టీఎంసీ కంటే 122 సీట్లలో ముందున్నాం: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-04-18T20:24:55+05:30 IST

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పనితీరు ప్రదర్శిస్తోందని, టీఎంసీ కంటే 122..

టీఎంసీ కంటే 122 సీట్లలో ముందున్నాం: అమిత్‌షా

పూర్బ బర్దమాన్:  పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పనితీరు ప్రదర్శిస్తోందని, టీఎంసీ కంటే 122 సీట్లలో బీజేపీ ముందుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బెంగాల్‌ను విశ్వాస్, వికాస్, వ్యాపార్‌ దిశగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బ బర్దమాన్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ కేవలం మోదీని ఆడిపోసుకోవడం, భద్రతా బలగాలకు శాపనార్దాలు పెట్టడానికి తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఎజెండా ఆమె వద్ద లేదని అన్నారు. దీదీ 12 నిమిషాలు మాట్లాడితే, అందులో పది నిమిషాలు మోదీని, తనను విమర్శించడానికి, మరో 2 నిమిషాలు బలగాలను ఆడిపోసుకోవడానికి కేటాయిస్తున్నారని విమర్శించారు.


కూచ్ బెహార్ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలతో నిరసనలు చేయాలని సీతల్‌కుచి నియోజకవర్గం అభ్యర్థికి మమతా బెనర్జీ చెబుతున్నట్టు వెలుగుచూసిన ఆడియోపై అమిత్‌షా ఘాటుగా స్పందించారు. మృతదేహాలను సైతం తన రాజకీయాల వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఉంటున్న మూడు తరహాల పౌరుల్లో చొరబాటుదారులు ఒక రకమని, వీళ్లు బెంగాల్ ప్రజల హక్కులను, ఉద్యోగాలను దోచుకుంటున్నారని, చొరబాటుదారులను రాష్ట్రంలోకి రాకుండా నిరోధించగలిగే సత్తా ఒక్క బీజేపీకే ఉందని అన్నారు. కాగా, 8 విడతల పోలింగ్‌లో 6వ విడత పోలింగ్ ఈనెల 22న, 7వ విడత 26న, 8వ విడత 29న జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2021-04-18T20:24:55+05:30 IST