అమెరికాలో 50 లక్షలకు చేరువైన కేసులు.. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం..

ABN , First Publish Date - 2020-08-09T05:24:12+05:30 IST

అమెరికాలో శుక్రవారం 58,173 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా

అమెరికాలో 50 లక్షలకు చేరువైన కేసులు.. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం..

వాషింగ్టన్: అమెరికాలో శుక్రవారం 58,173 కరోనా కేసులు నమోదయ్యాయి.  జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం కొత్తగా నమోదైన కేసులతో.. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 49,68,413గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో అమెరికాలో కరోనా కారణంగా 1,243 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,858కు చేరింది. అమెరికాలో గత కొంతకాలం నుంచి నిత్యం కనీసం వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. కేసులు, మరణాల విషయంలో ఏ దేశానికి అందనంత ఎత్తులో అమెరికా ఉంది. అమెరికాలో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 22న నమోదైంది. ఇక అప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా బయటపడుతూనే వచ్చాయి. ఏప్రిల్, మే నెలలో అయితే న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఆ రెండు నెలల్లో ఇక్కడ నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని పూడ్చడానికి స్థలాలు కూడా సరిపోలేదంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి రాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా తదితర రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. రానున్న రోజుల్లో అమెరికాలో నిత్యం లక్ష కేసులు బయటపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-08-09T05:24:12+05:30 IST