రేపే బడి.. వెళ్లేదెలా?

ABN , First Publish Date - 2022-07-04T08:30:51+05:30 IST

రేపే బడి.. వెళ్లేదెలా?

రేపే బడి.. వెళ్లేదెలా?

పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ స్కూళ్ల దుస్థితిపై సచిత్ర కథనం


మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త దుస్తులు.. కొత్త పుస్తకాలు.. కొత్త చదువులు.. కానీ పాఠశాలలు మాత్రం అవే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాడుబడిన భవనాలు, పెచ్చులూడే శ్లాబులు, వర్షంతో చెరువులుగా మారే పాఠశాలలే కనిపిస్తున్నాయి. నాడు-నేడు పథకంలో నిధులు మంజూరుచేసి సర్కారు బడులను కార్పొరేట్‌ స్కూళ్లుగా మారుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇందుకోసం పాఠశాలల ప్రారంభానికి మరింత సమయం తీసుకున్నా.. చాలా ప్రాంతాల్లో పనులే ప్రారంభం కాలేదు. అసంపూర్తి పనులతో పాఠశాలల్లో కొత్త సమస్యలు తిష్ఠవేశాయి. బడికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ చదువుకోవాలో.. తెలియని దుస్థితి నెలకొంది. 

ఈ పాఠశాలకు వెళ్లేదెలా?

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో సగరుపేట మండల ప్రజా పరిషత్‌ పాఠశాలకు వెళ్లేందుకు మార్గం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది.


ఎప్పుడైనా కూలిపోవచ్చు!

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పరుశురామపురంలో గిరిజన సంక్షేమశాఖకు చెందిన ప్రాథమిక పాఠశాల ఇది. తరగతి గోడ పగుళ్లిచ్చి ఏ క్షణమైనా కూలిపోయే దుస్థితిలో ఉంది. ఇచ్ఛాపురం మండలం కె.శాసనం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 464 మంది చదువుతున్నారు. అదనపు గదులకు రెండో విడత నాడు-నేడు కింద రూ.2.03 కోట్లు మంజూరు చేశారు. నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి.


ఎక్కడి పనులక్కడే! 

నాడు-నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. గుంటూరు జిల్లాలో అనేక పాఠశాలలు సమస్యల వలయంలోనే ఉన్నాయి. పెచ్చులూడిన శ్లాబులు, బీటలు తీసిన భవనాలు, వర్షం నీటిలో ఆవరణలు, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు అంతటా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని గుండేపల్లి ప్రాథమిక పాఠశాల ఈ దుస్థితికి అద్దం పడుతోంది.


తరగతి గదిలోకి ఎలా వెళ్లాలి?

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని అల్లీపురం ఎస్‌ఆర్‌ఆర్‌ జడ్పీ హైస్కూలు ఇది. అదనపు గదుల నిర్మాణం కోసం పాత భవనం చుట్టూ ఇలా తవ్వేశారు. వీటిని దాటుకొని విద్యార్థులు గదుల్లోకి వెళ్లే అవకాశమే లేదు. మరి తరగతులు జరిగేదెలా!?


పాఠశాల.. శిథిలావస్థ

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఈలి వరలక్ష్మి మునిసిపల్‌ హైస్కూల్‌ ఇది. 1972లో నిర్మించిన ఈ పాఠశాలలో 300 మంది చదువుకుంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి, ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా ఉంది. 


విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలి?

తిరుపతి జిల్లాలో నాడు-నేడు రెండవ దశలో ఎంపికైన పాఠశాలల్లో పనులు చాలావరకూ అసంపూర్తిగా ఉన్నాయి. గదులన్నీ నిర్మాణ సామగ్రితో, అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది.


ఇదీ.. నంబర్‌ 1 పాఠశాల

అనంతపురం నగరంలోని నంబర్‌-1 ప్రభుత్వ పాఠశాల భవనం దుస్థితి ఇది. పైకప్పు పెచ్చులూడి కూలేందుకు సిద్ధంగా ఉంది. పిల్లలు బడికి వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


ఎప్పుడు కూలుతుందో!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సోగనూరులోని ప్రాథమికోన్నత పాఠశాల ఇది. 1 నుంచి 8 వరకు 233 మంది చదువుతున్నారు. 2010లో నిర్మించిన అదనపు తరగతి గదులు పూర్తిగా శిథిలమయ్యాయి. జిల్లాలో తరగతి గదుల కొరత, అసౌకర్యాలతో నడుస్తున్న పాఠశాలలు ఎన్నో. నాడు-నేడు ఫేజ్‌-2 కింద 569 పాఠశాలలకు రూ.402 కోట్లు మంజూరు చేసినా ఒక్కచోటా పనులు చేపట్టలేదు.


కొత్తగా విద్యార్థులు.. గదులెక్కడ?

కృష్ణా జిల్లా బాపులపాడు జడ్పీ హైస్కూలులో గత ఏడాదే సైకిల్‌ షెడ్‌, వరండాలో విద్యా బోధన జరిగింది. ఈ ఏడాది పాఠశాలల విలీనంతో అదనంగా విద్యార్థులు రానున్నారు. కొత్త భవనానికి నిధులు వచ్చినా పనులు చేపట్టలేదు.


చినుకుపడితే.. బడిలోనే!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం మెట్టపాలెంలో ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఒకటి కూలిపోయేలా ఉండడంతో వినియోగించడం లేదు. మరో భవనం కూడా శ్లాబు పెచ్చులూడిపోయింది. చినుకుపడితే భవనం మొత్తం కారిపోతుంది. 


ఇదీ.. బడే!

ఈ ఫొటోలో కనిపిస్తున్నది కంటైనర్‌ అనుకుంటే పొరపాటే. కడప జిల్లా మైలవరం మండలంలోని దుగ్గనపల్లె పాఠశాల. తొలివిడత నాడు-నేడు నిధులు చాల్లేదు. రెండో విడతలో రాలేదు.  దీంతో పాఠశాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. 


కమ్యూనిటీహాలే దిక్కు!

పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని మండలం బొడ్డగూడ గ్రామంలో గిరిజనుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌లో ఒకపక్క పాఠశాల, మరోపక్క సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-07-04T08:30:51+05:30 IST