‘గడప’లో నిలదీస్తే కొడతారా?

ABN , First Publish Date - 2022-08-06T09:19:10+05:30 IST

‘గడప’లో నిలదీస్తే కొడతారా?

‘గడప’లో నిలదీస్తే కొడతారా?

పోలీసులతో కేసులు పెట్టిస్తారా? 

చిత్తూరు జిల్లాలో టీడీపీ నిరసన 

రెండు కేసుల్లో పలువురి అరెస్టు

రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించిన జడ్జి


పూతలపట్టు, ఆగస్టు 5: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిలదీసిన యువకుడిని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎ్‌సబాబు అనుచరులు కొట్టడంపై శుక్రవారం టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, నేతలు, కార్యకర్తలు అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. అక్రమ కేసుల్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. సమస్యలపై నిలదీస్తే కొట్టడం, బాధితులపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. జనసేన నాయకులు అక్కడికి చేరుకుని వీరికి మద్దతు పలికారు. ఇరు పార్టీలు కలవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదైన బాధితుల కుటుంబీకులు, పూతలపట్టు మండలం వేపనపల్లిలోని మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి తమ గోడును విన్నవించుకున్నారు. వీరికి టీడీపీ నేతలు ధైర్యం చెప్పారు. కాగా, తనను కులం పేరుతో దూషించి కొట్టారని వైసీపీకి చెందిన సర్పంచి ఎంఎస్‌ మణి.. తాను కారులో వెళుతుండగా టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి.... గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని చిత్తూరులోని మూడో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌ వద్ద శుక్రవారం హాజరుపరిచారు.  వారి రిమాండు రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుల ఆధార్‌కార్డు నెంబర్లు జత చేయలేదని గుర్తించారు. అరెస్టు చేసే సమయంలో కుటుంబీలకు చెప్పారా అని పోలీసులను అడిగారు. తమ కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని వారు చెప్పడంతో రిమాండు రిపోర్టును తిరస్కరించారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోను చేసి నేతలతో మాట్లాడారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Updated Date - 2022-08-06T09:19:10+05:30 IST