రాజ్యాంగ వ్యవస్థల్నీ కుల పంకిలంలోకి లాగుతారా?

ABN , First Publish Date - 2020-03-20T08:42:40+05:30 IST

తమనిర్ణయాలను వాయిదా వేసిన, ప్రశ్నించిన వ్యవస్థలను, వ్యక్తులను చిదిమేసేందుకు వెనుకాడని దుష్ట సంస్కృతి రాష్ట్రంలో నెలకొన్నది. అధికారంలో ఉన్న వైకాపా వ్యవహారం...

రాజ్యాంగ వ్యవస్థల్నీ కుల పంకిలంలోకి లాగుతారా?

రాజధానికి కులం ఆపాదించారు, ఎన్నికల సంఘానికి కులం ఆపాదించారు. ఎన్నికలు సంఘం ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. మరి ఇప్పుడు సుప్రీం కోర్టుకు కూడా కులం ఆపాదిస్తారా? కరోనా సమస్యే కాదనీ, ఎన్నికలే ముఖ్యమన్న తీరులో ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం చూస్తుంటే.. వీరికి ఎన్నికల్లో గెలుపు సాధించడంపై వున్న ప్రేమ, ప్రజల ప్రాణాలపై లేదని అర్థం అవుతుంది.


తమనిర్ణయాలను వాయిదా వేసిన, ప్రశ్నించిన వ్యవస్థలను, వ్యక్తులను చిదిమేసేందుకు వెనుకాడని దుష్ట సంస్కృతి రాష్ట్రంలో నెలకొన్నది. అధికారంలో ఉన్న వైకాపా వ్యవహారం నియంతృత్వానికి, సంకుచిత రాజకీయానికీ నిర్వచనంగా మారుతోంది. ప్రజాప్రయోజనాల కన్నా తమ రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వ్యవస్థల పట్ల, వ్యక్తుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను మంట కలుపుతున్నారు.


ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్ల కింద భూమి కంపించినట్లుగా వ్యవహరించారు. ఎన్నికలు వాయిదా వేయడంతో ఎన్నికల కమీషన్ మీద ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ హద్దులు దాటి ఆరోపణలు చేశారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయడాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయిన పది నెలల్లో ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసిందని తెలియగానే ఆగమేఘాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సంఘంపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. రాష్ట్రంలో అధికారం ముఖ్యమంత్రిదా రమేష్ కుమార్‍దా? అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమీషన్ అధికారాల గురించి ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి ముందు తన అధికార పరిధి ఏమిటో గుర్తించాలి. 151మంది ఎమ్మెల్యేలు వున్నారని రాజ్యాంగ వ్యవస్థ మీకు అనుకూలంగా భజన చేయాలి అంటే ఎలా సాధ్యం?


హైకోర్టు జడ్జితో సమానమైన హోదా కలిగిన రాజ్యాoగబద్ధ పదవి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ది. అటువంటి హోదా వున్న వ్యక్తికీ దురుద్దేశ్యాలు ఆపాదించడం చట్ట ఉల్లంఘనే. అందులోనూ బాధ్యతాయుతమైన పదవిలో వున్న ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజంలో కుల విద్వేషాలు ప్రబలే ప్రమాదం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారు రాజ్యాంగ వ్యవస్థల విలువలను, గౌరవాన్నికాపాడాలి. ముఖ్యమంత్రి తన స్థాయిని మరచి కమీషన్ కి కులం ఆపాదించడంతో ఆయనలోవున్న మరుగుజ్జు నాయకత్వం బయటపడ్డది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేస్తే ప్రతిపక్షనాయకుడికీ, ఎన్నికల సంఘానికీ కులం ఆపాదించడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నించజాలరు. ఎన్నికల కమీషన్ స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా బెదిరింపు ధోరణితో మంత్రులు, స్పీకర్ ఆవేశంతో వీరంగాలు చేశారు. కరోనా వైరస్సా, కమ్మ వైరస్సా అని స్పీకర్ చాలా నీచమైన స్థాయిలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే అధికారిపై అంత వ్యక్తిగతంగా ఎలా దాడి చేస్తారు? ఎన్నికలు వాయిదా వేయడాన్ని పార్టీ అధినేతగా జగన్ తప్పుపట్టవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికలు నిర్వహించవచ్చని సియస్‌తో ఎన్నికల సంఘానికి లేఖ రాయించడం అంటే అది రాజ్యాంగం మీద దాడే అవుతుంది. స్వార్థమే పరమావధిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. రాజధానికి కులం ఆపాదించారు, ఎన్నికల సంఘానికి కులం ఆపాదించారు. ఎన్నికలు సంఘం ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. మరి ఇప్పుడు సుప్రీం కోర్టుకు కూడా కులం ఆపాదిస్తారా? కరోనా సమస్యే కాదనీ, ఎన్నికలే ముఖ్యమన్న తీరులో ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం చూస్తుంటే.. వీరికి ఎన్నికల్లో గెలుపు సాధించడంపై వున్న ప్రేమ, ప్రజల ప్రాణాలపై లేదని అర్థం అవుతుంది.


రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసిన తరువాత ఇంత కాలం వైకాపాకి అనుకూలంగా వున్న బిజెపి నాయకులు కూడా మొత్తం ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా బిజెపిని ఒక్క మాట అనకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఒక్క తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి మాత్రమే అం టగట్టడం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే. ఎన్నికలు రద్దు చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించినా ఒక్క చంద్రబాబు పైనే ముఖ్యమంత్రి, మంత్రులు విరుచుకుపడటం కూడా రాజకీయ ప్రయోజనం కోసమే. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో చం ద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చీఫ్ సెక్రటరీని ఎన్నికల సంఘం మార్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా వున్న జగన్ ఆనందపడ్డారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబా, ఎన్నికలసంఘమా- అని జగన్ ఎందుకు అడగలేదు? మీకు అనుకూలంగా వ్యవహరిస్తే ఒకరకంగానూ, మీకు నచ్చినట్లు చెయ్యకపోతే మరోరకంగానూ మాట్లాడటం ఏమిటి? కరోనా ఉధృతి గ్రహించే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించిన తరువాతనే ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తే, కరోనా వైరస్ అసలు సమస్యే కాదన్నట్లు సియం జగన్ మాట్లాడటం సమర్థనీయం కాదు? ప్రపంచమంతా విపత్తుగా భావిస్తున్న కరోనా వైరస్‍పై చులకనగా మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఎన్నికలు వాయిదా పడితే కేంద్రం నుండి నిధులు రావని ప్రభుత్వం చెప్పటం కూడా బూటకమే. బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా మూలంగా వాయిదా వేశాయి.


స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన దగ్గర నుండి రాష్ట్రంలో మున్నెన్నడు ఎరుగని విధంగా విచిత్ర విన్యాసాలు సాగాయి. అధికార పార్టీ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. పది నెలల అధికారంలో తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి రాష్ట్ర ప్రజలను ఓట్లు అడగాల్సినవారు, అక్రమాలకు, అరాచకానికి, బెదిరింపులకు దిగుతున్నారు. ఒక పక్కన ప్రజలు హర్షించే పాలన తాము అందించామనీ నమ్మకంగా చెబుతున్నారు. జగన్ పరిపాలన జనరంజక పరిపాలన అని మంత్రులు కీర్తనలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపిదే విజయం అంటున్నారు. మరి అంత భరోసా వున్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థపై కులం పేరిట దాడి చేయడంఎందుకు? మీది నిజంగా ప్రజలు మెచ్చే పాలనే అయితే ప్రజలు స్థానిక సంస్థల్లో  మీకే బ్రహ్మరథం పడతారు కదా? దౌర్జన్యాలకు, దాడులకు ఎందుకు దిగాల్సి వచ్చింది? మీ పరిపాలన నిజంగా అంత బ్రహ్మాండంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా అసహన వాతావరణం ఎందుకు విజృంభించింది? మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాత్రమే రాజ్యాంగ వ్యవస్థలు పని చేయలనుకోవడం దేన్ని సూచిస్తోంది? మీ ప్రయోజనాలే ముఖ్యమైతే మరి ప్రజా ప్రయోజనాలమాటేమిటి? రాష్ట్ర రాజకీయం అంతా కుట్రలమయం అయింది. అధికార దాహంతో విచక్షణ మరిచి రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ స్వార్థ నాయకుల దుష్ట పన్నాగాలను ఎదిరించి రాజ్యాంగ సంస్థలనూ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రజలపైనే ఉన్నది.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2020-03-20T08:42:40+05:30 IST