ఆర్థికమంత్రి చతురత ఓట్లు తెచ్చేనా?

ABN , First Publish Date - 2022-02-04T06:16:34+05:30 IST

కొత్తబడ్జెట్ వచ్చేసింది. దాన్ని సమర్పించడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక అత్యంత క్లిష్ట కార్యమే అయి ఉంటుందనడంలో సందేహం లేదు...

ఆర్థికమంత్రి చతురత ఓట్లు తెచ్చేనా?

కొత్తబడ్జెట్ వచ్చేసింది. దాన్ని సమర్పించడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక అత్యంత క్లిష్ట కార్యమే అయి ఉంటుందనడంలో సందేహం లేదు. నిశిత మేధ, పదునైన మాట, రాజకీయ అవకాశాన్ని బహుచక్కగా వినియోగించుకోగల చతురత ఆమె సొంతమే అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రక్రియ నిర్వహణ అంత తేలికైన విషయమా?


ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని సాధించే దిశగా శీఘ్రగతిన పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ప్రధాన బాధ్యురాలు ఆమె. మరి అదే ఆర్థిక వ్యవస్థలోని 80 శాతం కుటుంబాల ఆదాయాలు గత రెండు సంవత్సరాలుగా అంతకంతకూ తగ్గి పోతున్నాయనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. ఆ కుటుంబాలలో అత్యధిక భాగం తాము ఆదా చేసుకున్న సొమ్మును ఉపయోగించుకునో లేదా రుణాలు తీసుకోవడం ద్వారానో ప్రస్తుత కష్టకాలాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాయి. నిరుద్యోగిత మున్నెన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఇటీవల ఉద్యోగ ఆశోపహతులు అసహన, అరాచక అల్లర్లకు పాల్పడడంలో ఆశ్చర్యమేముంది?


చిన్న తరహా వ్యాపారస్తుల- నిర్మలా సీతారామన్ పార్టీ బీజేపీకి సంప్రదాయ మద్దతుదారులు- పరిస్థితి సరైన రీతిలో లేదు. తొలుత నోట్ల రద్దు, పిదప వస్తు సేవల పన్ను, ఆపై లాక్‌డౌన్ వారిని మొదలంటా కూల్చి వేశాయి. అన్నట్టు రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరాంతంలోగా రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లోనే వాగ్దానం చేశారు కదా. ఆ హామీని దృష్టిలో ఉంచుకునే అసంఖ్యాక అన్నదాతలు 2022–23 బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఈ దేశ రైతుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరిందెప్పుడు? మహారాజశ్రీ పాలకులు కొత్తగా కనుగొన్న ‘అమృత్ కాల్’కు కొన్ని కాంతి సంవత్సరాల ఆవల మాత్రమే ‘రెట్టింపు ఆదాయం’ హామీ నెరవేరగలదనే నిజం రైతులోకానికి అర్థమయింది.


మన వర్తమాన ఆర్థిక ఇతిహాసం కీర్తికాంతులు ఇంతే కాదు సుమా! మన సీతారామన్ ‘పరిపూర్ణ ప్రజాస్వామ్యం’, ‘సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ’ విలసిల్లుతున్న దేశానికి ఆర్థికమంత్రి కదా. అవగాహనలను ప్రభావితం చేయాలి. దృక్కోణాలను రూపొందించాలి. ప్రజలను మచ్చిక చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు వారు విధిగా పాటించేలా చేయాలి.


