Abn logo
Dec 5 2020 @ 00:31AM

కేబుల్స్‌తో పనిలేని వైర్లెస్‌ ఛార్జింగ్‌

ఈ మధ్యకాలంలో దాదాపు అధికశాతం ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్స్‌ వైర్లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని సపోర్ట్‌ చేస్తున్నాయి. శాంసంగ్‌ సంస్థ తన గెలాక్సీ ఫ్లాగ్‌షిప్‌ డివైజ్లకు నాలుగైదేళ్లుగా ఈ టెక్నాలజీ అందిస్తోంది.  యాపిల్‌ సంస్థ కూడా ఐఫోన్లలో ఈ మధ్యకాలంలో ఈ సాంకేతికతను ఆరంభించింది. వాస్తవానికి వైర్లెస్‌ ఛార్జింగ్‌ కొత్తగా వచ్చింది కాదు. రెండు సర్క్యూట్‌లకు మధ్య విద్యుత్‌ని ప్రవహింపజేయడానికి మేగ్నటిక్‌ రెసోనెంట్‌ కపులింగ్‌ అనే విధానాన్ని 19వ శతాబ్దంలోనే విద్యుత్తు రంగ ఆవిష్కర్త నికోలా టెస్లా పరిచయం చేశారు. అయితే ఈ వందేళ్ల కాలంలో దానిని జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి పూర్తిస్థాయిలో ప్రయోగాలు జరగలేదు. అక్కడక్కడ ఎలక్ర్టిక్‌ టూట్‌ బ్రష్‌లు వంటి వాటిలోనే ఇది ఇప్పటి వరకు కనిపించింది.అనేక ప్రయత్నాలు

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీకి చాలా డిమాండ్‌ పెరిగింది. వివిధ రూపాల్లో దాదాపు పదికి పైగా వైర్లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీలు వినియోగంలో ఉన్నాయి. అన్నింటి లక్ష్యం ఒక్కటే. వివిధ రకాల డివైజ్లను చార్జింగ్‌ చేయడానికి కేబుల్స్‌తో పనిలేకుండా చేయడం! కేవలం స్మార్ట్‌ ఫోన్లు మాత్రమే కాదు, లాప్‌ టాప్‌లు, కిచెన్‌ ఉపకరణాలు వంటి అన్ని అవసరాలకు ఇది అందుబాటులోకి రాబోతోంది. మరోవైపు హెల్త్‌ కేర్‌, ఆటోమొబైల్‌ రంగం, ఉత్పాదన రంగాల్లోనూ దీన్ని అవసరం పెరుగుతోంది. ఇదిలా ఉంటే జన జీవితాన్ని మరింత సులభతరం చేసే విధంగా అనేక ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ డివైసెస్‌ వినియోగం కూడా ఇటీవల పెరుగుతోంది. వాటికి కేబుల్స్‌ కనెక్ట్‌ చేయాల్సిన అవసరం లేకుండా వైర్లెస్‌ ఛార్జింగ్‌ ఏర్పాటుకు వివిధ తయారీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.


ఎలా పనిచేస్తుంది?

వైర్లెస్‌ ఛార్జింగ్‌ కోసం ప్రస్తుతం ప్రధానంగా మూడు విధానాలు విరివిగా వినియోగంలో ఉన్నాయి. వాటిలో వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌లు ఎక్కువ ఆదరణ పొందాయి. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ లేదా ఎస్‌ సిరీస్‌ ఫోన్లని ఛార్జింగ్‌ చేయాలంటే కేబుల్‌తో పని లేదు. ఒక వైర్లెస్‌ ఛార్జింగ్‌ పాడ్‌ మీద పెడితే దానంతట అదే చార్జింగ్‌ అవుతుంది. ఇలాంటి ఛార్జింగ్‌ ప్యాడ్లలో ఎలక్ర్టోమాగ్నెటిక్‌ అణువులు నిక్షిప్తమై ఉంటాయి. రెండో విధానం నాన్‌-రేడియేటివ్‌ ఛార్జింగ్‌. అలాగే మూడో విధానం ప్రత్యేకమైన ఛార్జింగ్‌ బౌల్స్‌ వాడడం ద్వారా కొన్ని సెంటీమీటర్ల పరిధి వరకూ వైర్‌లెస్‌గా విద్యుత్‌ అందించడం! 


