ట్రంప్ మళ్లీ వ్యాపారం చేస్తారా ?

ABN , First Publish Date - 2020-11-18T00:19:42+05:30 IST

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం జనవరి 20 తో ముగియనుంది. ఆ తర్వాత తనకిష్టం ఉన్నా, లేకపోయినా పాలనా పగ్గాలను తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడన్‌కు అందించాల్సిందే.

ట్రంప్ మళ్లీ వ్యాపారం చేస్తారా ?

వాషింగ్టన్ : అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం జనవరి 20 తో ముగియనుంది. ఆ తర్వాత తనకిష్టం ఉన్నా, లేకపోయినా పాలనా పగ్గాలను తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడన్‌కు అందించాల్సిందే.


అమెరికా 39 వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పదవి నుంచి దిగిపోయాక స్వచ్ఛంద కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇక 43వ అధ్యక్షుడు జార్జ్ బుష్ తన వ్యాపకమైన చిత్రలేఖనంలో కొనసాగుతున్నారు. కాగా... ట్రంప్ సాంప్రదాయ రాజకీయనేత కాదన్న విషయం తెలిసిందే. 


అధ్యక్షునిగా ఉన్న సమయంలో ట్రంప్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నో పనులు చేశారని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ కాల్కిన్స్ పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత మునుపటి అధ్యక్షుల్లా ఆయన ప్రవర్తిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు.


అధ్యక్ష ఎన్నికల ఫలితాల మీద డోనాల్డ్ ట్రంప్ వేస్తున్న కేసులేమిటి ?

ట్రంప్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిందని భావించలేమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆయన మరోసారి అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయొచ్చని రిపబ్లికన్ వర్గాలే చెబుతున్నాయి. 


అమెరికాలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన నేత, నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆ పదవిని అధిష్ఠించడం ఒకేసారి జరిగింది. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ ఈ ఘనత సాధించారు. ఒకసారి 1885 లో, రెండవసారి 1893 ఎన్నికల్లో ఆయన అధ్యక్షునిగా విజయం సాధించారు. 


ట్రంప్ కూడా ఈ ఫీట్ సాధించాలని కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అంటే... 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీపడే అవకాశాలున్నాయని తాను భావిస్తున్నట్లుగా మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ మల్వనీ ఇటీవలే పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచార సభలంటే ట్రంప్‌కు ఇష్టమన్న విషయం తెలిసిందే. 


ఇదిలా ఉంటే... తాజా ఎన్నికల్లో ట్రంప్‌కు వచ్చిన ఓట్లు రికార్డుగా నిలిచాయి. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ఇదే రికార్డు. అమెరికన్ ఓటర్లలో ఆయనకు ఇంకా చాలా మద్దతు ఉందన్నదానికి ఇది నిదర్శనం.


కాగా... ట్రంప్ పెద్ద కొడుకు డోనల్డ్ ట్రంప్ జూనియర్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం విశేషం. 

Updated Date - 2020-11-18T00:19:42+05:30 IST