పరిహారం ఇస్తారా.. గోదాట్లో కలిపేస్తారా?

ABN , First Publish Date - 2022-08-11T08:44:44+05:30 IST

పరిహారం ఇస్తారా.. గోదాట్లో కలిపేస్తారా?

పరిహారం ఇస్తారా.. గోదాట్లో కలిపేస్తారా?

ముంపుతో ఏటా బాధలు పడలేం.. సీఎం చేతులెత్తేశారు.. మీరైనా ఆదుకోండి

వరదలతో వ్యవసాయ పనులూ ఆలస్యం.. పంట దిగుబడులు లేక నష్టపోతున్నాం

కేంద్ర బృందం ఎదుట బాధితుల గోడు.. ఏలూరు, అల్లూరి జిల్లాల్లో పర్యటన

విశాఖలో రాష్ట్రస్థాయి అధికారులతో భేటీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

‘నష్ట పరిహారమైనా ఇవ్వండి. లేకుంటే గోదారి వరదల్లో మమ్మల్నీ తోసేయండి. ఈ కష్టాలు మాత్రం పడలేం’ అని పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులు కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం శబరికొత్తగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘వరదతో ఏటా ఇబ్బందులు పడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎగువ నీటితో మా బాధలు మరింత ఎక్కువయ్యాయి. భద్రాచలంలో నీటి మట్టం 50 అడుగులకు చేరితే మా గ్రామాలు మునిగిపోతున్నాయి. జూన్‌, జూలైలో మొదలు పెట్టాల్సిన వ్యవసాయ పనులను సెప్టెంబరు, అక్టోబరులో ప్రారంభించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతోంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ విలీన మండలాల్లో పర్యటించారు. పోలవరం నష్ట పరిహారం విషయంలో చేతులెత్తేశారు. కేంద్రం జోక్యం చేసుకుని తక్షణమే ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెల్లించాలి’ అని గిరిజనులు కోరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం వచ్చిన కేంద్రం బృందం తొలుత విశాఖపట్టణంలో అధికారులతో సమావేశమయ్యింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు (ఎన్‌డీఎంఎ) రవినేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఈ బృందానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ వరద తీవ్రత, నష్టం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు వరద కారణంగా తమ శాఖలకు వాటిల్లిన నష్టాన్ని వివరించారు. అనంతరం ఈ బృందం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో బృందం పర్యటించింది. అక్కడి నుంచి బోటులో వేలేరుపాడు చేరుకుంది. పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన నెక్లెస్‌ బండ్‌ను, బండ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించింది. సీడబ్ల్యుసీ కార్యాలయ ఆవరణలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఈ బృందానికి జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వివరించారు. కూనవరం మండలం శబరికొత్తగూడెం, కోండ్రాజుపేట గ్రామాల్లో మరో బృందం పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకుంది. వరదల నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని  కేంద్ర బృందం ప్రతినిధి రవినేశ్‌కుమార్‌ చెప్పారు. విలీన మండలాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీఆర్‌పురం మండలంలో జరగాల్సిన పర్యటన రద్దయ్యింది. చింతూరు మండలంలోని కుయిగూరు ప్రాంతంలోనూ కేంద్ర బృందం పర్యటించింది.


ఆ మూడు గ్రామాలను 41లో చేరుస్తాం: కలెక్టర్‌

కూనవరం మండలంలోని కూనవరం, శబరికొత్తగూడెం, కోండ్రాజుపేట గ్రామాలను 41వ కాంటూరులో చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. వరదల కారణంగా ఇళ్లు కూలిపోయిన వారందరికీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రేషన్‌ కార్డులు లేని వారికి కూడా సర్వే చేయించి ఇంటి నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు.



గంట గంటకూ మారిన షెడ్యూల్‌

బాధిత ప్రాంతాలకు దూరంగా పర్యటన

ముంపు గ్రామాల ప్రజల ఆగ్రహం

ఏలూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటనపై కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ ఆధ్వర్యంలో రోడ్‌ మ్యాప్‌ తయారుచేశారు. దీని ప్రకారం కేంద్ర బృందం సాయంత్రం నాలుగు గంటలకు వేలేరుపాడు చేరుకుని కటుకూరు, కొయిదా గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ గ్రామాలను వరద చుట్టుముట్టడంతో షెడ్యూల్‌లో మార్పు చేశారు. వేలేరుపాడు సంత మార్కెట్‌, తాట్కూరుగొమ్ము కాలనీల్లో పర్యటించేలా మార్పులు చేశారు. బాధితుల నుంచి నిరసనలు ఎదురవుతాయన్న సందేహంతో మళ్లీ షెడ్యూల్‌ను మార్చేశారు. కేంద్ర బృందం  రేపాకగొమ్ము చేరుకునే సరికి చీకటిపడటంతో పర్యటనకు వీలుపడలేదు. ఆ తర్వాత తాట్కూరు గొమ్ము చేరుకున్నా బాధితులు ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు కేంద్ర బృందం వస్తుందని వేలేరుపాడు సంతమార్కెట్‌, తాట్కూరుగొమ్ము ఎస్సీ కాలనీలకు పెద్ద ఎత్తున చేరుకున్న బాఽధితులు.. బృందం రాకపోవడంతో తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-11T08:44:44+05:30 IST