ప్రసారమిలా

కేవలం విద్యుత్తు భద్రపరిస్తే సరిపోదు, దాన్ని స్వీకరించడానికి కూడా రిసీవర్‌ కాయిల్‌ అవసరమవుతుంది. వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌లో ఉండే ఇండక్షన్‌ కాయిల్‌ విద్యుత్తుని ఎలక్ర్టో మాగ్నెటిక్‌ ఫీల్డ్‌గా మారిస్తే, మరోవైపు దానికి సమీపంలోనే ఒక రిసీవర్‌ కాయిల్‌ని పొందుపరిచి, స్వీకరించిన ఎలక్ర్టోమాగ్నెటిక్‌ శక్తిని తిరిగి మళ్లీ విద్యుత్‌గా మారుస్తుంటారు. వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌ ఉన్నంత మాత్రాన అన్ని ఫోన్‌లను, గాడ్జెట్లను వైర్లెస్‌గా ఛార్జింగ్‌ చేయడానికి కుదరకపోవడానికి ఈ రిసీవర్‌ కాయిల్‌ అన్ని డివైజ్లలోనూ లేకపోవడం ప్రధాన కారణం.  అందుకే ఈ సదుపాయం ఉన్న ఫోన్లు మాత్రమే వైర్లెస్‌గా ఛార్జ్‌ అవుతాయి.


స్మార్ట్‌ఫోన్లకి ఇలా!

ప్రస్తుతం మనం స్మార్ట్‌ఫోన్ల కోసం వాడుతున్న వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్లని నిశితంగా పరిశీలిస్తే కొన్ని అంగుళాల వ్యాసార్థం కలిగిన కాపర్‌ కాయిల్స్‌ వాటిలో నిక్షిప్తం చేస్తారు. ఒక చిన్న వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌లో కేవలం పరిమిత మొత్తంలో మాత్రమే కాపర్‌ కాయిల్స్‌ పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆ ప్యాడ్‌లు తక్కువ పరిమాణంలో మాత్రమే విద్యుత్‌ అందించగలుగుతాయి. ఒకవేళ భారీ పరిమాణంలో కాపర్‌ కాయిల్స్‌ నిక్షిప్తం చేయగలిగితే, కేవలం స్మార్ట్‌ ఫోన్‌ మాత్రమే కాదు, మరిన్ని పెద్ద ఉపకరణాలను వైర్లెస్‌గా ఛార్జింగ్‌ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఉదాహరణకు 25 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన కాపర్‌ కాయిల్స్‌ ఉపయోగించగలిగితే, 25 సెంటి మీటర్ల దూరం వరకు వైర్లెస్‌గా విద్యుత్‌ అందించవచ్చు, మరింత విద్యుత్‌ కూడా అందించవచ్చు.


నిజమైన వైర్లెస్‌ ఛార్జింగ్‌ అంటే..?

వాస్తవానికి ఇప్పుడు మనం వాడుతున్నది నిజమైన వైర్లెస్‌ ఛార్జింగ్‌ అన్పించుకోదు. ఏదో ఒక ఛార్జింగ్‌ ప్యాడ్‌ మీద ఫోన్‌ని పెట్టాల్సి రావడం వైర్లెస్‌ ఎలా అవుతుందనే  సందేహం చాలా మందికి సహజంగానే కలుగుతుంది. వైర్లెస్‌ అంటే, మన వై-ఫై రూటర్‌ ద్వారా సిగ్నల్స్‌ ఎలా వస్తాయో అదే విధంగా ఒక గదిలో, లేదా ఒక నిర్దిష్ట మైన ప్రదేశం లోపల విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించాలి. ఆ పరిధిలోని అన్ని డివైజ్లకి సరిపడినంత విద్యుత్‌ని ఎలాంటి కేబుల్స్‌తోనూ, ప్యాడ్స్‌తోనూ పనిలేకుండా అందించగలగాలి. అదే నిజమైన వైర్లెస్‌ ఛార్జింగ్‌ అవుతుంది. అయితే ప్రస్తుతం నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ఈ తరహా పూర్తిస్థాయి వైర్లెస్‌ ఛార్జింగ్‌ మనకు అందుబాటులోకి తీసుకురావడానికి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రాబోయే ఐదు నుంచి పదేళ్ల లోపల మనం నిజమైన వైర్లెస్‌ ఛార్జింగ్‌ని ఆస్వాదించవచ్చు. ఇప్పటికే వైర్లెస్‌ ఇయర్‌ బడ్స్‌, వైర్లెస్‌ డిస్‌ప్లే వంటి టెక్నాలజీలు వాడుతున్నాం. అదే క్రమంలో వైర్లెస్‌ ఛార్జింగ్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తే, ఇక కేబుల్స్‌ని మ్యూజియంలో పెట్టాల్సిన రోజులు వచ్చినట్లే. ఆ తరుణం కోసం వేచి చూద్దాం.


