Abn logo
Mar 18 2020 @ 00:15AM

మద్యం దుకాణాలూ తక్షణం మూసేయించాలి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మద్యం దుకాణాలు బంద్ చేయండి. మహమ్మారి లా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు మద్యం దుకాణాలు, సిట్టింగ్ రూములు, అనధికారికంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు తక్షణమే మూసి వేయించాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మద్యం దుకాణాల ముందు ప్రజలు, యువకులు జాతర లాగా గుమికూడుతున్నారు. తాగిన మద్యం సీసాలు, గ్లాసులు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మద్యం సేవించే సమయంలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం, మిగిలిన మద్యం పారపోయడం లాంటి చర్యలు కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ప్రమాదముంది. తెలంగాణలో అత్యధిక మద్యం దుకాణాలు నేషనల్ హైవే, లేదా జనసమర్థం గల ప్రాంతాల్లో ఉన్నాయి. మద్యం సేవించే వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లి కరోనా వైరస్ తేలిగ్గా వారిలో ప్రవేశించి విస్తరించే అవకాశాలూ ఎక్కువే. అదేవిధంగా మద్యం సేవించే వారిలో ఊపిరితిత్తులు, కాలేయాల సామర్థ్యం తగ్గిపోతుంది. కరోనా వైరస్ కూడా ప్రధానంగా ఊపిరితిత్తుల పై దాడి చేస్తుంది, మద్యపాన ప్రియులు శారీరకంగానూ బలహీనంగా ఉండటం వలన వీరు అతి సులభంగా వైరస్ బారిన పడే అవకాశముంది. వీరు పెద్దగా స్వీయ  జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ విస్తరణకు కారకులవుతారు. కనుక, మద్యం దుకాణాలు, బార్లు, అనధికారిక బెల్టుషాపులు తక్షణమే మూయించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలలు, సినిమా హళ్ళు, మాల్స్‌ మూత వేయించిన విధంగానే తక్షణమే మద్యం దుకాణాలు మూయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.                    

నల్లమోతు తిరుమల రావు

కన్వీనర్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఖమ్మం జిల్లా

Advertisement
Advertisement