Abn logo
Sep 27 2021 @ 00:15AM

గాలి వాన బీభత్సం

నరసన్నపేట: వరద నీటిలో బోర్డు ప్రాథమిక పాఠశాల


  నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 

 జిల్లా వ్యాప్తంగా గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం

  అప్రమత్తమైన అధికారులు

 ముందస్తుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేత

 చీకటిలో ఇబ్బంది పడిన ప్రజలు

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లాలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఉదయం నుంచీ ఎడతెరిపిలేని వర్షం కురవగా సాయంత్రం నుంచి ఈదురుగాలులు వీచాయి. దీంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఆదివారం ఉదయం నుంచి వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈదురుగాలులకు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు చీకటిలోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తుఫాన్‌ ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.


లోతట్టు ప్రాంతాలు జలమయం

పలాస/కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభా వంతో ఆదివారం రోజంతా ఎడ తెరిపిలేని వర్షాలు కురిశాయి. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం తో పాటు ఈదురు గాలుల వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అరకొరగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు తిరిగాయి. పలాస-అక్కుపల్లి రోడ్డులోని రాజాం కాలనీ వద్ద రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. దీనికి తోడు వర్షం కురవడంతో వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. యువకులు స్పందించి చెట్లను తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఈదురు గాలులకు హోర్డింగ్‌లు, షాపులకు వేసిన టెంట్లు ఎగిరిపోయాయి.  


సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

పలాస రూరల్‌: వరహాలగెడ్డ పొంగే అవకాశం ఉండడంతో తోతట్టు ప్రాంతమైన అమలకుడియా గ్రామాన్ని తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన రావు సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేక భద్రత మధ్య ఆవాసం ఏర్పా టు చేశారు. ముందుగా ప్రజలను బ్రాహ్మణతర్లా హైస్కూల్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రా మంలో వీఆర్వో సురేష్‌,  అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీఐ వేణు గోపాలరావు ఉన్నారు. బ్రాహ్మణ తర్లాలో వీఆర్వో శ్రావణ్‌ ఆధ్వర్యంలో ప్రజల ను అప్రమత్తం చేశారు. టెక్కలిపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతుల కుటుంబాలను స్థానిక సాయి స్కూల్‌కు తరలించి సౌకర్యాలు కల్పించినట్లు  వీఆర్వో సోమేశ్వరరావు తెలిపారు.

 

వంద అడుగులు ముందుకొచ్చిన సముద్రం

హరిపురం: మండలంలోని సంకుజోడి, దామోదరసాగర్‌, కళింగదళ్‌ రిజర్వాయర్లు, కాలు వలు పొంగిపొర్లుతున్నాయి. రట్టి వద్ద సుమారు వంద అడుగుల సముద్రం ముందుకురావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోహరిబందలో స్తంభం కూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  బిత్తరబంద, చినరంగుమటియా, సింగుపురంతో పాటు  40కు పైగా గూడెల్లో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో ఒక్క పునరావాస కేంద్రం కూడా తెరవలేదు. దీంతో గిరిజనులకు చర్చి, పాఠశాల వరండాల్లో తలదాచుకుంటున్నారు. 

 


నదీతీర గ్రామాల్లో డీఎస్పీ పరిశీలన 

నరసన్నపేట: నదీ తీర గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండా లని దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు అన్నారు. ఆదివారం వంశధార నదీ తీర గ్రామాలను ఆయన సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సచివాలయ మహిళా పోలీసులకు సూచించారు. అలాగే హైవేపై పలు కూడళ్లు పరిశీలించి ఈదురుగాలులకు చెట్లు పడితే తొలగించేందుకు వాహనాలను సిద్ధం చేయాలని ఎస్‌ఐ సత్యనారాయణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామునుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. వర్షపునీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వంశధార నది ఉధృ తంగా ప్రవహిస్తోంది. దీంతో  గెడ్డ వానిపేట, కామేశ్వరిపేట, లుకలాం, చేనులవలస, మడపాం, గోపాల పెంట ప్రజలను  అప్రమత్తం చేశారు. 


ఈదురుగాలుల భీభత్సం

నందిగాం: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం  ఈదురుగాలు లతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో పశువుల చావి డులు, ఇంటి పైకప్పు రేకులు ఎగరకుండా తాళ్లతో కట్టే చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ ఎన్‌..రాజారావు పర్య వేక్షణలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉయ్యాలపేట లోతట్టు గ్రామం కావడంతో అక్కడి పరి స్థితిపై ఆరాతీశారు. మధ్యాహ్నం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో అంధకారం నెలకొంది.