ఒక్కో బీరుకు వంద, క్వార్టర్‌కు 50, పుల్‌ బాటిల్‌కు 300!

ABN , First Publish Date - 2021-05-11T14:52:40+05:30 IST

ఒక్కో బీరుకు రూ.వంద, క్వార్టర్‌కు రూ.50, పుల్‌ బాటిల్‌కు రూ.200-300

ఒక్కో బీరుకు వంద, క్వార్టర్‌కు 50, పుల్‌ బాటిల్‌కు 300!

  • మద్యం దందా
  • బెల్ట్‌ షాపులలో యథేచ్ఛగా అమ్మకాలు  
  • చోద్యం చూస్తున్న పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు

హైదరాబాద్/సైదాబాద్‌ : కర్ఫ్యూను అదనుగా చేసుకుని సైదాబాద్‌, సింగరేణి కాలనీ, ఖాజాబాగ్‌ బస్తీలలో బెల్ట్‌ షాపులలో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కర్ఫ్యూ వల్ల మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు మూసివేస్తుండటంతో బెల్ట్‌షాపుల వ్యాపారులు ఆ తర్వాత జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి కాలనీ రోడ్లపై మందుబాబుల హడావుడి కనిపిస్తోంది. ఇదే అదనుగా ఒక్కో బీరుకు రూ.వంద, క్వార్టర్‌కు రూ.50, పుల్‌ బాటిల్‌కు రూ.200-300 అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ఇదంతా కొందరు వైన్స్‌ దుకాణాల యాజమానుల అండతోనే ముందస్తుగా మద్యం నిల్వ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


ఎనీ టైం మద్యం...

సింగరేణి కాలనీ, ఖాజాబాగ్‌ బస్తీలలో ఏనీ టైం మద్యం దొరుకుతోందని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సింగరేణి కాలనీ రోడ్డుపై వాహనాదారులు వెళితే మహిళలు, చిన్నారులు తారస పడుతున్నారు. మద్యం బాటిల్స్‌ కావాలా అంటూ అడుగుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఇంత జరుగుతున్నా పోలీసులు, మలక్‌పేట ఎక్సైజ్‌ పోలీసులు ఇటు దిక్కుగా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


చర్యలు చేపట్టండి: స్థానికులు

సింగరేణి కాలనీలో రాత్రివేళల్లో సాగుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలని కోరుతూ సోమవారం అఖిల పక్ష నేతలు సైదాబాద్‌ పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. కరోనా మహ్మమారి విజృంభిస్తున్న సమయంలో మద్యం కోసం వస్తున్న వందలాది మందితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 


ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

సుబ్రమణ్యంనగర్‌లోని ఖాజాబాగ్‌ గుడిసెలలో విచ్ఛలవిడి మద్యం, గుడంబా అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెట్రో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ పారా లీగల్‌ వలంటీర్‌ పి.సత్యనారాయణ రాజు సోమవారం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మద్యం కోసం వస్తున్న మందుబాబులతో కాలనీవాసులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. మద్యం, గుడంబా అమ్మకాలు అరికట్టాలని కోరారు.

Updated Date - 2021-05-11T14:52:40+05:30 IST