కోర్టు ధిక్కార చర్యలు చేపట్టేవరకు స్పందించరా?

ABN , First Publish Date - 2022-05-07T08:19:11+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ‘

కోర్టు ధిక్కార చర్యలు చేపట్టేవరకు స్పందించరా?

ఆదేశాలను పట్టించుకోకపోవడం అలవాటుగా మారింది..

యూపీ సర్కారుపై జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 6: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ‘‘కోర్టు ఆదేశాలను అమలుచేయరు. ధిక్కార చర్యలు తీసుకునే సమయంలో వస్తారు. మీ రాష్ట్రానికి ఇది అలవాటుగా మారింది’’ అని యూపీ తరఫున హాజరైన అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ను ఉద్దేశించి జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. గతేడాది యూపీలోని ఓ ఆస్పత్రి నుంచి కొవిడ్‌ రోగి అదృశ్యమైనట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రోగి కుటుంబసభ్యులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. సదరు వ్యక్తిని మే 6న కోర్టులో హాజరుపరచాలని, లేనిపక్షంలో అధికారులు కోర్టుకు రావాలని ఆదేశాలిచ్చింది. దీన్నుం చి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలుచేసింది. దీనిపై జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు సమన్లు జారీచేయడంతో అధికారులు చివరి నిమిషంలో సుప్రీంకు రావడంపై జస్టిస్‌ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు వ్యక్తిని గుర్తించడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనికి స్పందిస్తూ... 82 ఏళ్ల వయసున్న, నడవలేని వ్యక్తి ఆస్పత్రి నుంచి ఎలా మిస్సవుతారని బెంచ్‌ ప్రశ్నించింది. కుటుంబసభ్యులకు కోర్టు ఖర్చుల కింద తొలివిడతగా 50వేలు ఇవ్వాలని యూపీని ఆదేశించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అక్కడికే వెళ్లాలని జస్టిస్‌ రమణ పిటిషనర్లకు సూచించారు.

Read more