రోడ్లు మళ్లీ నదులవుతాయా?!

ABN , First Publish Date - 2020-12-28T10:30:45+05:30 IST

నదులన్నీ రోడ్లవుతున్నయి జీసస్‌కు నడవడానికి దారి ఇచ్చిందో లేదో గానీ సముద్రం బహుళ జాతుల పారిశ్రామిక సముదాయాలకు మార్గమైంది...

రోడ్లు మళ్లీ నదులవుతాయా?!

నదులన్నీ రోడ్లవుతున్నయి జీసస్‌కు నడవడానికి దారి ఇచ్చిందో లేదో గానీ సముద్రం బహుళ జాతుల పారిశ్రామిక సముదాయాలకు మార్గమైంది. గహనాటవులూ గగనమూ వాహనాల గమనాలయినయి, కార్పొరేట్ల గమ్యాలైనవి. నదీతీరాల్లో వికసించిన నాగరికత ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో కుప్పకూలింది.


సముద్రంలో కలిసే దగ్గర డెల్టాలో కాదు నదులు చీలేది, ఉక్కుముక్కు డేగకు విషకోరల వేయిపడగలకు ఏర్పడిన పేగుబంధానికి ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని బైపాస్‌ రోడ్ల దగ్గర. వాగొడ్డు ఊళ్లిపుడు రోడ్ల నదిలో మునిగిపోయాయి. ఆదివాసి గూడాలన్నీ ఆనకట్టల్లో మునిగిపోయాయి. నర్మద అయితేమి, పోలవరం అయితేమి, నదులు ముంచే చోట నదులను ముంచే డ్యాంలు వచ్చినవి.


టాంకుబండు వెనుక ఉన్న తటాకం సముద్రం అనుకునేవాళ్లం. ఇపుడు హుసేన్‌సాగర్‌ సచివాలయం నెక్లెస్‌ అయింది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు షార్ట్‌కట్‌ రోడ్‌ చతికిలబడింది. 


కాళేశ్వరం నుంచి సిరొంచకు ఎండాకాలంలో ప్రాణహిత మెరిసే ఇసుకదారిపై ప్రయాణం. గోదావరి ఎన్ని రోడ్ల కింద ఎన్ని రిజర్వాయర్ల కింద అణగిపోయిన ప్రవాహ గర్భస్రావమో ఇపుడు. నది తన మీంచి పరిగెత్తే రైలు అవుతుంది. రైలు తలమీంచి సర్రున జారే రోడ్డవుతుంది. కోల్పోయిన గోదావరిలో పైసలేయడానికి పిల్లల్ని కిటికీల దగ్గర లేపి ఏం చూపాలి?


శ్రీశైల మల్లికార్జునుడు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు విద్యుత్కాంతులకు వెలవెల పోయాడు. నాగార్జునసాగరం వచ్చి బౌద్ధాన్ని నందికొండ ఎక్కించింది. మతం లేని ఆదివాసులు, బుద్ధుణ్ని నమ్ముకున్న దళితులు వలస గోసలో.


బెంగళూరు హైదరాబాద్‌ నగరాల సౌందర్య నిర్మాణం చేసాడంటున్న విశ్వేశ్వరయ్య రాజ్‌ మార్గాల పజిల్లో మోక్షం సుడిగుండంలో చిక్కుకున్నట్లు దారి దొరకక స్థాణువయ్యాడు. నదులూ సముద్రాలూ దాహంగొన్న రోడ్లయి ఊళ్ల మీద పడి, పట్టణాలలో చొరబడి నరమాంసం మరిగిన పులులయి గాండ్రిస్తున్నయి. అడ్డాకూలీలు, బతుకుదెరువులేని బడుగుజీవులు, స్త్రీలు, పసిపిల్లలు పులినోట్లో రోడ్డు వంటి జిహ్వ మంచి స్వాహా. 


రోడ్లను నదులుగా మళ్లీ మలుచుకునే, ప్రజలు నిర్మించుకునే చరిత్ర కోసం కదలికలు రోడ్ల దాడి నుంచి భూమి విముక్తి కోసం అడవులనుంచి చెట్లు కదలివచ్చే పదఘట్టనలు రాజ్యానికి అంతర్గత పెనుప్రమాదమైన రుతువులో పంచప్రాణాల వంటి నదుల దేశం నుంచి ఒక దార్శనికత, 


అన్ని ప్రాంతాల్లో మిగిలిన నీళ్లు, పంటలు, మనుషులు కొన్నాళ్లుగా రాజధానిని ముట్టడిస్తున్నాయి. నదుల వెనుక, పంటల వెనుక టుక్డే టుక్డే వాదాల కుట్ర ఉన్నదంటున్నది రాజ్యం. చైనా నుంచి పాకిస్తాన్‌ నుంచి కశ్మీరులో పొంచి ఉన్న రోడ్లు మన రోడ్ల మీద దురాక్రమణ చేస్తున్నాయంటున్నది. అంతే తప్ప ఆందోళనలో రైతులెవరూ లేరంటున్నది. ఖలిస్తానీయులు, మావోయిస్టులు మన రోడ్లను ధ్వంసం చేస్తున్నారంటున్నది. ప్రతిపక్షాలు కిసాన్‌లను రోడ్ల నుంచి తప్పుదారి పట్టిస్తున్నాయంటున్నది. కాకపోతే ఢిల్లీనుంచి అమృతసర్‌ మీదుగా వాఘా బార్డర్‌ దాకా హైవేలుండగా పొలాల గట్ల మీద, గోధుమ చేన్లలో, కాల్వల వెంబడి కాలిబాట అలవాటయిన రైతులు రాజధానికి నడిచి రావడం ఏమిటి? పాదాల నదులను పార్లమెంటు పునాదుల్లోకి మళ్లించడమేమిటి, ప్రజాస్వామ్యాన్ని సమూలంగా కూల్చే కుట్ర కాకపోతే అంటున్నది. ఎవరు చెప్పాలి తెలిసీ తెలియని మూర్ఖునికి--నదులు, పంటలు, రైతులు, రైతాంగం ఆహారం అంత నిజమని. అవసరమంత నిజమని. స్వాతంత్య్రమంత నిజమని. 

షహీన్‌

(ఈ సాహిత్య ప్రక్రియను బెన్‌ ఓక్రీ కవితా వ్యాసం-పొయెటిక్‌ ఎస్సే--అన్నాడు. ఆయన రాసిన ‘ఫామిష్డ్‌ రోడ్‌’ చదువుతూ....)

Updated Date - 2020-12-28T10:30:45+05:30 IST