సాదా బైనామాలతో.. సర్‌సిల్క్‌ భూములకు పట్టాలు

ABN , First Publish Date - 2022-04-26T03:59:29+05:30 IST

సర్‌సిల్క్‌ భూముల వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. హైకోర్టు సమక్షంలో విక్రయించిన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌, కోసిని శివారులోని సర్‌సిల్క్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినా రెవెన్యూ యంత్రాంగం ఆ భూములకు సాదాబైనామాలతో పట్టాలిచ్చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.

సాదా బైనామాలతో.. సర్‌సిల్క్‌ భూములకు పట్టాలు

-హైకోర్టు సమక్షంలో ఇదివరకే రిజిస్ట్రేషన్లు

-ఫోర్జరీ పత్రాలతో మ్యూటేషన్‌?

-విస్మయం కల్గిస్తున్న రెవెన్యూ లీలలు

-విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం

-భూముల అన్యాక్రాంతంపై హైకోర్టు నోటీసులు

-అక్రమణలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగినరెవెన్యూ శాఖ

-మొక్కుబడి తంతు అంటున్న కొనుగోలుదారుడు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

సర్‌సిల్క్‌ భూముల వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. హైకోర్టు సమక్షంలో విక్రయించిన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌, కోసిని శివారులోని సర్‌సిల్క్‌ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినా రెవెన్యూ యంత్రాంగం ఆ భూములకు సాదాబైనామాలతో పట్టాలిచ్చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. 2009లో సర్‌సిల్క్‌ భూములను అమ్మి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అప్పట్లో లిక్విడేటర్‌ను నియమించి భూములను విక్రయించారు. ఇందులో బత్తిని వెంకటయ్య, ఆనంద్‌ మోడి తదితరులు ఎకరానికి రూ.1.55లక్షల చొప్పున మొత్తం 186 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అప్పట్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి అయింది. తాము కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వాలని కొనుగోలుదారులు రెవెన్యూ శాఖలో మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నాటి నుంచి నేటివరకు ఏదో సాకు చూపుతూ రెవెన్యూ అధికారులు మ్యూటేషన్‌ చేయడం లేదు. అయితే ఇదే కొనుగోలు దారుడి దగ్గర నుంచి ఆనంద్‌ మోడి అనే వ్యక్తికి విభజించి 13ఎకరాల స్థలాన్ని లిక్విడేటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాడు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఆధారంగానే మ్యూటేషన్‌ చేయాల్సి ఉంది. కానీ రెవెన్యూ అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి వివిధ కారణాల చూపుతూ పెండింగ్‌లో పెట్టారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు పెరగడం, రాజకీయ జోక్యం, భూముల ధరలు పెరుగుదల  వంటి పరిణామాల్లో కొందరు భూ కబ్జాదారుల కన్ను ఈ భూములపై పడింది. దాంతో ఆనంద్‌ మోడి అనే వ్యాపారి ఫోర్జరీ పత్రాల ఆదారంగా సాదా బైనామాలు సృష్టించి మ్యూటేషన్‌ చేయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదే సర్వే నంబర్లలో పెద్ద మొత్తంలో భూమి కొనుగోలు చేసిన వెంకటనారాయణ.. ఆనంద్‌ మోడికి పట్టాలిచ్చినప్పుడు తనకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారి హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో పాటు వివిధ మార్గాల గుండా ఏ పద్ధతిలో ఇంకో పార్టీకి మ్యూటేషన్‌ చేశారన్న విషయాన్ని ఆరా తీయడంతో సాదాబైనామాల ఆధారంగా పట్టాలు జారీచేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో రెవెన్యూ అధికారుల తతంగాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన కొనుగోలుదారుడు మరోసారి హైకోర్టును, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కాగజ్‌నగర్‌ మండలం కోసిని రెవెన్యూ శివారులోని సర్వేనంబరు 85/3, 86/3, 87/3 అనే మూడు నంబర్లలో  2018లో 10 ఏప్రిల్‌న ఆనంద్‌ మోడి అనే వ్యక్తికి మొత్తం 13 ఎకరాల ఎనిమిది గుంటల స్థలానికి సాదా బైనామా ద్వారా పట్టాలు జారీ చేసినట్టుగా రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే తాజాగా దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ రెవెన్యూ అధికారిని వివరణ కోరగా ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సమాచారం చూపించడం లేదంటూ  సమాధానం చెప్పి దాట వేసే ప్రయత్నం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రధాన కొనుగోలుదారుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టు నోటీసులతో ఆక్రమణలపై రెవెన్యూ శాఖ సర్వే

సర్‌సిల్క్‌ భూములు ఆక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలు అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నాయంటూ ఆ భూముల కొనుగోలుదారుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు జారీ కాగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద సర్‌సిల్క్‌ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల నిగ్గు తేల్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సర్వేకు శ్రీకారం చుట్టింది. గడిచిన 20రోజులుగా సర్‌సిల్క్‌ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు సంబంధించి కాగజ్‌నగర్‌ రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. బాధితుడి కథనం ప్రకారం కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ, కోసిని గ్రామపంచాయ తీలు ఎలాంటి అనుమతి లేని ఇండ్లకు ఇంటి నంబర్లను కేటాయించి వాటిని క్రమబద్దీకరిం చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తున్నాడు. హైకోర్టు ఉత్తర్వులున్నా వాటిని ధిక్కరించి కుట్ర పూరితంగా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే మరోసారి హైకోర్టు, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించ డంతో ఆక్రమణలను నిగ్గుతేల్చాలని అధికారులకు, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్వే జరుపుతున్నట్టు తెలిసింది. 

సాదా బైనామాతో నాకు సంబంధం లేదు..

-ప్రమోద్‌, తహసీల్దార్‌, కాగజ్‌నగర్‌ 

సర్‌సిల్క్‌ భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాలనుసారం రిజిస్ట్రేషన్‌ జరిగినప్పటికీ ఏ కారణం చేత సాదాబైనామాతో మ్యూటేషన్‌ చేశారన్నది నాకు తెలియదు. అది నా హయాంలో జరుగలేదు. కేవలం డిజిటల్‌ సంతకం ద్వారా పట్టాలు, పాస్‌పుస్తకాలు మాత్రమే జారీచేశాం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటాను.

Updated Date - 2022-04-26T03:59:29+05:30 IST