ఆంగ్ల భాషనూ, అర్థశాస్త్రాన్ని ఇచ్చినందుకు మనం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రెండూ చాలా అందమైన జత. సౌందర్యద్వయం. ఆర్థికవ్యవస్థ వ్యవహారాల వాస్తవాలను కప్పిపుచ్చడంలో వాటికవే సాటి. ఈ పనిలో ఒకటి విఫలమయినా ఇంకొకటి అలరిస్తుంది. మన దేశ జనాభాలో అత్యధికులు సమాచారాన్ని చాలావరకు తమ తమ మాతృభాషల ద్వారానే తెలుసుకుంటారు. అయితే బడ్జెట్ విధానకర్తలు కానీ లేదా ఆ వార్షిక పద్దులపై వ్యాఖ్యానాలు చేసేవారు గానీ మన భారతీయ భాషల్లో వివేచించరు; భావ వ్యక్తీకరణ చేయరు. ఆర్థిక వ్యవస్థ గురించిన సమాచారం ఆంగ్ల భాషలోనే రూపొందుతుంది. ఇతర భాషలు ఆ జ్ఞానాన్ని విస్తరింపచేస్తాయి.


మీడియాకు నిర్మలా సీతారామన్ కృతజ్ఞతాబద్ధురాలుగా ఉండి తీరాలి. కేంద్ర వార్షిక బడ్జెట్ ఒక టెలివిజన్ వినోదం అయిననాటి నుంచీ ఆర్థికవ్యవస్థ గురించి అనంతంగా సమాచారం మన కళ్లు, చెవుల ద్వారా మనసులో కిక్కిరిసిపోతుంది. అయితే అందులో మనం అవగాహన చేసుకునేది చాలా చాలా చాలా తక్కువ. ప్రభుత్వ విధానాలకు ఆశ్చర్యపోతున్న, పాలకులకు భయపడుతున్న, అధికార వర్గాల తోడ్పాటు అవసరమైన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలు ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారుగా మీడియా బజార్‌లో వెలిగిపోతున్నారు. అంతకంటే తక్కువమంది ఆంగ్ల భాషా ప్రావీణ్యులైన ఆర్థికవేత్తలు (వీరిలో అత్యధికులు సర్కారీ, దర్బారీ సేవకులు!), లేదా ఏదో ఒక వ్యాపారరంగ ప్రయోజనాలకు కాపు కాస్తున్నవారు ఆర్థిక వ్యవస్థ గురించిన జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ప్రయోజనాలు పరస్పరం సంఘర్షించుకుంటున్నాయా? నేనైతే వినలేదు. ఇక అజ్ఞానులు, రాజీపడిన వారు లేదా రెండూ అయిన యాంకర్లు సదరు చర్చా కార్యక్రమాలను చాలా నేర్పుగా నిర్వహిస్తుంటారు. వీరంతా కలసికట్టుగా ఒక అసంబద్ధతను సృష్టిస్తారు.


ఇదిగో, ఆ అసంబద్ధత ఏమిటో చెబుతాను. బడ్జెట్ ప్రసంగపాఠంలోని సంఖ్యలు, బడ్జెట్ పత్రాలలోని అంకెలు పరస్పర పొంతన కలిగి ఉంటాయా? ఉండవు. పాలకులు గతంలో ఇచ్చిన హామీలు, వారి ప్రస్తుత పనితీరుకు మధ్య సంబంధముంటుందా? అధికారంలో ఉన్నవారి వాదనలకు, ప్రజల జీవితాలలోని సత్యాలకు మధ్య లంకె ఏమైనా ఉంటుందా? ఉండదుగాక ఉండదు. ఆర్థిక సర్వేలో ఉటంకించిన అంకెలు, మరుసటి రోజు సమర్పించిన బడ్జెట్‌లోని భోగట్టాకు విరుద్ధంగా ఉన్న విషయం వెల్లడయింది ఎప్పుడో గుర్తు చేసుకోండి. కొవిడ్ కాలంలో, బాధితులకు అందిస్తున్న సహాయం గురించి ఆర్థిక మంత్రి ప్రతి రోజూ వెల్లడించిన వివరాలు గుర్తున్నాయా? మరి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ విషయమై ఆమె ఎందుకు అంతగా మౌనం పాటించారు? పాలకుల తీరు అసంబద్ధంగా కాకుండా మరెలా ఉంటుంది? ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం వెలువరిస్తుండగా ఆమె పార్టీ వారే మహా ఇబ్బంది పడిపోవడం మీరు గమనించలేదా? ఇదంతా చాలదన్నట్టు రైతులకు డ్రోన్లు, పాత పథకాల పునఃనామకరణం, పాత హామీల పునరుద్ఘాటన, సంక్షిప్తమాటలు మొదలైన వాటిని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో విస్తారంగా ప్రస్తావించారు. అవన్నీ బడ్జెట్ వార్తలుగా ప్రజల ముందుకు వచ్చాయి.


