పనిచేస్తారా.. వెళ్లిపోతారా..!

ABN , First Publish Date - 2021-08-04T05:03:50+05:30 IST

పనిచేస్తారా..? లేక వెళ్లిపోతారా...? టీ తాగి వెళ్లిపోతామంటే ఊరుకోను. ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించాలి. కబుర్లు చెబితే ఒప్పుకోను అంటూ హౌసింగ్‌ జేసీ ధ్యానచంద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనిచేస్తారా.. వెళ్లిపోతారా..!
అధికారులు, సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ ధ్యానచంద్ర

ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై అధికారులపై జేసీ ఆగ్రహం


ఎర్రగుంట్ల, ఆగస్టు 3: పనిచేస్తారా..? లేక వెళ్లిపోతారా...? టీ తాగి వెళ్లిపోతామంటే ఊరుకోను. ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించాలి. కబుర్లు చెబితే ఒప్పుకోను అంటూ హౌసింగ్‌ జేసీ ధ్యానచంద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎర్రగుంట్లలోని జగనన్న కాలనీలో నగర పంచాయతీ చైర్మన్‌ హర్షవర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి పర్యటించారు. అక్కడ ఇళ్ల నిర్మాణం పురోగతిని చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లింకు రోడ్లు సరిగా లేకపోవడం, ఇంటర్నల్‌ రోడ్లు వేయకపోవడం వల్ల మెటీరియల్‌ సరఫరాకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, దీనివల్ల ఇళ్ల నిర్మాణం మందగించిందని హౌసింగ్‌ అధికారులు సమాధానం చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని మందలించారు. రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఇంటర్నల్‌ రోడ్లు వెంటనే పూర్తి చేయాలని కమిషనర్‌ పి.జగన్నాథ్‌ను ఆదేశించారు. ఇక్కడ వేసిన ఏడు బోర్ల నుంచి నీటి సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.  హౌసింగ్‌కు సంబంధించి స్టీల్‌, సిమెంట్‌ అధిక రేట్లకు అమ్మితే వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎ.నాగేశ్వరరావును జేసీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారులు శివారెడ్డి, శ్రీనివాసులు జేసీతో మాట్లాడుతూ నల్లరేగడి నేల కావడంతో పునాదులు 10 అడుగుల లోతు తవ్వాల్సి ఉందని, దీంతో ఎక్కువ ఖర్చు వస్తోందని తెలిపారు. ఇసుక డంపింగ్‌ కల్లూరులో ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి రవాణా చార్జీలు రూ.2500 వరకు అవుతున్నాయని ఇవన్నీ అదనపు ఖర్చు వస్తోందని చెప్పారు. ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణం చేపడితే డంపింగ్‌ యార్డు ఇక్కడే ఏర్పాటుకు కృషి చేస్తామని జేసీ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.శివారెడ్డి, హౌసింగ్‌ డీఈ గోరంట్ల, ఏఈ క్రిష్ణయ్య, టీపీవో శిరీష, కౌన్సిలర్‌ ఆలీ, కో-ఆప్షన్‌ సభ్యుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T05:03:50+05:30 IST