అరకొర పదునులో అన్నదాత సాహసం

ABN , First Publish Date - 2022-06-19T05:39:43+05:30 IST

ఆశల సాగు మొదలైంది. అరకొర పదునులోనే అన్నదాతలు మట్టిని నమ్మి.. విత్తనాలు అప్పగిస్తున్నారు. ఖరీఫ్‌ పంట పండితే కష్టాలు కొంతైనా తీరుతాయని ఎప్పటిలాగా ఆశావహంగా ముందడుగు వేశారు.

అరకొర పదునులో అన్నదాత సాహసం
వేరు శనగ విత్తనం వేస్తున్న రైతులు

ఆత్మవిశ్వాసంతో.. ఆశల విత్తు

అరకొర పదునులో అన్నదాత సాహసం


ఆశల సాగు మొదలైంది. అరకొర పదునులోనే అన్నదాతలు మట్టిని నమ్మి.. విత్తనాలు అప్పగిస్తున్నారు. ఖరీఫ్‌ పంట పండితే కష్టాలు కొంతైనా తీరుతాయని ఎప్పటిలాగా ఆశావహంగా ముందడుగు వేశారు. గుత్తి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వేరుశనగ, పత్తి, కంది, ఆముదం సాగు ప్రారంభించారు. బేతాపల్లి, గొందిపల్లి, ఊటకల్లు, గాజులపల్లి, జక్కలచెరువు, కొత్తపల్లి, కొత్తపేట, వన్నేదొడ్డి, ఊబిచెర్ల, తదితర గ్రామాల్లో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. పదును తక్కువగా ఉన్నా, విత్తనం వేశాక వానలు కురుస్తాయని, అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో సాహసం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 18 వేల హెక్టార్లలో పంటల సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 5 వేల హెక్టార్లలో వేరుశనగ, పత్తి, ఆముదం, కంది పంటలు సాగు మొదలైందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. విత్తనం వేసేందుకు ఎకరానికి ట్రాక్టర్‌ అద్దె రూ.వెయ్యి నుంచి రూ.1,200 తీసుకుంటున్నారు. ఎద్దులకు ఎకరానికి రూ.700 నుంచి రూ.900 వరకు బాడుగ చెల్లిస్తున్నారు. 

- గుత్తి రూరల్‌









దేవుడిపై భారం..

దేవుడి మీద భారం వేసి అరకొర పదునులో వేరుశనగ విత్తనం వేస్తున్నాను. మృగశిర కార్తెలో వర్షం వస్తుందని అనుకుంటున్నాను. ఏటా జూనలోనే విత్తనం వేస్తుంటాను. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి, వేరుశనగ దిగుబడి బాగా వస్తే కష్టాలు కొంతైనా తీరుతాయి. 

- రాము, గొందిపల్లి


పత్తి సాగు..

 పదును తక్కువగా ఉన్నా, ఐదెకరాల్లో పత్తి సాగు చేశాను. మృగశిర కార్తెలో పత్తి సాగు చేస్తున్నాను. ఈ కార్తెలో పత్తినాటితే పైరు బలంగా వచ్చి, మంచి దిగుబడి వస్తుందని నాటాను. ఈ ఏడాదైనా పంట బాగా పండకపోదా అని ఆశతో ఉన్నాను. 

-  సూర్యనారాయణ, బేతాపల్లి


Updated Date - 2022-06-19T05:39:43+05:30 IST