యువభారత్‌కు ‘వివేక’ బాటలు

ABN , First Publish Date - 2022-01-12T06:42:10+05:30 IST

‘‘దేశభక్తియే దేవదేవుని భక్తి’’, ‘‘నాకు సహస్ర జీవితాలున్నా, అందులో ప్రతి క్షణమూ, నా మిత్రులారా! నా దేశస్థులారా, మీ సేవచేతనే పవిత్రీకృతమవుతుంది...

యువభారత్‌కు ‘వివేక’ బాటలు

‘‘దేశభక్తియే దేవదేవుని భక్తి’’, ‘‘నాకు సహస్ర జీవితాలున్నా, అందులో ప్రతి క్షణమూ, నా మిత్రులారా! నా దేశస్థులారా, మీ సేవచేతనే పవిత్రీకృతమవుతుంది, నా పట్ల నాకు అచంచల విశ్వాసం ఉంది. నీలో నీ పట్ల నాకున్నంత అదే విశ్వాసం ఉంటే నీలో అవగాహనానైపుణ్యం, అనంత శక్తి, వివేకం, అప్రతిహత సత్తా, నిక్షిప్తమై ఉన్నవని నువ్వు విశ్వసిస్తే ఆ శక్తిని ప్రకటిస్తే, నా మాదిరి అవుతావు, నువ్వు అద్భుతాలు సాధిస్తావు.’’ అని స్వామి వివేకానంద అన్నారు. యువకులనుద్దేశించి మాట్లాడుతూ ‘‘మీరు ఈ సత్యాన్ని, నా నుంచి గ్రహించండి. ఆ తర్వాత మీ నుంచి గ్రామాలకు, పట్టణాలకూ, ఇంటింటికీ ఆ భావజాలాన్ని ప్రసారం చేయండి’’ అని ప్రోత్సహించారు. ఇలా ప్రోత్సహించే యువ కిశోరం నేడు మన మధ్య లేరు కానీ, వారి సూక్తులు, ఆయన ఆలోచనా, అవగాహనానైపుణ్యం, జీవన సరళి, సౌశీల్యం, వ్యక్తిత్వం యువతను ప్రభావితం చేస్తాయి.  


తమ వ్యక్తిత్వానికి, తమ భవితకు రూపురేఖలు దిద్దుకోవాలని భావించే యువతకు వివేకానంద స్వామి చరిత్ర పఠనము అవసరం. అందుకే భారత ప్రభుత్వం యువతరానికి వివేకానంద సాహిత్యాన్ని పరిచయం చేస్తూ, ‘‘స్వామి వివేకానంద సందేశం, ఆయన ఏ ఆదర్శాలకు జీవితాన్ని అంకితం చేశారో, ఆ ఆదర్శాలు ఈనాటి భారతీయ యువతకు తప్పక ప్రేరణ కలిగిస్తాయి’’ అని పేర్కొంది. 


నేటి యువకుల్లో ఆత్మగౌరవం, స్త్రీ పట్ల సదభిప్రాయంతో ఆత్మనిగ్రహం కావాలి. అందుకు విద్యతో పాటు వివేకం పెరగాలి, స్వార్ధచింతనం తగ్గాలి. ఇంట్లో తల్లి, విద్యాలయాల్లో ఉపాధ్యాయులు బాల్యం నుంచి ఈ భావనలను పిల్లల్లో అంకురింపజేయాలి. ఆలోచన అన్నింటికంటే ముఖ్యం. మనం ఎలా ఆలోచిస్తామో, అలా తయారవుతాం. ‘మాతృభూమి మీద విశ్వాసంతో, మీలోని అనంతశక్తితో దేశ ఋణం తీర్చుకోండి’ అని వివేకానందులు యువతను ప్రేరేపించారు. నేడు, టెర్రరిజం, రేసిజం, క్యాస్టిజం, రీజనలిజం లాంటి ఇజమ్స్ పెచ్చు పెరిగి ‘పేట్రియాటిజం’ను (దేశభక్తిని) మరుగునపడేలా చేస్తున్నాయి. లంచగొండితనం, హత్యలు, వయో తారతమ్యాలు, వావివరసలు మరచి, మానభంగాలకు ఒడిగడుతున్న యువతలో ఆత్మపరిశీలనా, మనోనిగ్రహం పెరగాలి. క్రమశిక్షణా రాహిత్యంతో, కావరంతో, దురలవాట్లకు లోనవుతూ తమకు తామే చెరుపు చేసుకుంటూ, తల్లితండ్రులకూ, సమాజానికీ చెడ్డపేరు తెస్తున్న యువతకు ఈ క్లిష్ట సమయంలో వివేకానందుని సందేశాలు అమృతకలశమే అవుతాయి. తమ జీవితంలో స్వర్గాన్ని గానీ, నరకాన్ని కానీ సృష్టించుకునేది ఎవరికి వారే. అందుకే యువత వివేకంతో తమ అలవాట్లనూ, శీలాన్ని దిద్దుకుని భరతమాత ముద్దుబిడ్డలుగా మారడానికి స్వామి వివేకానందుని సూక్తులు, ఆయన జీవిత చరిత్ర ఎంతో ఉపయోగపడతాయి. స్వామి చూపిన బాటలో ఆదర్శవంతంగా నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి.

పరిమి శ్యామలాదేవి, విశ్రాంత ప్రిన్సిపాల్

(నేడు స్వామి వివేకానంద జయంతి)

Updated Date - 2022-01-12T06:42:10+05:30 IST