‘ఎల్దమొస్తవా’ అంటూ ఒక్కరే వెళ్లిపోతారా...

ABN , First Publish Date - 2020-08-10T11:08:10+05:30 IST

పార్వతీపురం రైల్వేస్టేషన్‌. రాత్రి 10 గంట లైంది. అరగంట ముందు విశాఖపట్నం నుంచి హోరా ఎక్స్‌ప్రెస్‌ కొందరు ప్రయా ణీకుల్ని దించేసి కూతేసుకుంటూ వెళ్లిపోయింది. స్టేషన్‌ చివర ఉన్న...

‘ఎల్దమొస్తవా’ అంటూ ఒక్కరే వెళ్లిపోతారా...

జానపదం వంగపండు పేరైతే.... జనపథం వంగపండు నడిచిన మార్గం. కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన వంగపండు విప్లవాన్ని కాంక్షించారు. జీవితమంతా రోడ్డు మీదే గడిపిన ఏకైక వాగ్గేయకారుడు వంగపండు. బహుశా అన్నమయ్య తర్వాత అన్ని కష్టాలు పడిన వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదే అనిపిస్తుంది నాకు. 


పార్వతీపురం రైల్వేస్టేషన్‌. రాత్రి 10 గంట లైంది. అరగంట ముందు విశాఖపట్నం నుంచి హోరా ఎక్స్‌ప్రెస్‌ కొందరు ప్రయా ణీకుల్ని దించేసి కూతేసుకుంటూ వెళ్లిపోయింది. స్టేషన్‌ చివర ఉన్న బెంచీ మీద తలకి పాగా చుట్టుకుని పక్కనే ఓ చేసంచి పెట్టుకుని కాళ్లు ముడుచుకుని మధ్య వయసు వ్యక్తి కూర్చున్నారు. స్టేషన్‌కి కూత వేటు దూరంలో నేను, గోపీ రూమ్‌లో ఉండి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చదువుకునే వాళ్లం. రాత్రిళ్లు స్టేషన్‌లో ఆ మూల నుంచి ఈ మూల వరకూ నడుస్తూ శ్రీశ్రీ కవిత్వం, రాచకొండ కథలు, చలం అమీనా నుంచి జన నాట్యమండలి పాటల వరకూ ఆ కొద్దిపాటి పాదయాత్రలో దొర్లేవి. అదిగో అలాంటి సమయంలో ఓ రాత్రి పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో బెంచీ మీద కూర్చున్న వ్యక్తిని చూశాం. దగ్గరికి వెళ్లి పరికించి చూస్తే ఆయనే వంగపండు ప్రసాద్‌. ఏం పిల్లడో కవి.... నియమ్మ సచ్చినా దమ్మిడొగ్గనూ పాటగాడు. ‘మీరు వంగపండు ప్రసాద్‌ కదా’ ఓ ఆనంద ఉద్వేగంతో అడిగాను. 


‘అవును. మీలెవలు. విక్కడున్నారేటి’

ఇక్కడే చదువుకుంటున్నామని, దగ్గరలోనే మా రూం అని చెప్పాం. ‘మీరిక్కడున్నారేటి’ అని అడిగాం.

‘మా ఊరు పెదబొండపల్లి ఎల్లాలని ఇసాపట్నంలో రైలెక్కా. అదే ఆలస్యమైపోయింది. మాయూరికి బస్సులుండవు. అందుకే ఇక్కడ కూకుండిపోయా’ అన్నారు వంగపండు.

‘దగ్గర్లోనే మా రూం. రండి. పొద్దున్నే వెళ్లిపోదురు గాని’ అంటూ వంగపండుని మా రూంకి తీసుకు వెళ్లిపోయాం. 

నేను చాలా ఉత్సాహంగా... ఆవేశంగా...: ‘లెగు లెగు లెగు లెగవయ్యా... కోడి కూసెను మావయ్య/ పిట్టలన్ని ఆ మెట్టల మీదకు కూతలేసుకుని మేతకు పోయెను.../ ఆలమందలు అంబా అంటూ లేగదూడలకు పాలు కుడిపెను.../ ఏటి వొడ్డున ఏతం బట్టి తోటకు నీరు తోడుతున్నది../ మతి పోయిందా మావయ్య... మొద్దు నిద్దరిక మానవ య్యా’’- అంటూ ఎన్నోసార్లు పాడు కున్న భూబాగోతం రచయిత, గాయ కుడు వంగపండు నా రూంలో. ఇది జరిగి మూడు దశాబ్దాలైంది. అదిగో అప్పటి నుంచి వారం రోజులు క్రితం వరకూ వీలున్నప్పుడు కలవడం, లేదూ ఫొన్‌లో మాట్లాడుకోవడం. 


