ఖాళీలు భర్తీ అయ్యేనా?!

ABN , First Publish Date - 2022-04-17T06:59:35+05:30 IST

జిల్లాలో ఉన్న ఏకైక తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ నిర్ణయంతో కష్టాలు తీరనున్నాయి. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి ఖాళీ పోస్టులను భర్తీలని చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పీజీలు, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోర్డును త్వరలో ఏర్పాటు చేసి

ఖాళీలు భర్తీ అయ్యేనా?!
తెలంగాణ యూనివర్సిటీ

యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు 

టీయూలో భర్తీ కానున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు 

ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ఖాళీగా 74 టీచింగ్‌ పోస్టులు 

118 నాన్‌టీచింగ్‌ పోస్టులకు అనుమతి ఉండగా.. 9 మాత్రమే భర్తీ 

నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్న ప్రభుత్వ ప్రకటన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఉన్న ఏకైక తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ నిర్ణయంతో కష్టాలు తీరనున్నాయి. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి ఖాళీ పోస్టులను భర్తీలని చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పీజీలు, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోర్డును త్వరలో ఏర్పాటు చేసి నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనుండడంతో ఎక్కువ మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అన్ని యూనివర్సిటీలకు కలిపి రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నందున.. వారివారి సబ్జెక్టులో ప్రిపేర్‌ అయినవారికి వచ్చే అవకాశం ఉండడంతో పార్ట్‌టైం చేసేవారు కూడా ఈ పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఫ పూర్తిస్థాయిలో భర్తీ కాని ఖాళీలు

2006లో తెలంగాణ విశ్వవిద్యాలన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయం పెట్టిన సమయంలో కొన్ని పోస్టులను భర్తీ చేసినా.. మిగతా పోస్టులను వివిధ కారణాలతో నిలిపివేశారు. మళ్లీ ఈ పోస్టులకు 2017లో నోటిఫికేషన్‌ ఇచ్చినా.. వివిధ కారణాలతో నిలిపివేశారు. టీచింగ్‌తో పాటు నాన్‌టీచింగ్‌ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల కాంట్రాక్ట్‌, పార్ట్‌టైం అకాడమిక్‌ కన్సల్‌టెంట్‌ల నియామకంతోనే టీచింగ్‌ కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయం, పీజీ కేంద్రాల పరిధిలో మొత్తం 23 కోర్సులను నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతున్నా.. ప్రభుత్వం వివిధ కారణాలతో భర్తీ చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు నియామకాలు జరగలేదు. 

ఫ 144 టీచింగ్‌ పోస్టులకు అనుమతులు

ఈ విశ్వవిద్యాలయం ప్రారంభం సమయంలో 144 టీచింగ్‌ పోస్టులకు అనుమతులు ఇచ్చారు. వీటిలో ప్రొఫెసర్‌లు 19, అసొసియేట్‌ ప్రొఫెసర్‌లు 40, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు 85 మందిని భర్తీ చేయాలని కోరారు. ఈ ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో ఐదుగురు ప్రొఫెసర్‌లు, 13 మంది అసొసియేట్‌ ప్రొఫెసర్‌లు, 52 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లను నియమించారు. మొత్తం 70 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్‌లు 14, అసొసియేట్‌ ప్రొఫెసర్‌లు 25, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు 33 ఉన్నాయి. ఈ పోస్టులన్నీ ప్రస్తుతం యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ కానున్నాయి. వీటితో పాటు ఐదేళ్ల పీజీ కోర్సుకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఇవేకాకుండా విశ్వవిద్యాలయం పరిధిలో నాన్‌టీచింగ్‌ పోస్టులు అత్యధికంగా ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయంలో 118 మంది నాన్‌టీచింగ్‌ పోస్టులకు అనుమతి ఇచ్చారు. వీటిలో తొమ్మిది పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియామకాలు చేసి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పాలనకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ప్రభుత్వం యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేసి రిక్రూట్‌మెంట్‌ మొదలుపెడితే.. టీచింగ్‌తో పాటు నాన్‌టీచింగ్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయిలో అధ్యాపకులు, టీచింగ్‌ స్టాఫ్‌ రానున్నారు. యూనివర్సిటీ బోర్డు ఏర్పాటైనా ఆరు నెలలోపే అన్ని పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌గుప్తా తెలిపారు. రెగ్యులర్‌ పోస్టులన్నీ భర్తీ అయితే అవసరాల మేరకు ఔట్‌సోర్సింగ్‌, అకాడమిక్‌ కన్సల్‌టెంట్‌లను తీసుకుని మరింత మెరుగ్గా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే అవకాశం ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే పరిశోధనలో కూడా అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల త్వరలోనే నోటిఫికేషన్‌ వచ్చేఅవకాశం ఉందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-04-17T06:59:35+05:30 IST