మీడియాను మనకు అనుకూలంగా ఉంచుకోగలిగితే సగం పని పూర్తయినట్టే, అయితే రాజకీయ నిర్వహణ (పొలిటికల్మేనేజ్‌మెంట్- వృత్తి రాజకీయాలకు సంబంధించిన సమస్త వ్యవహారాలు) మాటేమిటి? ఎన్నికలలో విజయం సాధించేందుకు ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలి. ఇందుకు మెచ్చదగిన ఆంగ్ల భాషా పరిజ్ఞానం, పనికి మాలిన అర్థశాస్త్ర పాండిత్యానికి మించినది తప్పకుండా అవసరమవుతుంది. సీతారామన్ గారూ, లద్దాఖ్‌లో చైనా సైనిక దళాలను భారత సైన్యం చావుదెబ్బలు కొట్టిందని ఒక ఓటరు విశ్వసించేలా చేయడంలో టీవీ ఛానెల్స్ మీకు తప్పక సహాయపడతాయి. అయితే తాను ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఒక నిరుద్యోగిని మీరు ఎలా ఒప్పించగలరు? తమ ఆదాయం రెట్టింపు అయిందని రైతులను ఎలా నమ్మించగలరు?


ఆర్థిక మంత్రిగారూ, మీరు శ్రద్ధ చూపుతున్నారో లేదో నాకు తెలియదుగానీ, అందుకు ఒక రాజకీయ వ్యూహమూ, దాన్ని పటిష్ఠపరచగల ఒక రాజకీయ యంత్రాంగమూ ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌నే తీసుకోండి. రైతులకు లేదా నిరుద్యోగ యువతకు తోడ్పడే ఒక ప్రధాన సంక్షేమ పథకాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో ప్రకటించేందుకు అవకాశముంది. అయితే ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఆ అంశాల గురించికాదు. అవి, ‘మిస్టర్ జిన్నా’, అయోధ్యలో ఆలయం, కాశీలో కారిడార్, సమాజ్‌వాదీ పార్టీ పాలనలో ‘గూండా రాజ్’ గురించి కదా. ఇదీ, విజయానికి తోడ్పడే చిట్కా: హిందూ- ముస్లిం ఉద్రిక్తతలు కొనసాగేలా చూడాలి. ధనబలం, కండ బలం, మీడియా మద్దతుతో కుల సంకీర్ణాలను కూడగట్టాలి. ఆంగ్ల భాషా నైపుణ్యంతో పనికిమాలిన అర్థ శాస్త్ర పాండిత్యాన్ని దూరంగా ఉంచాలి. పరిస్థితి చేయిదాటితే అదనపు రేషన్ కార్డుల జారీ, నగదు బదిలీ పథకాలు ఉండనే ఉన్నాయి కదా. ఒక అత్యంత కఠినతరమైన కార్యాన్ని సమర్థంగా నిర్వహించినందుకు ప్రతి టీవీ మేధావి వలే నేనూ నిర్మలా సీతారామన్‌కు సలాం చేస్తున్నాను. బడ్జెట్ ప్రక్రియను ఆమె ప్రతిభావంతంగా నిర్వహించినట్టు ప్రతి పది మందిలో ఎనిమిది మంది తప్పకుండా అంగీకరిస్తారని నాకు నిశ్చయంగా తెలుసు.


యోగేంద్ర యాదవ్

Updated Date - 2022-02-04T06:16:34+05:30 IST