ప్రజ్ఞానమే పరబ్రహ్మము

ABN , First Publish Date - 2020-07-31T09:33:32+05:30 IST

కనిపించనివన్నీ పరబ్రహ్మమునందే ఉన్నాయి. కనిపించే విశ్వమంతా పరబ్రహ్మ కల్పితమైనదే. ఈ విశాల విశ్వం బ్రహ్మము నుండే ఆవిర్భవించినా..

ప్రజ్ఞానమే పరబ్రహ్మము

పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే!

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే!!


కనిపించనివన్నీ పరబ్రహ్మమునందే ఉన్నాయి. కనిపించే విశ్వమంతా పరబ్రహ్మ కల్పితమైనదే. ఈ విశాల విశ్వం బ్రహ్మము నుండే ఆవిర్భవించినా.. బ్రహ్మము పరిపూర్ణమైనదేనంటున్నాయి ఉపనిషత్తులు. ఆ బ్రహ్మమే భగవంతుడు. భగవంతుడిని ఆకారానికో, ప్రదేశానికో పరిమితం చేయడం పొరపాటు. నాశనమయ్యే దేహంతో నాశనం కాకుండా, ప్రాకృతిక రూపాలతో మారకుండా నిత్యము, సత్యమైన తత్వమే భగవంతుడు. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి’’ అపరిమితమైన భగవంతునిలో ఒక భాగం మాత్రమే సమస్త చరాచర విశ్వమని.. మూడు భాగాలు దృశ్యం కావని పురుష సూక్తం చెబుతోంది.


ఒక సాధువు వీధి వెంట వెళ్తున్నాడు. కొందరు అల్లరి పిల్లలు అతనిపై రాళ్ళు విసిరారు. ఆ సాధువు వారి వద్దకు వెళ్ళి మిఠాయిలు ఇచ్చాడు. మేము రాళ్ళు విసిరితే మిరు మిఠాయీలివ్వడమేంటని వారడిగితే.... ‘‘నాలో, మిలో ఉన్నది భగవంతు డొక్కడే. దానిని తెలుసుకుంటే నాపై రాళ్ళు విసరరు కదా’’ అన్నాడు, సాధువు. రెండు కర్రలను తీసుకొని ఒక దానితో ఒకటి రాపిడి చేయడం ద్వారా ఆ కర్రలలో బంధింపబడిన అగ్ని బయటకు వస్తుంది. అలాగే ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా బంధింపబడిన విజ్ఞానమనే అగ్నిని జాగృతం చేయడం ద్వారా అంతశ్చేతన జ్ఞానవంతమౌతుంది. అనంతమైన విజ్ఞానం, అపారమైన నైపుణ్యాలు, నిర్మాణాత్మకమైన వైఖరి లాంటివి ప్రతివ్యక్తిలో అపరిమితంగా ఉంటాయి. చాలామంది వాటికి పరిమితులను ఏర్పరచి, ఆ పరిమితులను దాటలేమనే భ్రమలో ఉంటారు. ఎవరైతే ఆ భ్రమను విడనాడి తనలోని అనంతమైన శక్తియుక్తులను వెలికి తీసుకొని ఉపయోగించుకుంటారో వారే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు.


ఆత్మవిశ్వాసంతో కూడిన ఉత్సాహం, లక్ష్యంపై చెదరని దృష్టి, అలుపెరుగని ప్రయాణం విజ్ఞానాన్ని వివేచనగా మారుస్తాయి. వివేచన సంకల్పాన్ని అన్వేషణ వైపు నడిపిస్తుంది. నిబద్ధతతో కూడిన ప్రయత్నం క్రియాశీలమై కార్యావిష్కరణకు దారిచూపుతుంది. అది సంతృప్తితో కూడిన విజయాన్నిస్తుంది. సాధనతోనే జీవితం సంతృప్తమౌతుంది. సాధన సాహసంతో ఆరంభమై.. ధైర్యంతో ముందుకు పోతుంది. బుద్ధి సృజనాత్మకతను అద్ది.. దానికి మార్గదర్శన చేస్తుంది. ఎన్ని అవాంతరాలెదురైనా శక్తిసామర్థ్యాలు వాటిని అధిగమించే విధానం నేర్పి నడిపిస్తాయి. పరాక్రమం(ప్రయత్నం) నిరంతర వాహినియై దానిని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఆ గమ్యమే పరబ్రహ్మ తత్వం. గమనమనే ప్రజ్ఞానాన్ని గుర్తించడం.


పాలకుర్తి రామమూర్తి, 9441666943

Updated Date - 2020-07-31T09:33:32+05:30 IST