విప్రో, ఇన్ఫోసిస్ ఇంత పని చేశాయా..? వందల మంది ఫ్రెషర్లకు భారీ షాక్..!
ABN , First Publish Date - 2022-10-04T00:23:21+05:30 IST
ప్రముఖ ఐటీ సంస్థలు కొన్ని.. ఫ్రెషర్లకు(Freshers) ఊహించని షాకిచ్చినట్టు తెలుస్తోంది.
ముంబై: కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు ఫ్రెషర్స్‌కు(Freshers) ఊహించని షాకిచ్చినట్టు తెలుస్తోంది. వారికి గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్లను(Offer letters) రద్దు చేసినట్టు సమాచారం. విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys), టెక్ మహీంద్రా(Tech Mahindra) సంస్థలు ఇలా ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు జాతీయ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. ఇలా వందల మందికి ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం కలకలం రేపుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సుమారు మూడు నాలుగు నెలల క్రితం ఉద్యోగార్థులకు.. ఈ సంస్థలు ఆఫర్ లెటర్లు పంపాయట. అయితే.. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో జాప్యం జరగడంతో వారు ఉద్యోగంలో చేరలేకపోయారు. ఆఫీసులకు రమ్మంటూ త్వరలోనే కంపెనీల నుంచి కబురొస్తుందని అనుకుంటున్న తరుణంలో.. వారికి తగిన విద్యార్హతలు లేని కారణంగా ఉద్యోగం ఇవ్వడం కుదరదంటూ కంపెనీల నుంచి లేఖలు అందాయట. ‘‘కంపెనీ నిబంధనల ప్రకారం.. మీకు తగిన అర్హతలు లేవు’’ అని కంపెనీలు పేర్కొన్నట్టు సమాచారం.