మా ఆవేదన ఆలకిస్తారా?.. కుప్పం టీడీపీ శ్రేణుల్లో ఆతృత

ABN , First Publish Date - 2021-02-25T05:40:41+05:30 IST

చంద్రబాబు తాజా పర్యటన ఎన్నడూ లేనంతగా..

మా ఆవేదన ఆలకిస్తారా?.. కుప్పం టీడీపీ శ్రేణుల్లో ఆతృత

నేటినుంచి చంద్రబాబు పర్యటన


కుప్పం(చిత్తూరు): పంచాయతీ ఎన్నికల్లో పరాభవం..అండగా నిలవలేకపోయారంటూ నేతలపై కార్యకర్తల ఆగ్రహం.. మనస్తాపంతో నాయకుల రాజీనామాల ప్రకటనల ప్రహసనం.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అవసరం.. ఈ నేపథ్యంలో జరుగుతున్న చంద్రబాబు కుప్పం పర్యటనలో అయినా టీడీపీ పోస్టుమార్టం జరిగేనా? ప్రక్షాళన ప్రారంభమై తమకు మళ్లీ మంచి రోజులొచ్చేనా అని కార్యకర్తల్లో ఒకటే ఉత్కంఠ... అధినేత రాకకోసం ఎదురు చూపుల్లో ఎనలేని ఆతృత.చంద్రబాబు తాజా పర్యటన ఎన్నడూ లేనంతగా కుప్పం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. కార్యకర్తల్లో అంతకుమించి ఆశలు కల్పిస్తోంది.


స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత చంద్రబాబు సుమారు ఏడాది తరువాత కుప్పం వస్తున్నారు. ఈసారి ఆయన గ్రామాల్లో పర్యటించడం లేదు. నియోజకవర్గ ప్రజలను పలకరించబోవడంలేదు. కేవలం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడానికే వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరాభవం తర్వాత నిజంగా పార్టీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకోవడానికి వస్తున్నారు. నేతల తీరుపై కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడానికి గల కారణాలను శోధించడానికి వస్తున్నారు.అయితే ఈసారైనా పోస్టుమార్టం నిజంగా జరుగుతుందా లేక ఎప్పటిలాగానే నేతల ఉపన్యాసాలు, అధినేత ప్రసంగాలతోనే సరిపుచ్చుతారా అన్న అనుమానాల మధ్యే చంద్రబాబు రాకకోసం కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఇప్పటికైనా అధినేత వాస్తవాలు తెలుసుకుని తమ గోడు విని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.


గతంలో కూడా ఆయన కుప్పం వచ్చినపుడు మండల పార్టీ సమావేశాలు చాలాసార్లే నిర్వహించారు. అయితే కార్యకర్తలు మాట్లాడడానికి వీలులేకుండా ఎంపిక చేసిన నాయకులు, అధినేత ప్రసంగాలతోనే ఆ సమావేశాలు ముగిసిపోయాయి. ఈసారి కూడా అలాగే చేస్తే ఏమాత్రం ఫలితం ఉండదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. వీలైతే గ్రామస్థాయి కార్యకర్తలను మాట్లాడించాలని, వారి వేదనను, క్షేత్రస్థాయిలో నేతల తీరుతో వారు ఎదుర్కొంటున్న బాధలను విని తీరాలంటున్నారు. అప్పుడే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పార్టీ పరువు నిలిపే ఫలితాలు చవి చూడగలమని అధినేతను వేడుకుంటున్నారు.


కోర్‌ కమిటీని ప్రక్షాళన చేస్తారా?

చంద్రబాబు ఇక్కడికొచ్చినా, ఇక్కడినుంచి శ్రేణులు అమరావతి లేదా హైదరాబాదే వెళ్లినా ఆయన చుట్టూ ఒక కోటరీ పోగు పడి ఉంటుంది. దాన్నే కోర్‌ కమిటీ అని అని పిలుచుకుంటారు. వివిధ పార్టీ పదవుల్లో ఉన్న, రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న లేదా అనుభవించి మాజీలుగా మారిన నేతలు 25మంది ఈ కోటరీలో సభ్యులు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఈ కమిటీతో గంటల తరబడి సమావేశమవుతారు. వారు చెప్పిన మాటలనే చెవికెక్కించుకుంటారు. కార్యకర్తలు ఆ గెస్‌హౌస్‌ వెలుపలే బ్యారికేడ్లకీవల ఉండిపోతారు. గ్రామ పర్యటనలు చేసినప్పుడు అక్కడక్కడా ఆగి చంద్రబాబు ఉపన్యాసాలిస్తారు. మధ్యలో ఏ గ్రామస్థుడు లేదా కార్యకర్త అడ్డుపడి ఏదైనా సమస్య ప్రస్తావించబోతే.. అంతా తనకు తెలుసనే రీతిలో తలూపి ఏదో ఒక మాట మాట్లాడి అంతటితో అయిందనిపిస్తారు.


కోర్‌ కమిటీ సభ్యుల తీయనైన మాటలు ఆలకించి అంతా బాగుందని భ్రమపడుతూ వెనక్కి వెళ్లిపోతారు. మంగళవారం జరిగిన టీడీపీ సమావేశంలో- ఆ కోర్‌ కమిటీలో సభ్యుడైన ఓ నేత.. ‘అధికారంలో ఉన్నపుడు మనమే వర్కులు చేశాం. కమీషన్లు తిన్నాం. ఆ తిన్న దాంట్లోంచి ఒక్కొక్కరు ఏ కొద్దిమొత్తమో పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకోసం ఖర్చు పెట్టి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘోర పరాజయం తప్పేది’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇంతగా భ్రష్టు పట్టిన కోర్‌ కమిటీ వ్యవస్థను ఇకనైనా ప్రక్షాళన చేస్తారా అని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇతర నాయకులు ఎంత మంది ఉన్నా.. కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌  చెప్పిందే వాస్తవం అధినేతకు. తమను పక్కన పెట్టేస్తున్నారని ఎంతమంది నేతలు చిన్నబుచ్చుకున్నా... వాస్తవాలు చెప్పినా వినడంలేదని మరెంతమంది కార్యకర్తలు ఆవేదన చెందినా ఇంతకాలం పట్టించుకోనేలేదు.


పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ‘మేము బాగా పనిచేసినా అధికార పార్టీ డబ్బులు వెదజల్లడం, భయపెట్టడం వల్లే వైసీపీ విజయం సాధించ గలిగింది’ అంటూ చంద్రబాబును సమాధానపరచబోయారు.అయితే మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో వీరిపై కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో తమ హోదాలకు రాజీనామాలు చేసేస్తామని తప్పుకుంటున్నారు.అయితే అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి, ఆస్తులు కూడగట్టుకుని ఇప్పుడు పక్కకు తప్పుకోవడమేమిటని అదే కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన తర్వాత రాజీనామాలు చేయాలన్న డిమాండు కార్యర్తలనుంచి వినబడుతోంది.   

Updated Date - 2021-02-25T05:40:41+05:30 IST