గెలుపు వలసల చరిత్ర

ABN , First Publish Date - 2021-12-12T05:43:54+05:30 IST

చరిత్ర, కల్పన పరస్పరం భిన్నమయినవని అనుకుంటాము. అటువంటప్పుడు, చారిత్రక కాల్పనిక రచనను, లేదా, కాల్పనిక చారిత్రక రచనను చేయడం చాలా కష్టమయిన పని. పాత్రలను, పాత్రల మధ్య మైత్రిని, ఘర్షణను అల్లేయవచ్చు. పెద్ద కష్టం కాదు...

గెలుపు వలసల చరిత్ర

చరిత్ర, కల్పన పరస్పరం భిన్నమయినవని అనుకుంటాము. అటువంటప్పుడు, చారిత్రక కాల్పనిక రచనను, లేదా, కాల్పనిక చారిత్రక రచనను చేయడం చాలా కష్టమయిన పని. పాత్రలను, పాత్రల మధ్య మైత్రిని, ఘర్షణను అల్లేయవచ్చు. పెద్ద కష్టం కాదు. కానీ, ఆ అల్లికలో ఒక కాలం కలనేతగా కలసిపోవాలి. ఆ కాలం ఎటువంటిదో ఏమిటో కేవలం వూహ సరిపోదు, ఎప్పటిదో తెలియని పురాణ కాలం కాదు, తెలిసీ తెలియనట్టుండే చారిత్రిక కాలం. పుస్తకాల గుట్టలలో ఉష్ట్రపక్షిగా తలదూర్చి, పురాతత్వ శిథిలాలలో సంచరించి, రెండుడుగుల ఎత్తు మెట్ల కొండ కోటలను అధిరోహించి, కీబోర్డును, చూపుడు వేలును మీటి కంప్యూటర్ తెర మీద భూప్రదక్షిణాలు చేసి, ఆ తరువాత ఊహను తీర్చిదిద్దాలి. ‘జగము నేలిన తెలుగు : గోదావరి నుంచి జావా దాకా’ అన్న ఈ నవల రాసిన డి.పి. అనురాధ కూడా దాదాపు అంతటి కష్టం పడ్డారు. 


నవలను, అందులోని విషయాలను పరామర్శించే ముందు, ఈ పుస్తకాన్ని రెండు ప్రాతిపదికల పైన అభినందించవలసి ఉంది. ఒకటి, అడుగంటిపోయిన తెలుగు అస్తిత్వ ఉద్వేగాలకు, పునరుత్తేజం కలిగించే లక్ష్యంతో రచయిత ఈ రచన చేసారు. రెండవది, తెలుగు ప్రవాసుల కథనాలను ఈ పుస్తకం కొత్త కోవలోకి చేర్చింది.


తమ భాష అన్నా, తమ సంస్కృతి అన్నా, చరిత్ర అన్నా తెలుగువారికి ఎటువంటి పట్టింపు ఉండదని అంటారు. ఆ మాట పైకి చెప్పుకోవడం కూడా తెలుగువారికి సరదా. ఐకమత్యం లేదని, పక్కవాడు పైకి పోతుంటే సహించలేరని అనుకోవడం కూడా తెలుగువారి ఆత్మనిందలో భాగమే. ఏ ఏ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక కారణాలు తెలుగువారిని తమిళుల కంటే భిన్నమైన ఆవేశ ఉద్వేగాలతో తీర్చిదిద్దాయో అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు అయితే, తెలుగు వారు కూడా భాషా జాతీయ ఉద్యమాలు చేసారని, స్వాతంత్ర్యం తరువాత, భాషా ప్రాంతీయ పార్టీ కూడా పెట్టారని, అయినప్పటికీ, తెలుగు వారి మధ్య గట్టి జాతీయ (లేదా ఉపజాతీయ) బంధం యేర్పడ లేకపోయిందని తెలుసుకుంటే చాలు. విశాలాంధ్ర ఏర్పడడం, తెలుగు వారికి గొప్ప భాషా జాతీయాభిమానాన్నీ నేర్పలేదు, రాష్ట్ర విభజన అటువంటి లక్ష్యానికి అపకారమూ చేయలేదు. ఆంధ్ర, తెలంగాణ అన్నవి రెండు వేరు వేరు రాజకీయ నామాలు కావచ్చును కాని, తెలుగు అన్న గొడుగు కింద కలసి మెలసి చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి, పంచుకోదగిన ఘన చరిత్రను గుర్తించి ఆవిష్కరించుకోవడం. రాజకీయ, పరిపాలనా పటాలకు అతీతమైన సమష్టి స్ఫూర్తిని పొందడం. అనురాధ మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. 


