సంకల్పం గొప్పది

ABN , First Publish Date - 2020-09-11T08:40:44+05:30 IST

ఒకప్పుడు నారదుడు సనత్కుమారుని వద్దకు వెళ్లి తనకు ఏదైనా ఉపదేశం చేయమన్నాడు. అందుకు సనత్కుమారుడు.. ‘

సంకల్పం గొప్పది

ఒకప్పుడు నారదుడు సనత్కుమారుని వద్దకు వెళ్లి తనకు ఏదైనా ఉపదేశం చేయమన్నాడు. అందుకు సనత్కుమారుడు.. ‘నీకేమి తెలుసో చెప్పు’ అని అడిగాడు. దానికి నారదుడు.. ‘‘నేను వేద, వేదాంగాలను, జ్యోతిష, సంగీతాది శాస్త్రాలను చదివాను. ఎన్నో విద్యలు నేర్చి మంత్రవిదుడనయ్యాను కానీ, ఆత్మ విదుడను కాలేదు. నాకు శబ్ద జ్ఞానమే కలిగిందిగానీ ఆత్మజ్ఞానం కలగలేదు. ఆత్మ నెరిగినవాడు దుఃఖాల నుంచి విడుదలవుతాడని విన్నాను. దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నన్ను తరింపజేయండి’’ అని అడిగాడు.


అందుకు సనత్కుమారుడు.. ‘‘నీవు నేర్చిన ఋగ్వేదాది విద్యలన్నీ ‘నామ’ జ్ఞానం. ఆత్మవిదుడు కావడానికి నామ జ్ఞానం అవసరమే. కానీ, అక్కడే ఆగిపోకూడదు’’ అన్నాడు. ఇది విన్న నారదుడు.. ‘‘నామమునకు మించినది ఉన్నదా?’’ అని అడిగాడు. అందుకు సనత్కుమారుడు.. ‘‘ఉన్నది. నామం కంటే వాక్కు గొప్పది. వాక్కు లేనిచో ధర్మాధర్మములిటువంటివి అని చెప్పే వాడుండడు. చెప్పే వాడు లేనప్పుడు అడిగేవాడుండడు. ప్రపంచమందలి మంచిచెడ్డలు తెలియవు. అదే విధంగా సత్యాసత్యములిటువంటివి అని తెలియదు. కాబట్టి వాక్కును ఉపాసించు’’ అని బోధించాడు. 

అప్పుడు నారదుడు.. ‘‘మరి వాక్కు కంటే కూడా శ్రేష్ఠమైనది ఇంకేదైనా ఉందా?’’ అని ప్రశ్నించాడు. దానికి సనత్కుమారుడు.. ‘‘వాక్కు కంటే గొప్పది మనసు. రెండు ఉసిరికాయలు లేక రెండు రేగుపండ్లను పిడికిలియందు ఇముడ్చు కొనగలిగినట్లు.. నామమును, వాక్కును రెండింటినీ మనసు అనుభవించగలదు. మనిషి ఏదైనా పనిచేయడానికి ముందు మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కర్మను ఆచరిస్తాడు. కాబట్టి మనసే లోకం. మనసే బ్రహ్మం, మనసుచే ప్రేరేపించబడిన వాక్కు నామాన్ని ఉచ్చరిస్తుంది. కాబట్టి, నారదా.. నామము వాక్కులకన్నా మనసు గొప్పది. నీవు మనసును శాసించు.’’ అని ఉపదేశించాడు.


అప్పుడు నారదుడు.. ‘మనసు కంటె గొప్పది ఇంకేదైనా ఉందా?’ అని అడిగాడు. మనసు కంటే సంకల్పం గొప్పదన్నాడు సనత్కుమారుడు. ‘‘సంకల్పంతోనే మనిషి ఆలోచన ప్రారంభిస్తాడు. ఆ ఆలోచనను మననం చేసుకుని.. మాటను ప్రేరేపిస్తాడు. కాబట్టి మనసు నుంచి నామం వరకూ అన్నింటికీ సంకల్పమే ఆధారం. సంకల్పమే వాటికి ఆత్మ. బ్రహ్మాండము నందు, పిండమునందు సంకల్పమే కనపడుతోంది. స్వర్గమునందు, భూమియందు ఒకే సంకల్పమున్నది. ఆకాశం, వాయువు, జలము, తేజస్సు నందు ఒకే సంకల్పం ఉంది.




అందుకే భూమిపై వర్షం ఏర్పడుతోంది. వర్షమునందలి సంకల్పం వల్లనే అన్నం ఉత్పన్నమవుతోంది. అన్నగత సంకల్పం వల్లనే ప్రాణం ఏర్పడుతుంది. ప్రాణ సంకల్పం వల్ల మంత్రం, తత్సంకల్పం వల్ల కర్మ, దాని సంకల్పం వల్ల లోకం, లోక సంకల్పం వల్ల అంతా జరుగుతోంది. కాబట్టి, నారదా.. విశ్వమంతా సంకల్పమే. కావున నీవు సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసించు. సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసించేవాడు స్థిరుడు, ప్రతిష్ఠుడు, సంతాపరహితుడు అవుతాడు’’ అని వివరించాడు. 

- జక్కని వేంకటరాజం


Updated Date - 2020-09-11T08:40:44+05:30 IST