Abn logo
Sep 22 2021 @ 00:25AM

పంజాబ్ ప్రయోగం ఫలించేనా?

పంజాబ్‌లో దాదాపు 35 శాతం మంది దళితులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడానికి స్వాతంత్ర్యం తర్వాత ఏడున్నర దశాబ్దాలు పట్టింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి చరణ్‌జీత్ సింగ్ చన్నీ అనే దళితుడిని నియమించింది. ‘నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. రిక్షా లాగుతూ బతికాను. కప్పులేని పూరి గుడిసెలో జీవించాను. మా అమ్మ మట్టి తడిపి గోడలకు అద్దేది ’అని ఆయన తనను కాంగ్రెస్ శాసనసభా పార్టీ నేతగా ఎన్నుకున్న తర్వాత అన్నారు. పంజాబ్‌లో ఇప్పటివరకు 26 మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ దళితుడు కాదు. 27వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ పంజాబ్ ఎన్నికలు జరిగేందుకు ఆరునెలలు ముందుగా అధికారం చేపట్టారు. ఈ ఆరునెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో, ఒక వేళ అధికారంలోకి వచ్చినా చన్నీకి మళ్లీ పగ్గాలు అప్పజెబుతారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీష్ రావత్ ఇప్పటికే, ఎన్నికలు పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నాయకత్వంలోనే జరుగుతాయని ప్రకటించి దళితుల ఆశలపై నీళ్లు చల్లారు. రాజకీయ అధికారానికి సంబంధించి భారతదేశంలో దళితుల పరిస్థితి నిరంతరం డోలాయమానంగానే ఉంటుందనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం.


చరణ్‌జీత్ సింగ్ చన్నీ కూడా కాన్షీరామ్ మాదిరే ఒకప్పటి అస్పృశ్యులను తనలో ఇముడ్చుకున్న రాందాసియా సిఖ్ పంత్‌కు చెందినవారే. ఇద్దరూ పంజాబ్ లోని ఒకప్పటి రోపార్ జిల్లాకు చెందినవారే. సిక్కుల నాలుగో గురు రాందాస్ చమార్లను, అస్పృశ్యులుగా పరిగణించిన ఇతరులను సిక్కుమతంలో చేర్చుకున్నారు. సిక్కు మత గురువుల బోధనల్లో ఎక్కడా అస్పృశ్యతకు తావు లేదు. అయినప్పటికీ పంజాబ్‌లో జాట్ సిక్కులదే రాజ్యం అయింది. అస్పృశ్యతకు తావు లేదని 1920లలోనే ప్రకటించిన శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ కూడా రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చింది. ఇవాళ చరణ్‌జీత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి కావడం అనేది ఈ నేపథ్యంలో గొప్ప చారిత్రక పరిణామం.


నిజానికి మనదేశంలో ఇంతవరకూ దళితులకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాలేదు. జగ్జీవన్‌రామ్‌కు రాష్ట్రపతి, ప్రధాని అయ్యే అవకాశాలు రెండుసార్లూ అగ్రవర్ణ రాజకీయాల వల్ల తప్పిపోయాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం కూడా దళితులకు చాలా అరుదుగా లభించింది. స్వాతంత్ర్యం తర్వాత కేవలం చన్నీతో కలిపి ఎనిమిది మంది దళితులు మాత్రమే ముఖ్యమంత్రులయ్యారు. వారిలో ఏ ఒక్కరూ తమ పదవీకాలం పూర్తి చేయలేదు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టానని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం అయిదుగురినే దళిత ముఖ్యమంత్రులను చేయగలిగింది. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కేవలం రెండు సంవత్సరాలే పదవిలో కొనసాగారు. అసెంబ్లీకి రిక్షాలో వెళ్లిన చరిత్ర కల దామోదరం సంజీవయ్య కేవలం రెండు సంవత్సరాల్లోనే పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచిపెట్టారు. వృద్ధ్యాప్య పింఛను వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వెనుకబడిన జిల్లాల్లో నీటిపారుదల పథకాలు అమలు చేశారు. అవినీతి నిరోధకబ్యూరోను ఏర్పాటు చేశారు. నిరుపేదగానే చనిపోయిన దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ పార్టీలో సంపన్నుల ప్రాబల్యాన్ని నిరసించారు. 1968–71 మధ్య బిహార్ తొలి దళిత ముఖ్యమంత్రిగా మూడుసార్లు పదవీ బాధ్యతలు చేపట్టిన భోలా పశ్వాన్ శాస్త్రి కూడా ఒకసారి మూడునెలలు, రెండోసారి 13 రోజులు, మూడోసారి ఏడు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. ఏ ఆస్తీ లేకుండానే మరణించిన భోలా పశ్వాన్ శాస్త్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేలపైనే పడుకునేవారట. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్నాథ్ పహాడియా కూడా ఆ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా కేవలం 11 నెలల పాటే కొనసాగారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మించిన మహారాష్ట్రలో స్వాతంత్ర్యం వచ్చిన 56 సంవత్సరాల తర్వాత తొలి దళిత ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ షిండేకి కాంగ్రెస్ అవకాశం కల్పించినప్పటికీ ఆయన కూడా 23 నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. ఇప్పుడు చరణ్‌జీత్ సింగ్ భవితవ్యం పంజాబ్ ఎన్నికల తర్వాత కాని తేలే అవకాశాలు లేవు.


