విండీ‌స్ దే ఆధిక్యం

ABN , First Publish Date - 2020-07-11T09:28:17+05:30 IST

బౌలింగ్‌లో సత్తా చాటిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (65), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (61) అర్ధసెంచరీలతో రాణించగా

విండీ‌స్ దే ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌ 318 

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 15/0


సౌతాంప్టన్‌: బౌలింగ్‌లో సత్తా చాటిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (65), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (61) అర్ధసెంచరీలతో రాణించగా పర్యాటక జట్టు తొలి టెస్టులో 114 పరుగుల ఆధిక్యం సాధించింది. శుక్రవారం మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 102 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌కు నాలుగు, జేమ్స్‌ అండర్సన్‌కు మూడు, బెస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ రోజు ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు బర్న్స్‌ (10), సిబ్లే (5) ఉన్నారు. 

బ్రాత్‌వైట్‌ అర్ధసెంచరీ: 57/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీ్‌సను ఇంగ్లండ్‌ ఇబ్బందిపెట్టలేకపోయింది. బ్రాత్‌వైట్‌, హోప్‌ (16) తొలి గంట పాటు ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును వంద పరుగులు దాటించారు. అలాగే ఆర్చర్‌ ఓవర్‌లో హోప్‌ ఎల్బీ అయినప్పటికీ విండీస్‌ రివ్యూకు వెళ్లడంతో అది నోబాల్‌గా తేలింది. అయితే ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. స్పిన్నర్‌ బెస్‌ బౌలింగ్‌లో అతడు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ మాత్రం చూడచక్కని షాట్లతో అలరిస్తూ 22 ఇన్నింగ్స్‌ తర్వాత అర్ధసెంచరీ సాధించాడు. బ్రూక్స్‌తో కలిసి అతడు  స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. నిలకడగా రాణిస్తున్న బ్రాత్‌వైట్‌ను 42వ ఓవర్‌లో స్టోక్స్‌ దెబ్బతీశాడు. ఆ ఓవర్‌లో తను మూడు ఫోర్లు సాధించి ఊపు మీద కనిపించినా చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. 

రెండో సెషన్‌లో ఆధిక్యం: లంచ్‌ విరామం తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్లు ఒత్తిడి పెంచారు. దీంతో కొద్దిసేపటికే ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న బ్రూక్స్‌ను అండర్సన్‌ అవుట్‌ చేశాడు. దీంతో విండీస్‌ ఆచితూచి ఆడాల్సి వచ్చింది. అటు చేజ్‌ (47) అతి జాగ్రత్త కనబరుస్తూ ఈ సెషన్‌లో చేసిన 14 రన్స్‌ కోసం 102 బంతులను తీసుకున్నాడు. 68వ ఓవర్‌లో విండీస్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు డౌరిచ్‌ మాత్రం అడపాదడపా బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. 

స్టోక్స్‌ హవా: రెండో కొత్త బంతితో చివరి సెషన్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ ఫలితం రాబట్టింది. ఆరంభంలో చేజ్‌ గేరు మార్చి వేగం కనబరుస్తూ హాఫ్‌ సెంచరీ వైపు కదిలాడు. అయితే 89వ ఓవర్‌లో అండర్సన్‌ అవుట్‌ స్వింగర్‌కు ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఆరో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు డౌరిచ్‌ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నప్పటికీ స్టోక్స్‌ చెలరేగి విండీ్‌సను కోలుకోనీయలేదు. స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్‌ హోల్డర్‌ (5), జోసెఫ్‌ (18) వికెట్లతో పాటు చివర్లో వేగం కనబరిచిన డౌరిచ్‌ను కూడా తనే పెవిలియన్‌కు చేర్చగా ఆఖరి వికెట్‌ను వుడ్‌ తీశాడు.


ఉమ్మికి బదులు దాన్ని వాడా..

బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకూడదనే ఐసీసీ నిబంధనపై ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రత్యామ్నాయం ఆలోచించారు. విండీ్‌సతో టెస్టులో ఉమ్మికి బదులు తమ వీపు వెనకాల వచ్చే చెమటను బంతికి పూసినట్టు పేసర్‌ మార్క్‌ వుడ్‌ తెలిపాడు. ‘లాలాజలానికి వెన్నెముక చెమట ప్రత్యామ్నాయం కాగలదు. నేనైతే అండర్సన్‌, ఆర్చర్‌ నుంచి కాస్త చెమటను తీసుకుని బంతికి పూశా’ అని వుడ్‌ చెప్పాడు.


విశ్వమంతా అండగా..

తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు మద్దతుగా మోకాలిపై కూర్చుని సంఘీభావం ప్రకటించడం తన హృదయాన్ని తాకిందని విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ తెలిపాడు. ఆ సమయంలో విశ్వమంతా తనకు అండగా ఉందనిపించిందని చెప్పాడు. క్రికెట్‌ ప్రపంచమంతా వర్ణ వివక్షను  వ్యతిరేకిస్తుందనేందుకు ఇదే సంకేతమన్నాడు.

Updated Date - 2020-07-11T09:28:17+05:30 IST