కావలసింది విజ్ఞత

ABN , First Publish Date - 2021-04-21T05:55:11+05:30 IST

ముప్పుముంచుకు వచ్చినప్పుడు మనుషుల స్పందనలు ఆందోళనతో, కలవరంతో, ఉద్వేగంతో కూడుకుని ఉంటాయి. కొందరు ఆ సమయంలో కూడా...

కావలసింది విజ్ఞత

ముప్పుముంచుకు వచ్చినప్పుడు మనుషుల స్పందనలు ఆందోళనతో, కలవరంతో, ఉద్వేగంతో కూడుకుని ఉంటాయి. కొందరు ఆ సమయంలో కూడా స్పష్టతతో, సంయమనంతో, చాకచక్యంతో, సాహసంతో వ్యవహరించగలిగేవారు ఉంటారు. వారు ఇతరులకు కూడా ఆలంబన అవుతారు. అయితే, పరోపకారులైన వ్యక్తులు చేయగలిగే సాయం పరిమితమైనది. సమాజం మొత్తంగా అటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ప్రమాదం నుంచి బయటపడలేదు. సమాజ పాలనను నిర్వహించే వ్యవస్థలు ఆ బాధ్యత తీసుకోవాలి. విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నివారించడం, ఎదురయినప్పుడు తక్కువ ప్రాణ, వస్తు నష్టంతో బయటపడేట్టు చూడడం వ్యవస్థల పని. మానవ వనరులతో సహా, సమాజంలోని అన్ని వనరులను సమీకరించుకుని, అనుభవాన్ని జోడించి, విజ్ఞతతో ముందడుగు వేయడం సమాజ పాలకుల, నిర్వాహకుల పని. 


కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవజీవితంలో తీసుకువచ్చిన పెనుమార్పులు మనకు తెలిసినవే. అది సృష్టించిన, సృష్టిస్తున్న బీభత్సం కళ్లెదురుగా కనిపిస్తున్నదే. మానవ నాగరికత సాధించిన పురోగతి అంతా గత ఏడాదిగా కుంటుబడింది. ప్రయాణాలు నిలిచిపోయాయి, తరువాత పరిమితమయ్యాయి. జీవనాధారాలు కునారిల్లిపోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మనుషుల, కుటుంబాల సామాజిక జీవనం స్తంభించిపోయింది, పలచబడిపోయింది. ఇదంతా ఒక్క ఏడాది ఉంటుంది ఆ తరువాత మళ్లీ సాధారణ స్థితి వస్తుందిలెమ్మని భావించాము. కానీ, రెండో ఏడు కూడా అది కొనసాగుతున్నది. రెండవ విడతలో మరింతగా విజృంభిస్తున్నది. అమెరికా, బ్రెజిల్, కొన్ని ఐరోపా దేశాలు వైరస్ విజృంభణలో అగ్రశ్రేణిలో ఉండడం మనకు తెలుసు. ఇప్పుడు, భారతదేశంలో రోజుకు రెండున్నర లక్షల కొత్త కేసులు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. భారత్‌కు ప్రయాణాలు మానుకొమ్మని, వెళ్లవలసి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా తమ పౌరులను ప్రత్యేకంగా హెచ్చరించింది. 


కరోనా వంటి ఉత్పాతాలను ఎదుర్కొనడంలో పూర్వానుభవం ఎవరికీ లేదు కాబట్టి, ఎవరెంతగా ప్రాప్తకాలజ్ఞతను, సద్యఃస్ఫూర్తిని ప్రదర్శిస్తారన్నదే ముఖ్యం. రాజకీయవేత్తలు, వ్యూహకర్తలు వంటి వారు కాకుండా, రాజనీతిజ్ఞులు, పెద్దమనుషులు అయినవారు విశాల దృష్టితో సమాజ యోగక్షేమాలను పరిగణనలోకి తీసుకోగలరు. చొరవను, చురుకుదనాన్ని ప్రతిభావంతంగా, ఆవశ్యకమైన సందర్భాలలో ప్రదర్శించడం ఇటువంటి విపత్తులలో అవసరం. ప్రపంచంలో ఏ ఏ ప్రభుత్వాల అధినేతలు ఎటువంటి విజ్ఞతను ప్రదర్శించారో పదే పదే చదువుకున్నాము. చిన్న చిన్న దేశాలు, మహిళాదేశాధినేతలు ఎంతో సమర్థతను చూపినట్టు కూడా తెలుసుకుని ఆశ్చర్యపోయాము. రెండవ విడత పూర్తిగా అనూహ్యమైనదేమీ కాదు. ఇటువంటి స్థితిని అన్ని దేశాలూ ఏదో ఒకస్థాయిలో ఊహించాయి. కానీ, అందుకు తగ్గ సన్నద్ధతను ప్రదర్శించాయా? మన దేశం ఇప్పుడు ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుపోయిందా? 


