అనుమానిత కేసులతో.. అలజడి

ABN , First Publish Date - 2020-06-02T10:20:54+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత కేసులతో అలజడి రేగుతోంది. ఎల్‌.ఎన్‌.పేటలో ఆదివారం రాత్రి ఎనిమిది

అనుమానిత కేసులతో.. అలజడి

ఎల్‌.ఎన్‌.పేటలో ‘ప్రాథమిక’ పరీక్షల్లో 8 మందికి పాజిటివ్‌

జిల్లా కొవిడ్‌ ఆస్పత్రికి తరలించిన అధికారులు 

గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌, జేసీ 

ఇంటింటా సర్వే, నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశం


ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 1: జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత కేసులతో అలజడి రేగుతోంది. ఎల్‌.ఎన్‌.పేటలో ఆదివారం రాత్రి ఎనిమిది మందికి కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ ఆస్పత్రికి వారిని తరలించి వైద్యసేవలందిస్తున్నారు. బాధితులు వలస కూలీలు. రెండు కుటుంబాలకు చెందిన వారు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి చేరుకున్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేపట్టిన ప్రాథమిక నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. బాధితుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ నివాస్‌,  జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌లు వేర్వేరుగా ఈ  గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోకి రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.


కంటైన్మెంట్‌ జోన్‌లోకి చేర్చుతూ ఇంటింటా నిత్యావసరాల పంపిణీ చేయాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఇంటింటా సర్వే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ప్రాథమిక వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.


ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రాథమిక స్థాయిలో అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి వైద్యసేవలందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్‌, జేసీ విజ్ఞప్తి చేశారు. బాధితులకు తుది నిర్థారణ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. వారి వెంట డీఎస్‌వో నాగేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీవో గణపతిరావు, మండల ప్రత్యేకాధికారి రామారావు, తహసీల్దారు బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, ఎంపీడీవో కాళీప్రసాదరావు, వైద్యాధికారి రెడ్డి హేమలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T10:20:54+05:30 IST