లక్ష్యం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2022-08-11T06:17:48+05:30 IST

బతుకమ్మ చీరల ఉత్పత్తి గడువు దగ్గరపడుతోంది. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగు సందర్భంగా సారె అందించడంతోపాటు నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా చీరలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 4.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు.

లక్ష్యం పూర్తయ్యేనా?
మరమగ్గాలపై బతుకమ్మ చీరలు

- బతుకమ్మ చీరల ఉత్పత్తి గడువు ఐదు రోజులే 

- అందించేందుకు నిరంతరం కృషి 

- కొత్త హంగులతో చీరల తయారీ 

- జాతీయ జెండాల ఆర్డర్లు, పంపిణీతో నిలిచిన ప్రొక్యూర్‌మెంట్‌ 

- 13వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం 

- 4.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి లక్ష్యం

 (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బతుకమ్మ చీరల ఉత్పత్తి గడువు దగ్గరపడుతోంది.     తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగు సందర్భంగా సారె అందించడంతోపాటు నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా  చీరలు  పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది  4.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు.  ఆగస్టు 15 వరకు ఉత్పత్తి పూర్తి చేసేందుకు గడువు పెట్టుకున్నారు. గడువుకు ఐదు రోజులే మిగిలి ఉంది.  ఇప్పటి వరకు 3.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి జరిగింది. గడువులోగా అందించడానికి సిరిసిల్ల మరమగ్గాల కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేతన్నలకు జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు  వచ్చాయి.  అయితే అనుకున్న సమయానికే  బతుకమ్మ చీరలు అందిస్తామన్న దీమాతో జౌళి శాఖ అధికారులు ఉన్నారు. ఈ సారి బతుకమ్మ చీరలు కొత్త హంగులతో అందించనున్నారు. డాబీ, జాకార్డ్‌, జరీ బార్డర్లతో పట్టు చీరలను  పోలినట్లుగా తయారు చేస్తున్నారు. 

 నేత కార్మికులకు భరోసా  

బతుకమ్మ చీరల ఉత్పత్తి  సిరిసిల్ల నేతన్నలకు భరోసా కలగడమే కాకుండా బ్రాండ్‌ ఇమేజ్‌ను కూడా తెచ్చిపెట్టింది. బతుకమ్మ చీరల ఉత్పత్తితో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్తదనం వచ్చింది.   19 డిజైన్లు, 190 వెరైటీల్లో చీరల ఉత్పత్తి జరుగుతోంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో 142 మ్యాక్స్‌ సంఘాలు, 139 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి నెలా రూ.16 నుంచి 18 వేల కూలి అందుకుంటున్నారు. ఈ సారి కూడా గడువులోగా చీరల ఉత్పత్తి పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఆరేళ్లుగా జిల్లాలో 16 వేల మరమగ్గాలపై చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు కోటి చీరలను సిరిసిల్ల నుంచి అందిస్తున్నారు. వస్త్ర సంక్షోభంతో నేత కార్మిక కుటుంబాలు విలవిల్లాడుతూ ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతున్న క్రమంలో వారికి ఉపాధి కల్పించే దిశగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు సారెను అందించాలన్న సంకల్పంతో బతుకమ్మ చీరల ఉత్పత్తికి అడుగు పడింది. 2017 నుంచి బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందిస్తూ ఉత్పత్తి చేయిస్తున్నారు. 2017లో రూ.225 కోట్లు వెచ్చించి 94 లక్షల చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 2018లో రూ.280 కోట్లతో 98 లక్షల చీరలను 80 రంగుల్లో అందించారు. 2019లో రూ.320 కోట్లతో వంద రంగుల్లో జరీ అంచులతో తయారు చేశారు. 2020లో రూ.330 కోట్లతో 225 రంగుల్లో కోటి చీరలను వెండి జరీ అంచుల్లో అందించారు. 2021 సంవత్సరంలో రూ.350 కోట్లతో డాబీ, జాకార్డ్‌లతో దాదాపు 300 వెరైటీలతో చీరలను తయారు చేశారు. ఈ సంవత్సరం రూ.350 కోట్లతో కోటి చీరల తయారీకి ఆర్డర్లు అందించారు. ఇందు కోసం 4.50 కోట్ల బట్ట ఉత్పత్తి వేగంగా జరుగుతోంది. ఆగస్టు 15లోగా ఉత్పత్తి ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 3.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి జరిగింది. టెస్కొ ద్వారా 90 లక్షల మీటర్లు కొనుగోలు జరిగింది. కొనుగోలు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో  తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వడంతో చేనేత జౌళి శాఖ సిబ్బంది ఆపనుల్లో ఉండిపోయారు. దీంతో బతుకమ్మ బట్ట సేకరణ నిలిచిపోయింది. ఈ నెల 13 నుంచి తిరిగి మళ్లీ బట్టను తీసుకోనున్నారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో బట్టను తనిఖీ చేసి ప్రాసెసింగ్‌కు వెంట వెంటనే పంపిస్తున్నారు. ప్రస్తుతం తయారవుతున్న కోటి చీరల్లో 90 లక్షలు 6.3 మీటర్లపొడవుతో యువతులు, మహిళలకు కట్టుకునే విధంగా మరో 10 లక్షల చీరలు వృద్ధుల కోసం 9 మీటర్లతో తయారు చేయిస్తున్నారు. 


Updated Date - 2022-08-11T06:17:48+05:30 IST