బోణీ కొట్టారు

ABN , First Publish Date - 2021-11-18T09:50:57+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో అట్టర్‌ ఫ్లాపయిన టీమిండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలుపుతో మొదలెట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో ..

బోణీ కొట్టారు

  • అదరగొట్టిన సూర్య, రోహిత్‌ 
  • కివీస్‌పై టీమిండియా గెలుపు


సారథిగా రోహిత్‌.. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తమ ప్రయాణాన్ని విజయంతో ఆరంభించారు. సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మ చెలరేగడంతో.. ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ బోణీ చేసింది. ఓ దశలో సునాయాసంగా నెగ్గుతుందనిపించిన టీమిండియా.. ఆఖర్లో వరుస వికెట్లు చేజార్చుకొని ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. కానీ, పంత్‌ తన శైలికి భిన్నంగా ఆడి జట్టును గెలుపు గీత దాటించాడు.


జైపూర్‌: టీ20 వరల్డ్‌క్‌పలో అట్టర్‌ ఫ్లాపయిన టీమిండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలుపుతో మొదలెట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) దంచడంతో.. మూడు టీ20ల సిరీస్‌ భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో కివీ్‌సపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (70), మార్క్‌ చాప్‌మన్‌ (63) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. అశ్విన్‌, భువనేశ్వర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ అరంగేట్రం చేశాడు. సూర్యకుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.


రోహిత్‌ అదుర్స్‌..

లక్ష్య ఛేదనను భారత ఓపెనర్లు రాహుల్‌ (15), రోహిత్‌ ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్‌ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డాడు. సౌథీ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో రాహుల్‌ సిక్స్‌ బాదగా.. రోహిత్‌ 4,4,6తో చెలరేగడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే, రాహుల్‌ను శాంట్నర్‌ అవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో దూకుడుమీదున్న రోహిత్‌కు సూర్యకుమార్‌ జతకలవడంతో విధ్వంసం సృష్టిస్తారేమోనని అనిపించింది. కానీ, వీరిద్దరూ అందుకు భిన్నంగా ఆడడంతో.. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 85/1తో నిలిచింది. అయితే, ఆస్టల్‌ వేసిన 12వ ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌తో గేర్‌ మార్చిన సూర్య జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ దాటించాడు. మరోవైపు అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌ను బౌల్ట్‌ క్యాచవుట్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కానీ, ఎదురుదాడిని కొనసాగించి సూర్య.. సిక్స్‌తో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి 20 బంతుల్లో 21 పరుగులు కావాల్సి ఉండగా.. సూర్యను బౌల్ట్‌ వెనక్కిపంపడంతో కొంత ఉత్కంఠ రేగింది. ఆఖరి 2 ఓవర్లలో 16 పరుగులు అవసరమవగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (5), వెంకటేష్‌ అయ్యర్‌ (4) వెంటవెంటనే అవుట్‌ కావడంతో.. సమీకరణం 4 బంతుల్లో 5 పరుగులుగా మారింది. అయితే, బౌండ్రీ బాదిన పంత్‌ (17 నాటౌట్‌) మరో రెండు బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. 


చెలరేగిన గప్టిల్‌..

ఓపెనర్‌ గప్టిల్‌, చాప్‌మన్‌ రెండో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేసినా.. ఆఖర్లో పుంజుకొన్న టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సకు భువనేశ్వర్‌ తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. స్వింగ్‌ బంతితో ఓపెనర్‌ డారెల్‌ మిచెల్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ గప్టిల్‌, చాప్‌మన్‌ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును నడిపించడంతో.. 10 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ 65/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. వికెట్లు చేతిలో ఉండడంతో ఇక్కడి నుంచి కివీస్‌ గేర్‌ మార్చింది. సిరాజ్‌ వేసిన 11వ ఓవర్‌లో గప్టిల్‌ 16 పరుగులు రాబట్టగా.. ఆ తర్వాతి ఓవర్‌లో సిక్స్‌తో చాప్‌మన్‌ కెరీర్‌లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అయితే, ఒకే ఓవర్‌లో ధాటిగా ఆడుతున్న చాప్‌మన్‌తోపాటు గ్లెన్‌ ఫిలిప్స్‌ (0)ను అవుట్‌ చేసిన అశ్విన్‌ మంచి బ్రేక్‌ ఇచ్చాడు. మరోవైపు హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గప్టిల్‌ను చాహర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. కాగా, డెత్‌ ఓవర్లలో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. కివీస్‌ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేక పోయారు. 19వ ఓవర్‌లో సీఫెర్ట్‌ (12)ను అవుట్‌ చేసిన భువీ 5 రన్స్‌ ఇవ్వగా.. ఆఖరి ఓవర్‌లో రచిన్‌ రవీంద్ర (7)ను బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: గప్టిల్‌  (సి) శ్రేయాస్‌ అయ్యర్‌ (బి) దీపక్‌ చాహర్‌ 70, డారిల్‌ మిచెల్‌ (బి) భువనేశ్వర్‌ 0, మార్క్‌ చాప్‌మన్‌ (బి) అశ్విన్‌ 63, ఫిలిప్స్‌ (ఎల్బీ) అశ్విన్‌ 0, సీఫెర్ట్‌ (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 12, రచిన్‌ రవీంద్ర (బి) సిరాజ్‌ 7, శాంట్నర్‌ (నాటౌట్‌) 4, సౌథీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 164/6; వికెట్ల పతనం: 1-1, 2-110, 3-110, 4-150, 5-153, 6-162; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-24-2, దీపక్‌ చాహర్‌ 4-0-42-1, సిరాజ్‌ 4-0-39-1, అశ్విన్‌ 4-0-23-2, అక్షర్‌ 4-0-31-0. 

భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) చాప్‌మన్‌ (బి) శాంట్నర్‌ 15, రోహిత్‌ శర్మ (సి) రవీంద్ర (బి) బౌల్ట్‌ 48, సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 62, రిషభ్‌ పంత్‌ (నాటౌట్‌) 17, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌథీ 5, వెంకటేష్‌ అయ్యర్‌ (సి) రవీంద్ర (బి) మిచెల్‌ 4, అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 19.4 ఓవర్లలో 166/5; వికెట్ల పతనం: 1-50, 2-109, 3-144, 4-155, 5-160; బౌలింగ్‌: సౌథీ 4-0-40-1, బౌల్ట్‌ 4-0-31-2, ఫెర్గ్యూసన్‌ 4-0-24-0, శాంట్నర్‌ 4-0-19-1, టాడ్‌ ఆస్టల్‌ 3-0-34-0, డారెల్‌ మిచెల్‌ 0.4-0-11-1.  


1 టీ20ల్లో భారత్‌పై అత్యధికంగా 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కివీస్‌ జోడీ 

గప్టిల్‌-చాప్‌మన్‌. 2017లో రాజ్‌కోట్‌లో మున్రో-గప్టిల్‌ 105 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేశారు

Updated Date - 2021-11-18T09:50:57+05:30 IST