Asian Under-17 Championship: స్వర్ణంతో మెరిసిన దినసరి కార్మికుడి కుమారుడు

ABN , First Publish Date - 2022-06-26T02:57:14+05:30 IST

కర్ణాటకలోని ముధోల్‌కు చెందిన 17 ఏళ్ల కుస్తీ సంచలనం నింగప్ప జెన్నాననవర్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని

Asian Under-17 Championship: స్వర్ణంతో మెరిసిన దినసరి కార్మికుడి కుమారుడు

న్యూఢిల్లీ: కర్ణాటకలోని ముధోల్‌కు చెందిన 17 ఏళ్ల కుస్తీ సంచలనం నింగప్ప జెన్నాననవర్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగిన ఆసియా అండర్-17 చాంపియన్‌షిప్‌లో 45 కిలోల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన అమీర్‌ మహ్మద్ సలేహ్‌ను ఓడించిన నింగప్ప స్వర్ణ పతకం సాధించి రికార్డులకెక్కాడు. రెజ్లింగ్ అనగానే ఇప్పటి వరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుర్తొచ్చేవి. ఇప్పుడు నింగప్ప స్వర్ణం సాధించి అందరి దృష్టిని కర్ణాటక వైపు తిప్పుకున్నాడు.  


దేశం దృష్టిని ఆకర్షించిన నింగప్ప ఓ దినసరి కూలి కుమారుడు కావడగం గమనార్హం. నింగప్ప కోచ్ అరుణ్ కుమాకాలే మాట్లాడుతూ.. ముధోల్‌లో ప్రతి ఇంట్లోనూ ఓ కుస్తీ వీరుడు ఉంటాడని, కానీ ఇల్లు లేని రెజ్లర్ నింగప్పేనని పేర్కొన్నారు. ముధోల్‌కున్న గొప్ప రెజ్లింగ్ సంస్కృతి గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రెజ్లింగ్ కోచ్ రామ్ బుడకి మాట్లాడుతూ.. ముధోల్ శునక జాతికి ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందిందని, ఈ శునకాలు దేశమంతటా ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు. 


‘‘ముధోల్ విచిత్రమైన చిన్న ప్రదేశం. ఈ నగరం గుండా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఎక్కువ మంది రైతులు నివసించే ఇక్కడ  దాదాపు ప్రతి ఇంటిలో ఒక మల్లయోధుడు ఉంటాడు. ఇది గర్వించదగ్గ విషయం. ప్రతిరోజూ ఉదయం, గరడీ (అఖాడాస్) వద్ద డజన్ల కొద్దీ యువకులు, అమ్మాయిలు కనిపిస్తారు" అని కర్ణాటక రెజ్లింగ్ ఫెడరేషన్ కార్యదర్శి ఎన్ఆర్ నరసింహ చెప్పారు.


నిజానికి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మల్లయోధులు జాతీయ జట్టులో చేరి పతకాలు సాధించడం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, ఇప్పడు కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ముధోల్ వంటి పట్టణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో ఇదే పట్టణానికి చెందిన సందీప్ కేట్ 2016లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. అలాగే,  అర్జున్ హలకుర్కి 1995 తర్వాత జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న కర్ణాటకకు చెందిన తొలి రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు.

Updated Date - 2022-06-26T02:57:14+05:30 IST