అయినప్పటికీ చరణ్‌జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన ఘనత కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అత్యంత బలహీనంగా ఉన్న దశలో మొట్టమొదటిసారి ఆయన ఒక రాష్ట్రంలో, అందునా ఒక బలమైన ముఖ్యమంత్రిని మార్చి ఆ స్థానంలో దళితుడిని నియమించే సాహసం చేయగలిగారు. నరేంద్రమోదీకి భారతీయ జనతాపార్టీపై ఉన్నంత పట్టు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీపై లేనందువల్లే గుజరాత్‌లో ముఖ్యమంత్రిని మార్చినంత సాఫీగా కాంగ్రెస్ అధిష్ఠానం సరైన సమయంలో పంజాబ్‌లో ముఖ్యమంత్రిని మార్చలేకపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రిని మారుస్తారన్న విషయం ఆ ముఖ్యమంత్రికి కానీ, ఆయన స్థానంలో పదవీబాధ్యతలు చేపట్టిన నేతకు కానీ కొన్ని గంటల ముందు మాత్రమే తెలుసు. జాతీయస్థాయిలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చడం అంత సులభం కాలేదు. పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ సింగ్ కేంద్ర నాయకత్వాన్ని చివరి నిమిషం వరకూ ప్రతిఘటించారు. తిరుగుబాటు చేస్తానని హెచ్చరికలు పంపారు. కేంద్ర నాయకత్వం పంపిన అనేక రాజీ ఫార్ములాలను తిరస్కరించారు. ఆయనను తొలగిస్తే పార్టీ దెబ్బతింటుందని ఢిల్లీలో సీనియర్ నాయకులు సైతం హెచ్చరించారు.


2014లో కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో పరాజయం పాలయిన తర్వాత అమరీందర్ సింగ్ తనకు పంజాబ్‌లో తిరుగులేదనుకున్నారు. మహారాజాలా వ్యవహరించారు. పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండాపోయారు. తన ఇష్టం వచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునేవారు. చండీగఢ్‌లో ఉన్న పంజాబ్ సెక్రటేరియట్‌కు వెళ్లడం మానేసి తన ఇల్లును పొలిమేరల్లో ఉన్న ఫార్మ్‌హౌజ్‌కు మార్చారు. పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలమ్‌తో హిమాచల్‌లోని ఛలియా కొండల మధ్య గడిపేవారు. పూర్తిగా అధికారులకు పాలనను అప్పజెప్పి రాజులా వ్యవహరించిన అమరీందర్ సింగ్ హయాంలో సురేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పరోక్షంగా అధికారం చలాయించేవారు. ఆయనను చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసినా అమరీందర్ సింగ్ సెక్రటేరియట్‌లో కొనసాగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన పట్ల అసమ్మతి తీవ్రంగా పెరిగిపోయింది. ఆఖరుకు ఆయన సతీమణి, మాజీ విదేశాంగమంత్రి ప్రణీత్ కౌర్ కూడా సెంట్రల్ హాల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ అమరీందర్ సింగ్ విలాసాల గురించి చెప్పుకుని వాపోయేవారు. అమృత్‌సర్‌లో జలియన్ వాలా బాగ్ రూపురేఖల్ని మారుస్తూ ఆధునికీకరణ చేయడం అమరుల త్యాగాలను అవమానించడమేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది చారిత్రక స్థలాల కార్పోరేటీకరణేనని చరిత్రకారులు విమర్శించారు. కాని ఈ మార్పులు అద్భుతంగా ఉన్నాయని అమరీందర్ సింగ్ సమర్థించి రాహుల్ గాంధీని వ్యతిరేకించే సాహసం చేశారు. అయినా రాహుల్ మౌనం పాటించారు. క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను పిసిసి అధ్యక్షుడుగా నియమించి అమరీందర్ సింగ్‌కు కళ్లెం వేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ద్వారా కమిటీ ఏర్పరచి సర్దుబాటు చేయాలనుకున్నప్పటికీ లాభం లేకపోయింది. గురుగ్రంథ్ సాహిబ్‌ను అవమానపరిచిన తీవ్రమైన ఘటనలకు సంబంధించి అమరీందర్ సింగ్ సరిగా వ్యవహరించకపోవడం కూడా సిక్కుల్లో వ్యతిరేకతకు దారితీసింది. చివరకు 40 మంది ఎమ్మెల్యేలు సిఎల్‌పి సమావేశం ఏర్పాటు చేయమని డిమాండ్ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ప్రాపకంతో రాజకీయాల్లో ఎదిగిన అమరీందర్ సింగ్ అతడి కుమారుడి హయాంలో నిష్క్రమించారు. పంజాబ్ రాజకీయాల్లో ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న 79 సంవత్సరాల అమరీందర్ సింగ్ తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్‌కు నష్టం చేయగలరేమో కాని ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.


రాహుల్‌గాంధీ పంజాబ్‌లో తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పంజాబ్ ప్రయోగం విజయవంతమయితే అది దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. కాని తాను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చరణ్‌జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించలేదని, అది చైతన్యవంతమైన నిర్ణయమని రాహుల్ గాంధీ తన మాటలు, చేతల ద్వారా నిరూపించుకోవాల్సి ఉన్నది. చన్నీ నియామకం దేశవ్యాప్తంగా దళిత వర్గాల్లో, మేధావుల్లో, ముఖ్యంగా దళిత సానుభూతిపరుల్లో అనుహ్యంగా గొప్ప చర్చకు దారితీసింది. అంటే గతంలో కంటే ఎంతో ఎక్కువగా దళితులు దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని అర్థం. గతంలో మాదిరి దళిత నేతలు డమ్మీలుగా ఉండేందుకు సిద్ధంగా లేరు. ఈ నియామకం ఆమ్‌ఆద్మీ పార్టీ, బిజెపి నాయకులనే కాక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని కూడా బలంగా స్పందించేలా చేసిందంటే దానికి కారణాలు లేకపోలేదు. కాలం అవసరాలను గమనించి అడుగులు ముందుకు వేసే వాడే నాయకుడవుతాడు. అది రాహుల్ కైనా ఎవరికైనా వర్తిస్తుంది.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి