కిట్టీ పార్టీలతో.. కుచ్చుటోపి

ABN , First Publish Date - 2021-11-28T09:23:30+05:30 IST

ఖరీదైన విల్లాల్లో ఉంటూ.. ఒంటినిండా లక్షలు ఖరీదు చేసే నగలు ధరిస్తూ.. చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటుంది.

కిట్టీ పార్టీలతో.. కుచ్చుటోపి

  • కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి అరెస్టు..
  • రూ.1.5కోట్లు మోసపోయిన మహిళ ఫిర్యాదు
  • సినిమా నిర్మాణం పేరుతో కోట్లకు గాలం
  • రూ. 40-50 కోట్లు కొల్లగొట్టినట్లు అంచనా?
  • ముగ్గురు హీరోలు కూడా బాధితులే!!

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఖరీదైన విల్లాల్లో ఉంటూ.. ఒంటినిండా లక్షలు ఖరీదు చేసే నగలు ధరిస్తూ.. చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. టాలీవుడ్‌లో పెద్దలతో పరిచయాలున్నాయని.. తానో సినిమా ప్రొడ్యూసర్‌ అని బిల్డప్‌ ఇస్తుంది. తన భర్త బడా రియల్టర్‌ అని చెబుతుంది. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తుంది. సంపన్న కుటుంబాల మహిళలను బుట్టలో వేసుకుంటుంది. వారిద్వారా మరికొందరు ధనిక మహిళలను పరిచయం చేసుకుంటుంది. సినిమా నిర్మాణం పేరుతో వారిని ముగ్గులోకి దింపుతుంది. కోట్లు వసూలు చేసి.. నిండా ముంచేస్తుంది. ఇలా పలువురిని రూ. కోట్లలో మోసగించిన ఘరానా కిలేడీ శిల్పాచౌదరిని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శిల్పాచౌదరి, కృష్ణ శ్రీనివాస ప్రసాద్‌ దంపతులు పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లా్‌సలో నివసిస్తున్నారు. శిల్పాచౌదరి తనను తాను సినీ నిర్మాతగా.. తన భర్తను రియల్టర్‌గా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ.. టాలీవుడ్‌ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్‌ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడితే.. లాభాలు భారీగా వస్తాయని నమ్మబలుకుతుంది. ఇలా పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. లాభాల మాట పక్కనపెడితే.. ఏళ్లు గడుస్తున్నా.. అసలు ఊసుకూడా ఎత్తకుండా దాటవేయడం శిల్ప నైజం.


బౌన్సర్లతో బెదిరింపులు..

పుప్పాలగూడకు దివ్యారెడ్డి అనే బాధితురాలు శిల్పాచౌదరికి రూ. 1.5కోట్లు ఇచ్చారు. ఏడాది గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో శిల్ప ఇంటికి వెళ్లి నిలదీశారు. దాంతో శిల్ప దంపతులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బౌన్సర్లతో దివ్యను బయటకు నెట్టివేయించారు. దీంతో బాధితురాలు ఈనెల 13న నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. శుక్రవారం రాత్రి శిల్పాచౌదరి, ఆమె భర్తను అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. శనివారం సాయంత్రం వరకు ఆరుగురు బాధితులు నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. శిల్పాచౌదరి బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన 20-30 మంది బాధితులు నార్సింగ్‌ పోలీసులకు ఫోన్‌ చేసి.. తాము కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఇప్పటి వరకు శిల్పాచౌదరి దంపతులు పలువురిని రూ. 40 - 50 కోట్ల మేర కొల్లగొట్టినల్లు పోలీసులు లెక్కతేల్చారని సమాచారం. బాధితులంతా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. శిల్పారెడ్డి దంపతుల మోసం విలువ తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. శిల్ప బాధితులు ముగ్గురు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దివ్య ఫిర్యాదు చేయకుండా ఉండి ఉంటే.. శిల్పాచౌదరి దంపతులు విదేశాలకు పారిపోయి ఉండేవారని పోలీసులు తెలిపారు. శిల్పాచౌదరి దంపతుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేస్తామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు. వారు మొత్తం ఎన్ని కోట్లు కొల్లగొట్టారు? స్థిఆరాస్తులు ఎంత? అనే వివరాలు నిగ్గుతేలాలంటే.. వారిని విచారించాల్సిందేనని చెబుతున్నారు.

Updated Date - 2021-11-28T09:23:30+05:30 IST