మళ్లీ వాళ్లకేనా..!?

ABN , First Publish Date - 2022-04-09T06:18:31+05:30 IST

సీఎం జగన కొత్త మంత్రివర్గంలో స్థానం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మళ్లీ వాళ్లకేనా..!?

  1.  బుగ్గన, గుమ్మనూరును కొనసాగిస్తారని ప్రచారం
  2.   కొత్త వాళ్లకు చాన్స లేనట్లేనా..?
  3.   నంద్యాల జిల్లా నుంచి శిల్పా, కాటసాని ప్రయత్నాలు
  4.  కర్నూలు జిల్లా నుంచి సాయి, హఫీజ్‌ఖాన ఆశలు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): సీఎం జగన కొత్త మంత్రివర్గంలో స్థానం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రుల్లో నాలుగురైదుగురు  కొనసాగే అకాశం ఉందని చివరి క్యాబినెట్‌ సమావేశంలో సీఎం జగన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిలో కార్మిక శాఖ మంత్రి గుమ్మగనూరు జయరాం కొనసాగుతారని వైసీపీలో చర్చ కొనసాగుతోంది. తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పాత మంత్రుల్లో 12 మందికిపైగా కొత్త మంత్రివర్గంలో కొనసాగిస్తున్నట్లు సమాచారం. సీఎం జగనకు అత్యంత సన్నీహితుడైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. అంటే.. కొత్త మంత్రివర్గంల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు బుగ్గన, గుమ్మనూరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

 ఒకరిది సన్నిహితం.. మరొకరిది సామాజిక వర్గం:

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సీఎం జగనకు అత్యంత సన్నిహితుడు. అందుకే తొలి విడతలోనే ఆర్థిక శాఖ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాలలో కూరుకుపోయినా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తినా తన నైపుణ్యతతో ఆర్థిక శాఖను గట్టెక్కించి నవరత్నాలు అమలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బుగ్గన చూశారని ప్రభుత్వంలో పేరు ఉంది. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అప్పులైనా.. గ్రాంటు అయినా తీసుకురావడంతో మంచి దిట్ట అనే ప్రచారం కూడా ఉంది. దీంతో మళ్లీ బుగ్గనను కొనసాగించేందుకు సీఎం జగన సుముఖతతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. బుగ్గన మాత్రం ఆర్థిక శాఖ కాకుండా తనకు ఇష్టమైనా జలవనరుల శాఖను ఆశిస్తున్నట్లు సమాచారం. అలాగే.. గుమ్మనూరు జయరాంకు సామాజికవర్గం కలిసి వస్తోంది. రాయలసీమ జిల్లాలో బలమైనా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరు. ఆ కార్డుతోనే తొలివిడతలో చివరి క్షణాల్లో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. తాజాగా పునర్వ్యస్థీకరణలో కూడా అదే సామాజికవర్గం గుమ్మనూరుకు వరంగా మారింది.

కొత్త వాళ్లకు చాన్స ఉంటుందా..?:

పాత మంత్రులు బుగ్గన, గుమ్మగనూరులకు మరోసారి అవకాశం ఇస్తే కొత్తవాళ్లకు కొత్త మంత్రి వర్గంలో చాన్స ఉంటుందా.. ఉండదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిలు తమలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తొలివిడతలోనే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి మంత్రి ఖాయమన్న ప్రచారం జరిగింది. చివరి క్షణంలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. తాజా విస్తరణలో అకాశం ఉంటుందని ఆశిస్తే గుమ్మనూరునే కొనసాగిస్తారనే ప్రచారం సాయి వర్గీయులకు మింగుడుపడడం లేదు. ఎలాగైనా క్యాబినెట్‌లో చేరాలనే లక్ష్యంగా సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు విశాఖ శారద పీఠం పీఠాధిపతి ద్వారా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

హఫీజ్‌ఖానకు అవకాశం వచ్చేనా?

ముస్లిం మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి కర్నూలు, మదనపల్లె, గుంటూరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో హఫీజ్‌ఖాన పట్ల సీఎం జగన సుముఖతో ఉన్నారని, ఆయనకు ఐటీ శాఖ లేదా డిప్యూటీ స్పీకర్‌ పదవుల్లో ఒకటి ఖాయమని అంటున్నారు. మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ ఎప్పుడు జరిగినా నంద్యాల జిల్లా నుంచి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి బెర్త్‌ ఖాయమని జిల్లాలో ముందునుంచి జోరుగా ప్రచారం ఉంది. శుక్రవారం జరిగిన నంద్యాల సభలో సీఎం జగన మంత్రి పదవిపై ఓ క్లారిటీ ఇస్తారని ఆయన వర్గీయులు ఆశించినా జగన ఆ ప్రస్థావనే తేలేదు. దీంతో ఆయన వర్గీయులు నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం. ఏదీఏమైనా మంత్రి పదవి ఖాయమనే ధీమాతో శిల్పా కూడా ఉన్నారు. అదే క్రమంలో ఆరు పర్యాయాలు శాసన సభకు ఎన్నికైనా ఏకైక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. సీనియార్టి కోటాలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట నుంచి శిల్పా, కాటసాని పేర్లు పరిశీలినలో ఉన్నా.. తాజా సమీకరణాల నేపథ్యంలో నంద్యాల జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గననే కొనసాగిస్తే కొత్త వాళ్లకు అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ నడుస్తోంది.

 


Updated Date - 2022-04-09T06:18:31+05:30 IST