Abn logo
Sep 24 2021 @ 00:22AM

ఆ డబ్బులు ఇవ్వరా..?

  1. మూల్యాంకనం జరిగి నాలుగు నెలలు
  2. వేతనాలు చెల్లించని ఆర్‌యూ అధికారులు
  3. ఇబ్బంది పడుతున్న డిగ్రీ అధ్యాపకులు
  4. ఉన్నత విద్యామండలికి విద్యార్థి సంఘాల ఫిర్యాదు 


కర్నూలు(అర్బన్‌)/పాణ్యం, సెప్టెంబరు 23: ఆర్‌యూలో ఆఽధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డిగ్రీ కళాశాలల ఆధ్యాపకులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ పరిధిలో 3, 5వ సెమిస్టర్‌ పరీక్షలు జరిగి దాదాపు 4 నెలలు గడిచింది. ఫలితాలు కూడా ప్రకటించారు. కానీ మూల్యాంక వేతనాలను మాత్రం పరీక్షల విభాగం ఉన్నతాధికారులు ఇప్పటికీ చెల్లించలేదని ఆధ్యాపకులు మండి పడుతున్నారు. విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజుల పేరుతో ఏటా రూ.లక్షలు వసూలు చేస్తున్నారని, మూల్యాంకన నిధులను పక్కదారి పట్టిస్తున్నారా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతి సంవత్సరం డిగ్రీ, బీఎడ్‌ మూల్యాంకన వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం డీన్‌కు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్పందించ లేదు. యూనివర్సిటీ అధికారుల తీరును ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఉన్నత విద్యామండలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. యూనివర్సిటీ అధికారుల తీరుపై ఉన్నత విద్యామండలి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 


మూల్యాకనం సాగిందిలా..


మే నెలలో ఆర్‌యూలో బీఏ, బీకాం, బీఎస్సీ 3, 5వ సెమిస్టర్‌ పరీక్షల పత్రాల మూల్యాకనం జరిగింది. నంద్యాల, కర్నూలు, ఆదోని కేంద్రాలలో 2 వేల మందికి పైగా అధ్యాపకులు మూల్యాంకనంలో పాల్గొన్నారని వర్సిటీ అధికారులు అంటున్నారు. రోజూ రెండు సెషన్లు ఉండగా, స్థానిక అధ్యాపకులకు సెషన్‌కు రూ.610 ప్రకారం రెండు సెషన్లకు రూ.1,220 చెల్లించాలి. స్థానికేతర అధ్యాపకులకు సెషన్‌కు రూ.710 ప్రకారం రూ.1,420 చెల్లించాలి. యూనివర్సిటీ గ్రాంట్‌ కమిటీ వీటి కోసం ఇంత వరకు నిఽధులు విడుదల చేయలేదని అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో ఒకటో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 20వ తేదీకి 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి అయ్యాయి. 21వ తేదీ నుంచి కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. డిసెంబరులో రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే పూర్తయిన మూడు సెమిస్టర్‌ పరీక్షల మూల్యాంకన వేతనాలు చెల్లించకుండా పరీక్షల విభాగం అధికారులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరులో 4, 6 సెమిస్టర్‌ పరీక్షా పత్రాలు దిద్దడానికి అధ్యాపకులు విముఖత చూపుతున్నారు. నాలుగు నెలల క్రితం పూర్తి చేసిన స్పాట్‌ వ్యాల్యుయేషన్‌కు సంబంధించి చెల్లింపులకు అతీగతి లేదని, అందుకే ఇకపై స్పాట్‌ వ్యాల్యుయేషన్‌కు హాజరు కాలేమని అధ్యాపకులు అంటున్నారు. 


ఫీజులు వాడుకున్నారా ?


డిగ్రీ విద్యార్థులు ఏటా చెల్లించే పరీక్ష ఫీజులూ వాడుకున్నారా? స్పాట్‌ వ్యాల్యుయేషన్‌కు ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం లేదు. ఫీజుల నుంచే నిధులే ఇవ్వాలి. డిగ్రీ ప్రశ్నా పత్రాలు దిద్దిన అధ్యాపకులకు వేతనాలు మంజూరు చేయాలి. నాలుగు నెలలుగా చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఐదు సెమిస్టర్‌ పరీక్షలు జరిగినా ఇంత వరకు డబ్బులు ఇవ్వకపోవడం విచారకరం. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొని పరీక్ష పత్రాలు దిద్దిన అధ్యాపకుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. 


- మహబూబ్‌ బాషా, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ కార్యదర్శి


ఫిర్యాదు చేస్తాం..


ఉన్నతాధికారుల తీరుపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తాం. మూల్యాంకన వేతనాలు చెల్లించక పోవడంతో ఆధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో విధులకు హాజరయిన వారిపట్ల ఇంత నిర్లక్ష్యం తగదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాం.            


  - రామకృష్ణ, యూనివర్సిటీ కార్యదర్శి



త్వరలో ఇస్తాం..


డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల మూల్యాంకనం పూర్తి చేసిన అధ్యాపకులకువేతనాలు త్వరలో అందిస్తాం. యూనివర్సిటీ ఉన్నతాధికారులతో అనుమతి తీసుకున్నాం. 


- వెంకటేశ్వర్లు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, ఆర్‌యూ