ఇదే నా చివరి పాట అవుతుందేమో..?

దిగ్గజ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆయన జ్ఞాపకాలెప్పటికీ పదిలంగా ఉంటాయి. ఆయన పాట ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ‘సిరివెన్నెల’తో ఆయన ప్రస్థానం మొదలైంది. ఈ ప్రయాణంలో దాదాపు 3 వేల పాటలు రాశారు. మరి ఆయన చివరి గీతమేది? నాని కథానాయకుడిగా నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో సిరివెన్నెల తన చివరి పాట రాశారు. ఈ విషయాన్ని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటని మంగళవారం విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ మాట్లాడుతూ ‘‘నవంబరు 3న సీతారామశాస్ర్తి గారు ఫోన్‌ చేశారు. ‘ఆరోగ్యం బాగాలేదు. పాట పూర్తి  చేయలేకపోతున్నా’ అన్నారు. కానీ మేం మాత్రం ‘ఈ పాట మీరే రాయాలి సార్‌’ అని అభ్యర్థించాం. మరుసటిరోజు ఉదయాన్నే ఆయనే ఫోన్‌ చేశారు. ‘పల్లవి చెబుతా.. రాసుకోండి’ అన్నారు. ‘మహాభారతం పుస్తకంపై ఆరు లైన్లు రాశాను. అందులోని ఓ వాక్యంలో సిరివెన్నెల అని ఉంది. బహుశా ఇదే నా చివరి పాట అవుతుందేమో’ అని ఆయన నవ్వుతూ అన్నారు. విధి రాత.. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటని రికార్డ్‌ చేశాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని సిరివెన్నెల అనే పాటంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో సీతారామశాస్ర్తి మరో గీతాన్ని కూడా రాశారు. ఆ పాటనీ త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాని సీతారామశాస్ర్తి గారికి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. 


Advertisement