జానపదం వంగపండు పేరైతే, జనపథం వంగ పండు నడిచిన మార్గం. కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన వంగపండు విప్లవాన్ని కాంక్షించారు. జీవితమంతా రోడ్డుమీదే గడిపిన ఏకైక వాగ్గేయ కారుడు వంగపండు. బహుశా అన్నమయ్య తర్వాత అన్ని కష్టాలు పడిన వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదే అనిపిస్తుంది నాకు. ‘ఆకు సిక్కితే సిక్కని రక్తం కారుద్దండో నాయనా...’ అంటూ శ్రీకాకుళ పోరాటాన్ని కళ్లకు కట్టిన విప్లవకారుడు వంగపండు. శ్రీకాకుళ పోరాటంలో అమరుడైన సుబ్బారావు పాణి గ్రాహికి అక్షరాల వారసుడు వంగపండు.


శ్రీకాకుళ పోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో పలాసలో ఎవరినో కలవడానికి వెళ్లిన సుబ్బారావు పాణిగ్రాహి... అక్కడ కళాశాలలో ఎక్కువ వసూలు చేస్తున్న ఫీజులకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమంలో తాను ఓ గొంతయ్యాడు. ‘మనది కాని, మనకు సంబంధం లేని ఉద్యమంలోకి మీరు ఎలా వెళ్తారు. మిమ్మల్ని ఎవరైనా గుర్తించి పట్టుకుంటే’ అని ఆనాటి నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తే ‘మనది కాని ఉద్యమం ఏమిటీ. ప్రజలు చేసే ఏ ఉద్యమమైనా మనదే’ అని సమాధానం చెప్పిన పాణిగ్రాహి నాకు అడుగడుగునా వంగపండులో కనిపిస్తాడు. శరీరమంతా గాయాలమయం చేసుకున్న వంగపండు జీవితాంతం ఆ గాయాలతో పోరాడుతూనే ఉన్నారు. శ్రీశ్రీ అధ్యక్షుడిగా ఉన్న బహిరంగ సభలో ‘ఇప్పుడు ప్రజాకవి వంగపండు పాటలు పాడతారు’ అని ప్రకటిస్తే చిన్నపిల్లాడిలా మురిసిపోయారు. 


జానపదాన్ని, మధ్యతరగతి కవిత్వాన్ని తనలో ఇముడ్చుకుని ‘‘చుట్టమొచ్చాడు నీ ఇంటికి.../ సుట్ట ముక్కై తగులుతాడు నీ వొంటికి’’ అని రాసి జాన పదంలో మధ్యతరగతిని మేళవించిన కవి, గాయకుడు వంగపండే. మాటలోనూ, పాటలోనూ, స్నేహంలోనూ తన మూలాలలను మరిచిపోని మనీషి. ‘కవులు అమాయకులు’ అనే మాటకి నిలువెత్తు రూపం. 


‘‘అడిగడిగో వత్తన్నాడు... అడిగడిగో వత్తనాడు/ ఆ బూములున్న బుగతోడు.. పోలీసుల తోడుతోని/ అడిగడిగో వత్తన్నాడు... బుగతోడు../ గుడ్డలేక మనో ల్లంత సలిలో సంపీసినోడు../ ఇత్తిరి తీసిన పంచి... పొట్టి కమీజేసుకోని/ సెమటంతా దోసుకోని... సెంటు నూని రాసుకోని/ అడిగడిగో వత్తన్నాడొత్తున్నాడు... బుగతోడు’’- ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ వంగపండు పాట కూలీలు పొలం పనులు చేసుకుంటూ  పాడు కునే పాటగా మారిపోయింది. చిత్రంగా ఉద్దారులు... అంటే పొలం యజమానుల ముందే ఈ పాట పాడుకుని నవ్వుకోవడం అక్కడ పరిపాటి. జీవించి నంత కాలం జెండాలా రెపరెపలాడిన వంగపండు ప్రసాద్‌ పాటలా పరిమళించారు. జానపదంలా జనం గుండెల్లో నిలిచిపోయారు. 

ముక్కామల చక్రధర్‌


Updated Date - 2020-08-10T11:08:10+05:30 IST