ప్రవాసులు అంటే, తెలుగు వారు కూటి కోసం, కూలి కోసం వెళ్ళిన ఆధునిక వలసలనే ఎక్కువగా చెప్పుకుంటున్నాము. మారిషస్‌కు, దక్షిణాఫ్రికాకు, ఫిజి కి, కరేబియన్ దీవులకు, సింగపూర్ మలేసియాలకు భారతీయ, తెలుగు కార్మికులు వలస వెళ్ళారని తెలుసు. వాళ్ల కథలు, కథనాలు కూడా ఇంకా మన చరిత్ర రచనలో భాగం కాలేదు. రెండు వందలేల్ల లోపు జరిగిన ఈ వలసల గురించిన పరిశోధనకు ఎక్కువ ఆస్కారం ఉన్నది. భారతీయాంగ్ల నవలా రచనలో ప్రసిద్ధుడైన అమితవ్ ఘోష్ మారిషస్ బిహార్, బెంగాల్ నుంచి జరిగిన వలసల గురించి రచన చేసారు. చైనా ఇతర తూర్పు దేశాలతో జరిగే వాణిజ్యం గురించి కూడా ఆయన రాస్తారు. ఎన్నో చారిత్రిక ఆధారాలను పరామర్శించి సాధికారికంగా చేసే రచనలు అవి. మరి, సంపన్నేతర దేశాలకు తెలుగు ప్రాంతాల నుంచి జరిగిన శ్రామిక వలసల గురించి రాసే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉద్యోగ, వృత్తి రీత్యా విస్తరించారు. ఆ ప్రవాస తెలుగు బృందాలని, వారి సంస్కృతి వ్యవహారాలను అన్నిటిని కలిపి డయాస్పోరా అంటున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా అమెరికాకు జరిగిన వలసల గురించి, వాటి అనుబంధ విశేషాల గురించి, కొత్త చోట్ల అపరిచితత్వం గురించి, విడిచి వచ్చిన చోట్ల మీద బెంగ గురించి బాగానే కాల్పనిక సాహిత్యం వచ్చింది. గల్ఫ్ దేశాలకు జరిగే శ్రామిక ప్రవాసం కూడా అంతో ఇంతో అక్షరాలలోకి ఎక్కింది. చెరుకు తోటలకు కట్టు కూలీలుగా మొదలుపెట్టి, బాడీ షాపింగ్‌లో తరలి వెళ్ళిన వారిదాకా చరిత్ర అంతా కలిపి రెండు వందల ఏళ్లే. కానీ, సమీప గతం గురించిన చారిత్రిక కాల్పనిక సాహిత్యం తెలుగులో దాదాపుగా లేదనే చెప్పాలి. ఇక వెయ్యి పదిహేను వందలేళ్ళ కిందటి వలసల గురించిన కథలు నవలలు ఎట్లా ఆశించగలం?ఇరవయ్యో శతాబ్ది తొలి దశాబ్దాలలో, నవలా రచన ఆరంభ దశలో అనేక చారిత్రిక నవలలు వచ్చాయి. నాటికి వాటికి తెలిసినంత మేరకు వాతావరణాన్ని, వేషభాషలను ఆ నవలలు చిత్రించాయి. కాల్పనికత అతిశయించి ఉండవచ్చు. కాని, సీమాంతర తెలుగు రాజ్యాల గురించి అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి వంటి వారు రాయలేదు. సత్యరాజా పూర్వదేశ యాత్రలు వంటి రచనల్లో నౌకాయానాన్ని చిత్రించారు కాని, అది ఇతర సాహిత్యాల ప్రభావం తోనో, ఊహలతోనో చేసినది. విదేశ, సముద్ర యానాల గురించి రాసేంత దేశీయ సమాచారం మన రచయితలకు అందుబాటులో లేకపోయి ఉండవచ్చు. అటువంటి సమాచారాన్ని ఒకచోట అందుబాటులోకి తేవడానికి అనురాధ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మైన్మార్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలలో తెలుగు అడుగుజాడలను ఆమె ఆవిష్కరిస్తున్నారు. వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, చారిత్రక స్థలాలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరిస్తూ, అన్వయిస్తూ తానే కాల్పనిక రచనకు పూనుకోవడం విశేషం. 


వేయి పదిహేనేళ్ళ కిందట జరిగిన సంఘటనలు, వలసలకు సంబంధించి విస్తృత సమాచారం దొరకడం కష్టం. క్రైస్తవ మిషనరీల రికార్డులు వలస దేశాల చరిత్రలో అనేక ఖాళీలను భర్తీ చేస్తాయి. చరిత్రలో మనకు తెలిసి మొదటి మిషనరీ మతం అయిన బౌద్ధం కూడా ఎంతో చరిత్రను రికార్డు చేసింది. ఆగ్నేయ ఆసియా దేశాలలో తెలుగు వారి ఉనికికి కూడా అనేక బౌద్ద గ్రంథాలు, యాత్రికుల కథనాలు ఆధారంగా ఉన్నాయి. మనకు తెలియని చరిత్ర ఆకరాలు మరిన్ని ఉన్నాయా?

కె. శ్రీనివాస్

(‘జగమునేలిన తెలుగు’ పుస్తకం ముందుమాటలోని కొన్ని భాగాలు ఇవి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కాలేజీ, ఖైరతాబాద్, హైదరాబాద్‌లో నేడు ఉదయం 10 గం.లకు జరిగే ఒక కార్యక్రమంలో పుస్తకావిష్కరణ, రచయిత డి.పి. అనురాధకు తాపీ ధర్మారావు పురస్కార ప్రదానం)

Updated Date - 2021-12-12T05:43:54+05:30 IST