ఇది చాలా పాపులర్‌

వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్రస్తావన ఎక్కడ వచ్చినా కూడా, ఛార్జింగ్‌ కోసం ఏ ప్రమాణం వాడుతున్నారు  అన్నది పేర్కొని ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ల విషయంలో ఖజీ (దీనిని ‘‘ఛీ’’ అని ఉచ్ఛరిస్తుంటారు) వైర్లెస్‌ ఛార్జింగ్‌ స్టాండర్డ్‌ బాగా ప్రాచుర్యం పొందింది. యాపిల్‌ ఐఫోన్లు, గూగుల్‌ పిక్సెల్‌, శాంసంగ్‌ గెలాక్సీ వంటి అన్ని రకాల ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లు ఈ ప్రమాణాన్ని   అనుసరిస్తున్నాయి. అలాగే మీరు అమెజాన్‌ వంటి వివిధ షాపింగ్‌ సైట్‌ లలో చూసినా కూడా ఖజీ వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్రమాణాన్ని కలిగిఉండే కొన్ని ప్రామాణికమైన థర్డ్‌-పార్టీ ఛార్జర్లు కూడా మనకు లభిస్తుంటాయి. మీ ఫోన్‌ సపోర్ట్‌ చేసే వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్రమాణాన్ని మాత్రమే మీరు కొనుగోలు చేసే వైర్లెస్‌ ఛార్జింగ్‌ డాక్‌లు కలిగి ఉండాలి. లేదంటే రెండు డివైజ్లకు మధ్య విద్యుత్‌ సరఫరా జరగదు.


వైర్లెస్‌ ఛార్జింగ్‌ లోపాలు

వైర్లెస్‌ ఛార్జింగ్‌ మరింత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వైర్డ్‌ ఛార్జింగ్‌తో పోలిస్తే వైర్లెస్‌ ఛార్జింగ్‌ ఇప్పటికీ చాలా నెమ్మదిగా ఉంటుంది. వైర్లెస్‌ ఛార్జింగ్‌లో కూడా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వచ్చింది.          అయినప్పటికీ, అది మామూలు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. మరోవైపు కొంతమందికి ఫోన్‌ ఛార్జింగ్‌ చేస్తూ, ఫోన్‌ చేతిలోకి తీసుకుని ముఖ్యమైన పనులు చేసుకోవడం అలవాటు. వైర్లెస్‌ ఛార్జింగ్‌ విషయంలో ఇది సాధ్యపడదు. కచ్చితంగా ఫోన్‌ని ఛార్జింగ్‌ ప్యాడ్‌ మీద ఉంచాల్సిందే. లేదంటే అది ఛార్జింగ్‌ కొనసాగదు. మరో విషయాన్ని నిశితంగా గమనిస్తే బడ్జెట్‌ ఫోన్లలో, తక్కువ ధరలో లభించే ఇతర గ్యాడ్జెట్‌లలో వైర్లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కనిపించదు. ఈ టెక్నాలజీని అమలు చేయడానికి ఎక్కువ ఖర్చు కావడమే దీనికి ప్రధాన కారణం. ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావటానికి కచ్చితంగా మరింత సమయం పడుతుంది.


ప్రయోజనాలివి!

వైర్లెస్‌ ఛార్జింగ్‌ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చీటికి మాటికి మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌కి ఛార్జింగ్‌ కోసం కేబుల్‌ కనెక్ట్‌ చేయాల్సిన పనిలేదు. ఛార్జింగ్‌ అవసరమైనప్పుడల్లా వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌ మీద ఫోన్‌ పెడితే సరిపోతుంది. దీనివల్ల యూఎస్బీ పోర్టులు వదులు కావడం, పాడైపోవడం వంటి సమస్యలు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అధికశాతం వైర్లెస్‌ ఛార్జర్లు విభిన్న రకాల డివైజ్లను సపోర్ట్‌ చేసే విధంగా వస్తున్నాయి. దీనితో ఒక ఛార్జింగ్‌ ప్యాడ్‌ ఉంటే సరిపోతుంది. ఛార్జింగ్‌ అవసరమైన వివిధ డివైజ్లను దానిమీద ఉంచితే సరిపోతుంది.


Advertisement
Advertisement
Advertisement