగంగా ఆయన ధరించే దుస్తులన్నీ నేను డిజైన్‌ చేసినవే! 


మా వారు ఆర్యన్‌ సింగ్‌ ఒక కంపెనీలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌. నాకు మూడేళ్ల బాబు. పేరు... 

జయాన్వీర్‌ సింగ్‌.

Updated Date - 2022-10-03T08:15:54+05:30 IST