పోయిన సంవత్సరం, లాక్‌డౌన్ ప్రకటన అనేక పర్యవసానాలను సృష్టించింది. భారతదేశ వాస్తవికతను కొత్తగా ఆవిష్కరించింది. లాక్‌డౌన్ విషాదాలను దృష్టిలో పెట్టుకుని, దానిని విధించడమే పొరపాటన్న అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. తగినంత ముందుగా హెచ్చరిక చేసి ఉంటే భిన్నంగా ఉండేదని మరికొందరు అన్నారు. ఆ అనుభవాల నేపథ్యంలోనే కాబోలు, ప్రస్తుత విజృంభణ సమయంలో లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకోగూడదన్న బలమైన వాదన కూడా ముందుకు వచ్చింది. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది రాష్ట్రాల నిర్ణయమే అని చెప్పి కేంద్రం చేతులు దులుపుకున్నది కానీ, రాష్ట్రాల కాళ్లూ చేతులూ కట్టేసే ఉన్నాయి. విపత్కాలంలో కేంద్రం రాష్ట్రాలకు తగినంతగా సాయం చేయలేదు. తమ ఆదాయాలను తామే సమకూర్చుకోవలసిన భారం వాటి మీద ఉన్నది. అందువల్ల రాష్ట్రప్రభుత్వాధినేతలు తరచు, లాక్‌డౌన్ విధించే సమస్యే లేదని చెబుతున్నారు. ప్రతిపక్షాల వారితో, ఒక్కోసారి న్యాయస్థానాల చేతిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. 


రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులను, చిరుద్యోగులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే నిషేధ చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ సమర్థించరు. కానీ, ఇక్కడ అవతలి వైపు ఉన్నది పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని కలిగిస్తున్న సాంక్రామిక వ్యాధి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. మనుషులు కలివిడిగా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఎవరికి వారు ఒంటరిగా ఉండిపోతే, బతకడానికి కావలసిన ఆదాయాలు ఎట్లా? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడం నాయకుల బాధ్యత. మునుపటి లాక్‌డౌన్లో ఒక్కసారిగా పూర్తి నిషేధాలను అమలుచేశారు. అందులో అతివ్యాప్తి దోషం ఉండవచ్చు. అట్లాగే, సినిమాహాళ్లు, పబ్బులు, రాజకీయ సభలు, కుంభమేళాలతో సహా అన్నీ యథావిధిగా కొనసాగాలనే అభిప్రాయంలో అవ్యాప్తి దోషం ఉంటుందని గుర్తించాలి. జబ్బు వ్యాప్తి తీవ్రత స్వయంగా అనేక నిషేధాలను విధిస్తోంది. ఏ నిషేధమూ లేకుండానే హైదరాబాద్‌లో సినిమాహాళ్లు వెలవెల బోతున్నాయి. ఏది అనవసరమో, ఏది తక్కువ నష్టదాయకమో గుర్తించి, వాటి మీద నిషేధాలు విధించాలి. రాత్రిపూట కర్వ్యూ వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. తొమ్మిదోతరగతి వరకు స్కూళ్లు మూసేసి, పదోతరగతి పరీక్షలు యథాతథం అంటే అందులో ఔచిత్యం ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడ జనసమ్మర్దానికి అవకాశమున్నదో వాటిని గుర్తించాలి. ప్రజల్లో స్వీయనిగ్రహానికి ప్రచారం చేయాలి. కొంత నష్టానికి వివిధ రంగాలు, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సిద్ధపడాలి. ఆ నష్టం వల్ల ఏ ప్రజాశ్రేణికి రోజువారీ కష్టాలు ఉంటాయో వారికి తక్కిన సమాజం, ప్రభుత్వం సహాయ హస్తం అందించాలి. ఈ క్లిష్ట విన్యాసాన్ని ప్రభుత్వాధినేతలు చాకచక్యంతో నిర్వహించాలి.


ఇప్పుడున్న నిషేధాలు సరిపోవు. అట్లాగని పూర్తి స్తంభన ప్రమాదకరం. కీలు ఎరిగి వైద్యం చేయాలి. అన్నిటికంటె ముందు ఆస్పత్రులలో పడకలు, అత్యవసర ఔషధాలు, అంతకుమించి ప్రాణవాయువు అందుబాటులో ఉండేట్టు చూడాలి. ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత నివారించడం మీదనే సమస్త చర్యలు గురిపెట్టాలి.

Updated Date - 2021-04-21T05:55:11+05:30 IST